తాతయ్య కోరిక అదే!

మీడియా మొఘల్‌... దిగ్గజ వ్యాపారవేత్త... క్రమశిక్షణకు మారుపేరు... ఇది రామోజీరావు గురించి ప్రపంచానికి తెలిసిన కోణం. అల్లరి భరించారు.. బుజ్జగించారు.. కథలు చెప్పారు.. విలువల్నీ, జీవితపాఠాల్నీ నేర్పించారు... ఇవీ ఆయన మనవరాళ్లకు, మనవడికి మాత్రమే తెలిసిన విషయాలు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారసులుగా సహరి, బృహతి, సోహన, సుజయ్, దివిజ ‘ఈనాడు’తో తమ అనుభవాలు పంచుకున్నారు.

Published : 12 Jun 2024 12:58 IST

మీడియా మొఘల్‌... దిగ్గజ వ్యాపారవేత్త... క్రమశిక్షణకు మారుపేరు... ఇది రామోజీరావు గురించి ప్రపంచానికి తెలిసిన కోణం.  

అల్లరి భరించారు.. బుజ్జగించారు.. కథలు చెప్పారు.. విలువల్నీ, జీవితపాఠాల్నీ నేర్పించారు... ఇవీ ఆయన మనవరాళ్లకు, మనవడికి మాత్రమే తెలిసిన విషయాలు. 

ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వారసులుగా సహరి, బృహతి, సోహన, సుజయ్, దివిజ ‘ఈనాడు’తో తమ అనుభవాలు పంచుకున్నారు.

రామోజీ మనవరాలిగా కాదు...

సహరి

తాతగారిపై నాకున్న భావనేంటి అంటే... భయం, భక్తి, అంతకుమించి ప్రేమ ఉన్నాయని చెబుతా. క్రమశిక్షణ, సమయపాలన పట్ల ఎంత నిక్కచ్చిగా ఉంటారో... మామీద అంతేస్థాయిలో ప్రేమనీ చూపించేవారు. పైగా నేను మొదటి మనవరాల్ని కదా... కాస్త చనువెక్కువ. చిన్నప్పుడు ఆయన నాకే సొంతం అనుకునేదాన్ని. నేను పుట్టగానే తాతగారు ‘మా అమ్మే పుట్టింది’ అన్నారట. నాతో కూడా ‘నువ్వు మా అమ్మవి. చూడు నీ కళ్లు అచ్చు మా అమ్మలాగే ఉన్నాయి’ అనేవారు. ఆయన దగ్గరే పడుకునేదాన్ని. పొట్టమీదెక్కి ఆడుకునేదాన్ని. మూడున్నరకే లేచి పేపర్లు చదువుతారు కదా... లైట్లు వేస్తే ‘తాతగారూ నాకు నిద్ర రావట్లేదు’ అని ఫిర్యాదు చేసేదాన్ని. ఆయన మీటింగ్‌లో ఉంటే ఓ పక్కన కూర్చొని ఆడుకునేదాన్ని. 

తాతగారికి తెలుగంటే ప్రాణం. మాకు తెలుగు రాకపోతే ఊరుకుంటారా? అందుకే పిల్లలందరికీ తెలుగు చదవడం, రాయడం వచ్చు. సెలవుల్లో మాతో గడపడం కాదు... ఎంత పనిలో ఉన్నా మాకు సమయం ఇచ్చేవారు. ఆయన పనిలో ఉన్నారని మేం వెనక్కి వెళ్లబోయినా ‘రా నాన్నా... నీ కన్నా పని ఎక్కువా’ అనేవారు. మేమంటే అంత ప్రేమ! అమెరికాలో చదువుతున్నప్పుడూ నాకు వీలున్న సమయమేదో కనుక్కుని మరీ ఫోన్‌ చేసేవారు. ఆరోగ్యం బాగోలేకపోతే ఉదయం, సాయంత్రం బాగోగులు కనుక్కునేవారు. ఇంత ప్రేమ చూపించినా.. క్రమశిక్షణ తప్పనిసరి అనేవారు. వేళకి తినకపోయినా పడుకోకపోయినా ఊరుకునేవారు కాదు. ఆయన లంచ్‌ చేస్తున్నారంటే మధ్యాహ్నం 1.15 అయినట్లు. వాచీలో టైమ్‌ ఎప్పుడూ పదినిమిషాలు ముందే ఉంటుంది. ఏదైనా సాధించాలంటే సమయపాలన, క్రమశిక్షణ ఉండాలనేవారు. ‘నేను పదికల్లా ఆఫీసుకి వస్తా. నేను రాకపోతే పని ఆగిపోతుందని కాదు. కానీ గ్రూప్‌ మొత్తానికీ అదో మెసేజ్‌. అందుకే వయసుతో పని లేకుండా సమయానికి వెళతాను’ అనేవారు. అలాగని తన ఆలోచనలను రుద్దాలి అనుకోరు. ఉదాహరణకు నేను కొలంబియా బిజినెస్‌ స్కూల్లో ఎంబీఏ చేస్తానన్నా. తాతగారికి అది అంత ఉపయోగం అనిపించలేదు. చదువు 10, జీవితం 90 శాతం నేర్పిస్తుందంటారాయన. కానీ తుది నిర్ణయాన్ని మాత్రం నాకే వదిలేశారు. 

