అలాంటి వారికి ఈమె కథ.. ఓ స్ఫూర్తి!

‘జీవన పోరాటంలో ఆయుధాలు అవసరం లేదు.. సంకల్ప బలం కావాలి..’ అన్నాడో మహానుభావుడు. ఈ మాటల్ని తన చేతలతో నిరూపిస్తోంది పశ్చిమ బంగాలోని శాంతీపూర్‌కు చెందిన పాతికేళ్ల పియాషా మహల్దార్‌. పుట్టుకతోనే దివ్యాంగురాలైన ఆమె రెండున్నర అడుగులకు మించి ఎత్తు పెరగలేదు. తన వైకల్యం కారణంగా.....

Published : 09 Nov 2022 18:59 IST

‘జీవన పోరాటంలో ఆయుధాలు అవసరం లేదు.. సంకల్ప బలం కావాలి..’ అన్నాడో మహానుభావుడు. ఈ మాటల్ని తన చేతలతో నిరూపిస్తోంది పశ్చిమ బంగాలోని శాంతీపూర్‌కు చెందిన పాతికేళ్ల పియాషా మహల్దార్‌. పుట్టుకతోనే దివ్యాంగురాలైన ఆమె రెండున్నర అడుగులకు మించి ఎత్తు పెరగలేదు. తన వైకల్యం కారణంగా కూర్చోలేదు కూడా. అయినా అధైర్యపడకుండా బాగా చదువుకోవాలని సంకల్పించుకుంది. చిన్నతనం నుంచీ అన్ని అంశాల్లో మేటిగా నిలిచిన ఆమె.. ఈ ఏడాది యూజీసీ-నెట్‌ పరీక్షల్లోనూ సత్తా చాటింది. తాజాగా వెల్లడైన ఈ పరీక్షా ఫలితాల్లో 99.31 పర్సెంటైల్‌తో అత్యద్భుత స్కోర్‌ సాధించింది. ‘లక్ష్యంపై పట్టుండాలే కానీ.. ఇలాంటి శారీరక, మానసిక వైకల్యాలెన్నున్నా అవి విజయాన్ని ఆపలేవం’టోన్న పియాషా కథ వింటే కళ్లు చెమర్చక మానవు.

ఏదైనా చిన్న అనారోగ్యం బారిన పడితేనే తట్టుకోలేం.. అలాంటిది శారీరక, మానసిక వైకల్యాలుంటే.. ఇక తమ జీవితం అర్ధాంతరంగా ముగిసినట్లే అన్న భావనలో ఉంటారు చాలామంది. కానీ పియాషా మహల్దార్‌ కథ విన్నా, ఆమెను చూసినా ఇలాంటి వారు తమ ఆలోచనల్ని మార్చుకుంటారు. ఎందుకంటే జీవితంలో అడుగడుగునా ఆమె సవాళ్లతోనే సహవాసం చేస్తోంది కాబట్టి!

ఎత్తు.. రెండున్నర అడుగులే!

Congenital Phocomelia అనే అరుదైన వ్యాధితో జన్మించిన పియాషా.. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు పెరగాల్సినంత పొడవు పెరగలేదు. కేవలం రెండున్నర అడుగుల ఎత్తు మాత్రమే పెరిగిన ఆమె చూడ్డానికి మరుగుజ్జుగా కనిపిస్తుంది. అంతేకాదు.. తన శారీరక వైకల్యం కారణంగా ఆమె కుదురుగా ఒక చోట కూర్చోలేదు కూడా! అయినా మెదడు మాత్రం సాధారణ వ్యక్తుల మాదిరిగానే పనిచేస్తుంది. పైగా చిన్న వయసు నుంచి తనలో తెలివితేటలు కూడా ఎక్కువే! అందుకే తన అంగ వైకల్యాన్ని చూసి బాధపడకుండా ఈ తెలివితేటల్నే తన ప్రత్యేకతగా మలచుకుంది పియాషా. తనకిష్టమైన చదువుపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 2016లో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరై అందరి దృష్టినీ ఆకర్షించిందామె. ఇక తాజాగా విడుదలైన యూజీసీ-నెట్‌ పరీక్షా ఫలితాల్లో 99.31 పర్సెంటైల్‌తో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది పియాషా. తనకున్న సమస్య కారణంగా కూర్చొని పరీక్ష రాయలేని ఆమె కోసం పరీక్షా హాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీంతో మరొకరి సహాయం ఆశించకుండా సొంతంగా పరీక్ష రాసి మంచి మెరిట్‌ సంపాదించిందీ బ్రిలియంట్‌ గర్ల్.

