Mrunal Thakur: డ్రస్సుల కోసం రెండు వేలకు మించి ఖర్చు పెట్టను!

అందాల నాయికలు తమ అందంతోనే కాదు.. ఫ్యాషన్‌ ఎంపికలతోనూ మైమరపిస్తుంటారు. వాళ్లు ధరించే ఒక్కో డ్రస్‌ చూస్తే.. ఎన్ని వేలు ఖర్చు పెట్టి కొన్నారో అనిపిస్తుంటుంది. పైగా వాళ్లంత ఖర్చు పెట్టడానికీ వెనకాడరనుకుంటాం. కానీ తన దృష్టిలో ఇది వృథా ఖర్చు అంటోంది టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.

Published : 06 Apr 2024 11:45 IST

(Photos: Instagram)

అందాల నాయికలు తమ అందంతోనే కాదు.. ఫ్యాషన్‌ ఎంపికలతోనూ మైమరపిస్తుంటారు. వాళ్లు ధరించే ఒక్కో డ్రస్‌ చూస్తే.. ఎన్ని వేలు ఖర్చు పెట్టి కొన్నారో అనిపిస్తుంటుంది. పైగా వాళ్లంత ఖర్చు పెట్టడానికీ వెనకాడరనుకుంటాం. కానీ తన దృష్టిలో ఇది వృథా ఖర్చు అంటోంది టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. తన వార్డ్‌రోబ్‌ చాలా సింపుల్‌గా ఉంటుందని, దుస్తుల కోసం పెట్టే ఖర్చు విషయంలో చాలా పొదుపుగా వ్యవహరిస్తానంటూ తాజాగా ఓ సందర్భంలో పంచుకుంది. మరి, ఈ ‘ఫ్యామిలీ స్టార్’ భామ తన ఫ్యాషన్‌ ఎంపికల గురించి ఇంకా ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించి.. ఆపై వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న అందాల నాయికలు చాలామందే ఉన్నారు. వారిలో మృణాల్‌ ఠాకూర్‌ ఒకరు. ‘కుంకుమ్‌ భాగ్య’ సీరియల్‌లో నటించి మెప్పించిన ఈ భామ.. ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ‘సీతారామం’తో తెలుగు వారికీ పరిచయమైంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల తార.. తాజాగా విజయ్‌ దేవరకొండ సరసన ‘ది ఫ్యామిలీ స్టార్‌’ సినిమాతో మన ముందుకొచ్చింది.

అద్దెకు తెచ్చుకుంటా!

ఫ్యాషన్‌ ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన ఫ్యాషన్లను, డిజైనర్‌ దుస్తుల్ని ప్రయత్నించడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. నచ్చితే చాలు.. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొనేస్తుంటారు. అయితే ఒకట్రెండుసార్లు వేసుకొని పక్కన పడేసే దుస్తుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం వృథానే అంటోంది మృణాల్‌.

‘ఖరీదైన దుస్తుల్ని చాలా అరుదుగా వేసుకుంటాం.. కొంతమందైతే వీటిని ఒకట్రెండు సార్లు వేసుకొని పక్కన పెట్టేస్తుంటారు. వీటిని పునరావృతం చేయడానికి ఇష్టపడరు. డిజైనర్‌ దుస్తులూ ఇలాంటివే! నేనైతే దీన్ని వృథా ఖర్చుగానే పరిగణిస్తా. అందుకే ఇలాంటి డిజైనర్‌ అవుట్‌ఫిట్స్‌పై అస్సలు డబ్బు ఖర్చు పెట్టను. ఇక ప్రమోషన్లు, ఈవెంట్లు, ఇతర కార్యక్రమాల కోసం.. నేను వేసుకొనే దుస్తులంటారా? అవి బయటి నుంచి అద్దెకు తెచ్చుకుంటా. దీనివల్ల డబ్బూ ఆదా అవుతుంది. ఆయా దుస్తుల్ని ధరించామన్న సంతృప్తీ కలుగుతుంది..’ అంటోందీ ‘ఫ్యామిలీ స్టార్’ బ్యూటీ.

ట్రెండ్‌ ఫాలో అవ్వను!

మార్కెట్లోకొచ్చిన కొత్త కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవడమంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఇలా ప్రతి ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్‌నీ కొనేసి తమ వార్డ్‌రోబ్‌ని నింపేస్తుంటారు ఫ్యాషన్‌ ప్రియులు. కానీ తాను మాత్రం ఇందుకు పూర్తి భిన్నం అంటోంది మృణాల్‌. తన ఫ్యాషన్‌ ఎంపికలు ఎంత సింపుల్‌గా ఉంటాయో.. తన వార్డ్‌రోబ్‌ అంతకంటే సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా ఉంటుందంటోందీ బ్యూటీ.

‘దుస్తులపై ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం నాకు నచ్చదు. నేను ఒక టాప్‌ కొనాలంటే అందుకు రూ. 2 వేలకు మించి ఖర్చు చేయను. అది కూడా నా మనసుకు బాగా నచ్చితేనే! ఇక దుస్తులకు తగ్గట్లుగా యాక్సెసరీస్‌/ఆభరణాలు కొనడం తప్పు కాదు.. కానీ బ్రాండెడ్‌ అంటూ వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం నాకు నచ్చదు. ఉదాహరణకు నా వార్డ్‌రోబ్‌లో వెయ్యి రకాల దుస్తులుంటే అందులో యాక్సెసరీస్‌/స్టేట్‌మెంట్‌ జ్యుయలరీ వంటివి చాలా కొన్ని మాత్రమే ఉంటాయి. ఎక్కువసార్లు వాటినే రిపీట్‌ చేస్తుంటా. మార్కెట్లోకొచ్చే సరికొత్త ట్రెండ్స్‌పై పెట్టుబడి పెట్టను. ఎందుకంటే ఒక ట్రెండ్‌ ఆరు నెలలు, మహా అయితే ఏడాదికి మించి ఉండదు.. ఆ తర్వాత కనుమరుగైపోతుంది. అలాంటి వాటిపై పెట్టే డబ్బును ఇళ్లు, ఆహారం, మొక్కల పెంపకం, వ్యవసాయం.. మొదలైన వాటి కోసం ఖర్చు పెడతా..’ అంటోందీ బాలీవుడ్‌ అందం.

ఇలా ఫ్యాషన్‌ విషయంలో తన రూటే సెపరేటు అంటోన్న మృణాల్‌.. అందం విషయంలో ఈ సమాజం నిర్దేశించిన సౌందర్య ప్రమాణాల్ని పట్టించుకోనంటోంది. గతంలో తన శరీరాకృతి విషయంలో పలు విమర్శల్ని ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. ఆపై రియలైజై తన శరీరాన్ని తాను అంగీకరించడం, ప్రేమించడం మొదలుపెట్టింది. ఈ ఆత్మవిశ్వాసమే తనను తెరపై ప్రత్యేకంగా నిలబెట్టిందంటూ తన మాటలతోనూ ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతోందీ భామ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్