తాతగారు ఎప్పుడూ ‘విజ్ఞానం విశ్వమంత’ అనేవారు. అందుకే ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆయన చెప్పే ప్రతి వాక్యం వెనక లోతైన అర్థం ఉండేది. అవన్నీ వింటూ, పాటిస్తూ ఎంతో నేర్చుకున్నాం. ఎప్పుడూ సాధారణ జీవితాన్ని కోరుకోవద్దు, విలువలకు రాజీపడొద్దు, కష్టపడందే ఏదీ రాదనేవారు. ‘మీరు ఏం చేయగలరో ప్రపంచానికి చూపించాలి. రామోజీ మనవరాలిగా కాదు... ఆయనే మీ తాత అనేలా చేసి చూపించా’లని ప్రోత్సహించేవారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి వంద రకాలుగా ఆలోచిస్తారు. మొదలుపెట్టాక ఉత్తమంగా పూర్తిచేయాలి అనుకుంటారు. ఆయనెప్పుడూ ‘నేను పనిచేస్తూనే చనిపోవాలి. ఆసుపత్రిలో మంచం మీద ఉంచొద్దు. పనిచేయలేని రోజు ఈ లోకంతో నాకిక పనిలేదు’ అనేవారు. గత నెల ఓ చేతికి సెలైన్‌ ఎక్కుతున్నా పెన్నుతో రాస్తూనే ఉన్నారు. ‘నన్నేమైనా చేయండి. కానీ నా పనికి మాత్రం అడ్డు పడొద్దు’ అన్నారు. అలాంటి వ్యక్తికి మామూలు వాళ్లకి వచ్చినట్టే మరణం వస్తుందన్న ఊహే ఎప్పుడూ రాలేదు. ఎప్పటికీ నాతో ఉంటే బాగుండేది. అలాంటివాళ్లతో ఇంకా ఎన్నేళ్లు గడిపినా అలాగే అనిపిస్తుంది. కొన్నాళ్లుగా తాతగారి కింద పనిచేసే అదృష్టం దక్కింది. ప్రతిరోజూ బిజినెస్, వ్యాపార వ్యూహాల గురించి ఆయనతో చర్చించేదాన్ని. ఈ పాఠాలన్నీ నా భవిష్యత్తుకు పునాదులే. ఆయన మాతోనే ఉన్నారని ఊహించుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళతాం. తాతగారు గత కొన్నేళ్లుగా ‘నేను నీకే పుడతా’ అనేవారు. అది నిజమై ఆయన తిరిగొస్తే అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి నాకు?