సవాళ్లతోనే సహవాసం చేస్తున్నా..!

పుట్టినప్పట్నుంచి సవాళ్లతోనే సహవాసం చేస్తోన్న తనకు.. ఈ పరీక్ష రాయడం, అందులో మెరిట్‌ సాధించడం మరో అనుభూతిని పంచిందంటోంది పియాషా. ‘సవాళ్లు నాకు కొత్త కాదు.. పుట్టుకతోనే ఇవి నాకు పరిచయమయ్యాయి. కానీ ప్రతి సవాలును ఎదుర్కొనే క్రమంలో కాస్త శ్రమ పడినా.. దాని వల్ల సిద్ధించిన విజయం మాత్రం ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది. యూజీసీ-నెట్‌ పరీక్ష కూడా అంతే! ఇది నా తొలి ప్రయత్నం.. నా అంచనాల్ని మించిన విజయమిది! ఈ పరీక్షలో మెరిట్‌ సాధించిన నేను ఏ యూనివర్సిటీలోనైనా పీహెచ్‌డీ చేయడానికి అర్హురాలిని. అయితే మా ఇంటికి దగ్గర్లో ఉన్న కల్యాణి యూనివర్సిటీలోనే సీటు రావాలని కోరుకుంటున్నా.. భవిష్యత్తులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావాలనేదే నా లక్ష్యం’ అంటోన్న పియాషా.. గతేడాది కృష్ణానగర్‌ ప్రభుత్వ కళాశాలలో బెంగాలీ సాహిత్యంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది.

అమ్మే.. నా బలం!

శారీరక వైకల్యంతో పుట్టినప్పట్నుంచి అష్టకష్టాలు పడుతోన్న పియాషా.. తాను ఇక్కడిదాకా రావడానికి తన తల్లి సుప్రియ ప్రోత్సాహమే కారణమంటోంది. ‘పుట్టినప్పట్నుంచి అమ్మతో నాది ప్రత్యేకమైన అనుబంధం. చిన్నప్పుడు నన్ను చేర్చుకోవడానికి ఏ స్కూలూ ముందుకు రాలేదు. అయినా అమ్మానాన్నలు తమ ప్రయత్నాలు ఆపలేదు. ఆఖరికి ఇక్కడి ఓ స్థానిక పాఠశాల నాకు చదువుకునే అవకాశమిచ్చింది. నాకెదురయ్యే ప్రతి కష్టాన్నీ అమ్మ తన చిరునవ్వుతో దూరం చేసేది. ఇక ఇంటర్మీడియట్‌లో నా తరగతి గది మొదటి అంతస్తులో ఉండేది. అప్పుడు అమ్మే తన చేతులతో నన్ను మోసుకెళ్లేది..’ అంటూ తన జీవితంలోని ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది పియాషా.

చులకనగా చూసినా.. బాధపడలేదు!

ఇక శారీరక వైకల్యం ఉన్న తన కూతురిని చూసి బాధపడకుండా.. తనకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించాలనుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు సుప్రియ. ‘ఏడాది వయసున్నప్పుడే పియాషాలో ఉన్న శారీరక వైకల్యం గురించి మాకు తెలిసింది. ముందు బాధపడినా.. ఆ తర్వాత మనసు దిటవు చేసుకున్నాం. ఈ సమస్య కారణంగా చాలామంది మమ్మల్ని చులకనగా చూసేవారు. అయినా మేము మా కూతురి భవిష్యత్తు పైనే దృష్టి పెట్టాం. తన తెలివితేటలు, చదువులో ప్రతిభ చూసి.. మాలో కొత్త ఆశ చిగురించింది. పియాషాను ఇదే దిశగా ప్రోత్సహించాం.. ఇప్పుడు ప్రతి దశలోనూ తన విజయాన్ని చూసి మురిసిపోతున్నాం..’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోందా తల్లి హృదయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్