ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!

ఫ్యాషన్‌ షోలు, ర్యాంప్‌వాక్‌లు మన అందాల తారలకు కొత్త కాదు. కానీ ఆయా ఈవెంట్లలో వారు ధరించే విభిన్న దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.. ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకుంటాయి. టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా అలాంటి అవుట్‌ఫిట్‌లోనే తళుక్కున మెరిసింది.

Published : 07 May 2024 13:06 IST

(Photos: Instagram)

ఫ్యాషన్‌ షోలు, ర్యాంప్‌వాక్‌లు మన అందాల తారలకు కొత్త కాదు. కానీ ఆయా ఈవెంట్లలో వారు ధరించే విభిన్న దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.. ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకుంటాయి. టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా అలాంటి అవుట్‌ఫిట్‌లోనే తళుక్కున మెరిసింది. ‘బాంబే టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ కోసం ఆమె ఎంచుకున్న డ్రస్‌ ప్రస్తుతం ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచింది. ఆ లెహెంగా థీమ్‌ దగ్గర్నుంచి తయారీ దాకా పలు ప్రత్యేకతలుండడమే ఇందుకు కారణం! మరి, మృణాల్‌ ధరించిన ఆ లెహెంగా విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

ఫ్యాషన్‌ షోలలో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన అందమైన దుస్తుల్ని ధరించి ర్యాంప్‌వాక్‌ చేస్తుంటారు సినీ తారలు. ఈ క్రమంలోనే విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ని ప్రదర్శిస్తూ ఆయా లేబుల్స్‌కి షో స్టాపర్స్‌గా నిలుస్తుంటారు. ఇదే విధంగా తాజాగా ‘బాంబే టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’లో భాగంగా మృణాల్‌ సంప్రదాయబద్ధమైన లెహెంగా ధరించి మెరిసిపోయింది.

పింక్‌ లెహెంగా.. ప్రత్యేకతలెన్నో!

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్‌ అను పెల్లకూరు రూపొందించిన లెహెంగా అది. ‘స్వర్ణి రాహా’ పేరుతో తాను డిజైన్‌ చేసిన కొత్త కలెక్షన్‌లో భాగంగా దీన్ని ప్రదర్శించారు అను. పింక్‌ కలర్‌ లెహెంగాపై భారీ ఎంబ్రాయిడరీతో హంగులద్దారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మేళవించేలా పువ్వులు, ఆకుల థీమ్‌తో ఈ లెహెంగాపై ఫ్లోరల్‌ మోటిఫ్స్‌ను రూపొందించారామె. గోల్డెన్‌ సిల్క్‌ దారాలు, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఈ భారీ లెహెంగాకు జతగా ప్లంజింగ్‌ నెక్‌లైన్‌ బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేశారు. ఇక దీనికి అనుసంధానించిన బటర్‌ఫ్లై హెమింగ్‌ బ్లౌజ్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. ఇలా హెవీ ఎంబ్రాయిడరీ లెహెంగా ధరించిన మృణాల్‌ మ్యాచింగ్‌ కలర్‌, మ్యాచింగ్‌ ఎంబ్రాయిడరీ షీర్‌ దుపట్టాతో మెరుపులు మెరిపించింది. అను ఫ్యాషన్‌ లేబుల్‌ తలాషా నుంచి ఎంచుకున్న ఈ లవ్లీ లెహెంగాను రూపొందించడానికి 1400 గంటల సమయం పట్టిందట!

‘ట్యాలెంటెడ్‌ డిజైనర్‌ అనుతో కలిసి ఇలా ర్యాంప్‌వాక్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. 1400 గంటలు వెచ్చించి తాను ఈ అందమైన లెహెంగా రూపొందించింది. ఫ్లోరల్‌ మోటిఫ్స్‌తో హంగులద్దిన దుస్తులంటే నాకు ముందు నుంచే చాలా ఇష్టం. ఈ వేసవికి ఇది చక్కగా నప్పుతుంది.. సౌకర్యాన్నీ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు ఈ తరహా లెహెంగాను ఎంచుకుంటే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు..’ అంది మృణాల్.


రెండుసార్లు కాలేజ్‌ డ్రాపౌట్..!

భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటాం.. కానీ మనలో ఉన్న తృష్ణే మనకు చక్కటి కెరీర్‌ దారి చూపుతుంది. డిజైనర్‌ అను పెల్లకూరు విషయంలోనూ ఇదే జరిగింది. భవిష్యత్తులో నటిగా, డ్యాన్సర్‌గా, టీచర్‌గా.. ఇలా వివిధ రంగాల్లో రాణించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న ఆమె.. అంతిమంగా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ని తన కెరీర్‌గా మలచుకుంది.

రెండుసార్లు కాలేజీ మధ్యలోనే చదువు ఆపేసిన ఆమెకు.. అదే సమయంలో ఓ అద్భుతమైన అవకాశం తలుపుతట్టింది. అప్పటికే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ప్రాథమిక నైపుణ్యాలు ఒంటబట్టించుకున్న అను ‘మిస్‌ యూఏఈ ఫైనలిస్ట్‌’ కోసం మూడు అవుట్‌ఫిట్స్‌ రూపొందించాల్సిందిగా కాంట్రాక్ట్‌ అందుకుంది. ఇక ఆపై వెనుతిరిగిచూడలేదామె.

‘తలాషా’ పేరుతో ఓ ఫ్యాషన్‌ లేబుల్‌ని ప్రారంభించిన ఆమె.. చేతి అల్లికలతో హుందాగా దుస్తులు రూపొందించడంలో దిట్ట. సింప్లిసిటీకి, హుందాతనానికి మారుపేరుగా నిలిచే ఆమె ఫ్యాషన్లంటే అటు సెలబ్రిటీలకు, ఇటు సామాన్యులకు ఎంతో మక్కువ. ప్రస్తుతం రెజీనా, క్యాథరిన్‌, బిందు మాధవి.. తదితర నటీమణులకు దుస్తులు రూపొందిస్తున్నారు అను. లెహెంగా దగ్గర్నుంచి గౌన్లు, జంప్‌సూట్స్‌, అనార్కలీ సెట్స్‌, షరారా సెట్స్‌, పలాజో సెట్స్‌, కో-ఆర్డ్‌ సెట్స్‌, కుర్తా సెట్స్‌.. ఇలా అను రూపొందించే విభిన్న దుస్తులు ఆమె ఫ్యాసన్ సెన్స్‌కు అద్దం పడుతుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్