ఆలోచనల అక్షయపాత్ర

సోహన 

తాతగారు ఓసారి విమానంలో వెళుతున్నారట. ఆయన పక్కన కూర్చున్న ఓ పత్రికాధిపతితో ‘పేపర్‌ ఉదయాన్నే వచ్చేలా చూసుకోండి. నంబర్‌ 1 మీదే అవుతుం’దని చెప్పారట. దానికి అవతలి వ్యక్తి ‘పేపర్‌ నడపడం నీకేం తెలుస’న్నట్లుగా చూశారట. ఆ చూపే ఆయనలో పత్రిక పెట్టాలన్న కసిని తీసుకొచ్చిందట... తాతగారు తన అనుభవాలన్నీ ఇలా కథలుగా మాతో పంచుకునేవారు. ఆయన ప్రపంచానికే మీడియా బ్యారన్‌. మాకు మాత్రం ప్రేమామృతాన్ని పంచే తాతయ్య. మేం అయిదుగురం ఆయనకు పంచప్రాణాలు. నన్ను ముద్దుగా ‘డార్లింగ్‌ నంబర్‌ త్రీ’ అని పిలిచేవారు. నాన్న పోయాక తండ్రిలా నా బాధ్యత తీసుకున్నారు. ‘ఏ సబ్జెక్టు తీసుకోను’ అని తాతగారినే అడిగా. ఆయన నాకు నచ్చిందేంటో కనుక్కుని అదే చేయమన్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో లీజర్‌ మేనేజ్‌మెంట్‌ చేసేటప్పుడు ప్రతి ఆదివారం తప్పకుండా మాట్లాడేవారు. ఇన్నేళ్లలో కోపంతో అరవడం, ఇదే చేయాలని చెప్పడం నేనెప్పుడూ చూడలేదు. అయితే పుస్తకాలు మాత్రం చదవాలనేవారు. బాగున్న వ్యాసాలు పంపేవారు. వాటిని చదవకపోతే మాత్రం సున్నితంగా మందలించేవారు.

ఆయన నిత్యవిద్యార్థి. ‘నేర్చుకోవడమే జీవితం, అది లేకపోతే అక్కడితో ఆగిపోయినట్లే’ అనేవారు. నేనేమో స్లో రీడర్‌ని. ఎందుకంటే బాగా అర్థం అయ్యేదాకా పేజీ తిప్పేదాన్ని కాదు. అందుకని ‘ఎక్కువ చదవాలి, అదొక అలవాటుగా చేసుకోవాలి. పుస్తకాల్లో రాసినవన్నీ పాటించక్కర్లేదు. సొంతంగా ఆలోచించండి. ఆ రాసేదీ మనలాంటివాళ్లే. వాళ్లు చెప్పిన వాటిలో మంచిని తీసుకుని, చెడుని వదిలేయండి’ అనేవారు. ముఖ్యమైన పాయింట్లు మార్క్‌ చేసి, చదవమనేవారు. తమ తమ రంగాల్లో ఎదిగిన మహిళల గురించి చెప్పేవారు. అమ్మాయిలు ముందు కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వాలి. దానికి ఇస్తూనే వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. అలా చేసినవాళ్లు చాలామంది ఉన్నారని చెప్పేవారు. ఒకసారి ఫిల్మ్‌సిటీలో ‘ఫండుస్థాన్‌’పై కొన్ని మార్పులతో ప్రెజెంటేషన్‌ చేసిస్తే మెచ్చుకున్నారు. నిజమా తాతగారూ... అని నేను ఆశ్చర్యంగా అడిగితే ‘నిజంగానే 20 ఏళ్లకే బాగా చేశా’వన్నారు. తాతగారి నుంచి ప్రశంసలు కాస్త అరుదుగానే దక్కేవి మరి. ఆనందం, దుఃఖం ఏది వచ్చినా నాకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి ‘అందరిలోకి నువ్వే సెన్సిటివ్, ధైర్యంగా ఉండా’లని భుజం తట్టేవారు. నా పెళ్లినీ ఎప్పటికీ మర్చిపోలేను. తాతగారే కన్యాదానం చేశారు. ‘అయ్యో వినయ్‌ చాలా చిన్నవాడు కదా! తన కాళ్లు తాతగారు కడగాలా’ అని గిల్టీగా అనిపించింది. నిజానికి ఆయనకు అలాంటి విశ్వాసాలు లేకపోయినా మనవరాలినైన నాకోసం వాటన్నింటినీ సంతోషంగా చేశారు. 

ఆయన వల్ల హెల్పర్లు కూడా ఇబ్బంది పడకూడదు అనుకుంటారు. విరామమైనా, వినోదమైనా ఆయనకు పనిలోనే! అలాంటప్పుడు సెలవు ఎందుకు అని ప్రశ్నిస్తే ఆశ్చర్యమేసేది. ఆయన మెదడు అక్షయపాత్రేమో అనిపిస్తుంది. నిరంతరం కొత్త ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. వాటిని మర్చిపోకుండా పాకెట్‌బుక్‌లో రాసుకునేవారు. సాధ్యమవుతాయి అనిపించినవి లోతుగా అధ్యయనం చేసేవారు. ‘నేను చేసేదేదైనా కొత్తగా ఉండాలి. వేరేవాళ్లను అనుసరిస్తే అందులో నా ప్రత్యేకత ఏముంది’ అని చిన్నతనం నుంచే అనుకునేవారట. అందుకే ప్రయోగాలెన్నో చేశారు. అయినా కిటికీలోంచి చూస్తూ... ‘ఈ విశ్వంలో భూమెంత? అందులో ఇండియా... దాంట్లో నేను ఓ చిన్న రేణువును’ అనుకునేవారే తప్ప సాధించేశా అన్న గర్వం కించిత్‌ కూడా కనిపించేది కాదు. ఇన్నేళ్లలో ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో పాఠాలు. ప్రతిదీ అపురూపమే. ఇప్పుడాయన లేరంటే శూన్యంగా అనిపిస్తోంది. కానీ ఆయన ఆలోచనలు, ఆశయాలు మా వెంటే ఉన్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా నన్ను మోటివేట్‌ చేసేది తాతగారి పేరే! దాన్ని మేం జాగ్రత్తగా కాపాడాలి. ఆయన ఒక్కరు చేసింది... అమ్మ, పెద్దమ్మ, పెదనాన్నల సహకారంతో మేం అయిదుగురం ముందుకు తీసుకెళ్లాలి. ఇదే మా కర్తవ్యం!


అన్నింట్లో నంబర్‌వన్‌గా ఉండాలన్నారు... 

బృహతి 

రామోజీరావుగారు మీడియా మేరు పర్వతం, విలువల శిఖరం. ఆ లివింగ్‌ లెజెండ్‌కి మనవరాలిగా పుట్టడం నా అదృష్టం. మనవరాలిగా ఆయన గొప్పతనం గురించి చిన్నప్పుడే అర్థం చేసుకోగలిగా. తాతగారి పట్టుదల, దార్శనికత, స్థితప్రజ్ఞతలను దగ్గరగా చూసే అదృష్టం కుటుంబ సభ్యులుగా మాకు దక్కింది. వ్యవస్థలోని అవినీతి, అక్రమాలు, అసమర్థ పాలనలపై ఈనాడు రాసిన కథనాలు శతఘ్నుల్లా పేలడం వెనక ప్రజలకు మంచి చేయాలన్న ఆయన తపనే కారణం. తాతగారు మా ఐదుగురికీ సమ ప్రాధాన్యం ఇచ్చేవారు. నాణ్యమైన సమయాన్నీ గడిపేవారు. ‘గుప్పిట మూసి ఉన్నంతసేపే బలం ఉంటుంది. మీరందరూ కలసికట్టుగా సాగుతూ సంస్థకు బలాన్ని ఇవ్వాలి’ అనేవారు. 

ఆఫీసుకి సంబంధించిన చర్చల్లో... ‘ఈ ఐడియా వచ్చింది’ ‘ఇలా చేయాలనుకుంటున్నామ’ని చెబితే నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పేవారు. అన్నికోణాలనూ పరిశీలించి లోతైన విమర్శలు చేసేవారు. ఆయన కూడా సద్విమర్శను కోరుకునేవారు. ఓ సమావేశంలో మాకో ప్రపోజల్‌ వచ్చింది. దాన్ని ఈటీవీ భారత్‌లో కూడా అమలు చేస్తే బాగుంటుందన్న చర్చ జరిగింది. 
తరవాత సమావేశం నాటికి నేను ఇతర పబ్లిషర్స్‌ విధానాలు, లోపాలు, మార్గాలు... వంటివాటితో కూడిన ఓ నివేదిక ఇచ్చా. అది ఆయనకు నచ్చి ‘బాగా చేశావు’ అని అభినందించారు. చిన్న ప్రశంసే కానీ... అది చాలా ఏళ్లపాటు ఇంధనంగా పనిచేస్తుంది. 

కాలం కంటే వేగంగా పరుగెత్తి మరీ తాతగారు చెప్పే ఐడియాలను విన్నప్పుడు అబ్బా ఇది మాకెందుకు రాలేదు అని ఎన్నిసార్లు అనుకున్నానో! 1936లో పుట్టిన వ్యక్తికి ఇన్ని ఆధునిక భావాలు, ఆదర్శభావాలు... అబ్బురమనిపించేది. ఆయన ఏ విషయంలోనూ కులం, మతం పట్టించుకోరు. ఓసారి నా స్నేహితురాలు కులాంతర వివాహం చేసుకుందని ఆయనతో చెప్పా. మంచి విషయం... వారిద్దరి మధ్య సఖ్యత ఉండాలి కానీ, ఇవన్నీ అనవసరం అన్నారు. తానూ ఇంటి పేరుని పక్కన పెట్టి రామోజీరావుగానే గుర్తుండిపోవాలనుకున్నారు. అందుకే, ఆధార్‌ కార్డులో సైతం అలానే నమోదు చేయించుకున్నారు. చాలామంది బట్టలు, నగలు వేసుకుంటేనో, బాగా రెడీ అయితేనో ఆనంద పడతారు. కానీ, తాతగారు మాత్రం ఈరోజు ఏం కొత్తగా చేశాం? ఎవరి జీవితానికి ఉపయోగపడేలా చేశాం? అని ఆలోచించేవారు. తాతగారు తన హోదాకి తగ్గట్లు ఓ ఇరవై విలాసవంతమైన కార్లను ఇంటి ముందు నిలపగలరు. వేసుకుని తిరగనూ గలరు. కానీ, ఆయన చివరి వరకూ ఓ పాత ఇన్నోవానే వాడేవారు. వస్తువులకూ, ఆడంబరాలకూ ఏ మాత్రం విలువనిచ్చేవారు కాదు.  

తాతగారు శారీరకంగానే కాదు...మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేవారు. ఎవరైనా ఆందోళన చెందుతున్నా, ఒత్తిడికి గురవుతున్నా... ఎంపతీ చూపించేవారు. తాతగారిని అందరూ సీరియస్‌గా ఉండే మనిషి అనుకుంటారు. కానీ, ఆయన బంధాలకు ఎంతో విలువనిచ్చేవారు. ఎంత చిన్న వ్యక్తి అయినా పేరు గుర్తుంచుకుని మరీ పలకరించేవారు. తనకంటే చిన్న వయసు వారనీ, అనుభవం లేనివారనీ వారి మాటల్ని కొట్టిపారేసేవారు కాదు. ‘ప్రతిచోటా ప్రతిభ ఉంటుంది. దాన్ని మనమే గుర్తించి వెలికితీయాలి’ అని చెప్పేవారు. రామోజీరావు గారంటే విలువలకూ, నిజాయతీ, నిబద్ధతలకు చెక్కు చెదరని రూపం. ఆయనకు దేన్నీ కాపీ చేయడం ఇష్టం ఉండదు. అలాంటి ఆలోచన ఏమైనా చెబితే... వాళ్లదే మీరు అనుసరిస్తే మీ బుర్ర ఎందుకని కోప్పడేవారు. అన్నింట్లోనూ నంబర్‌ వన్‌గా ఉండాలనేవారు. భారతదేశంలో ప్రాంతీయ భాషల ప్రాధాన్యం ఎప్పటికీ తగ్గదనీ, ప్రజల అభిరుచులూ, ఆశయాలకూ తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలనీ సూచించేవారు. ఆయన కోరుకున్నట్లు ఈటీవీ భారత్‌ స్థాయిని మరింత ఎత్తుకి తీసుకువెళ్తాం. ఆ మహనీయుడు నేర్పిన విలువల బాటలో నడుస్తూ రామోజీ గ్రూప్‌ కీర్తిపతాకాన్ని చిరకాలం నిలిచిపోయేలా చేస్తాం. 


నా దగ్గర మాట తీసుకున్నారు...

సుజయ్‌ 

తాతగారి గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఏ పని చేసినా నిష్కల్మషంగా చేసేవారు. అహం అనేది చంపుకొంటే చాలు... జీవితంలో మనకు తిరుగు ఉండదనే విషయం ఆయన్నుంచే నేర్చుకున్నా. తాతగారు ఎంత మంచి చేస్తున్నా... ఎందుకు ఇంతమంది రకరకాలుగా అనుకుంటున్నారో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఓ సారి ఆ విషయాన్ని వారినే అడిగా. అది మానవ సహజం. ఎవరేం అనుకున్నా పక్కనపెట్టు. నువ్వు దాన్నెలా తీసుకుంటున్నావనేదే ముఖ్యం అనేవారు.  ‘నాకు జీవితం చాలా నేర్పించింది. వైఫల్యాలను చూసి ఎప్పుడూ బెంబేలెత్తిపోలేదు. అవకాశంగా మలుచుకున్నా. నీ బాధ్యతలు నువ్వు తెలుసుకుని... అందరికీ బలం అవ్వాల’నేవారు. రామోజీరావుగారి మనవడు సుజయ్‌ అని కాకుండా సుజయ్‌ తాత రామోజీరావని చెప్పుకొనేలా ఎదగమనే గోల్‌ నాకిచ్చారు. ఈ విషయమై చాలాసార్లు నా దగ్గర ప్రామిస్‌ కూడా తీసుకున్నారు. నాకు, అక్కలకీ, చెల్లికీ ఆయన పంపిన లేఖలు, ఈమెయిల్స్‌ని ‘తాతయ్య సందేశం’గా పుస్తకాన్ని వేయించి ఇచ్చారు. దాన్నే మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్తుని నిర్మించుకోమన్నారు. 

ఎంత గారాబం చేసినా పొరబాట్లు చేస్తే చీవాట్లు తప్పేవి కాదు. తిట్టారని బాధపడుతుంటే ‘లేకపోతే నీకు భజన చేయమంటావా? నీ లోపాలను చెప్పి సరిదిద్దాలి కానీ, నీకు భజన చేస్తే నీకే నష్టం జరుగుతుంది. చెప్పు... భజన చేయమంటే చేస్తా. వినకపోతే తరవాత తెలుసుకుంటాడు లే అని ఆశపడతాను. జరగకపోతే బాధపడతాను’ అంటూ ఏదో రకంగా నచ్చచెప్పేవారు. చిన్నప్పుడు అమ్మ ‘తాతగారి దగ్గరకి వెళ్లి కూర్చో... ఆయన చెప్పేది అర్థం చేసుకో’మనేది. నేను మాత్రం టీవీ చూడాలని, వీడియోగేమ్‌లు ఆడాలనుకునేవాడిని. దాన్ని తాతయ్య పసిగట్టేసేవారు. 

దేహ్రాదూన్‌లో చదివేవాడిని. నువ్వా స్కూల్‌ని బాగా ఉపయోగించుకుంటున్నట్లు నాకేమీ అనిపించడం లేదన్నారోసారి. వెంటనే నేను ‘తాతగారూ క్షమించండి. అక్కడికి వెళ్లకపోతే మీరు నన్ను చూసి అభినందించే మార్పు ఎప్పటికీ వచ్చుండేది కాదు’ అనేశా. దాంతో నిజమే నేనొప్పుకొంటా అన్నారు. తాతగారు నాతో ఎన్నో కబుర్లు చెప్పేవారు... చిన్నప్పటి రోజుల్లో జరిగిన సంఘటనల్ని పంచుకునేవారు. ఆయన పదో తరగతి పాసవ్వడానికి రోజూ కామాక్షమ్మకు మూడు కొబ్బరికాయలు కొట్టిన విషయం, స్నేహితుడు రమణారావుతో చేసిన అల్లరి ఇలా చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు తెలుగు నేర్చుకునే విషయంలో తాతగారికీ నాకూ మధ్య ఓ సరదా పందెం ఉండేది. నేను ఏవైనా ఆంగ్ల పదాలు మాట్లాడితే ఆయనకి నేను ఐదు రూపాయలివ్వాలి. లేదంటే ఆయనే నాకు పది రూపాయలు ఇవ్వాలి. అలా చాలా తెలుగుపదాలు నేర్చుకున్నా.

పరీక్షలు పూర్తి చేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చేనాటికి చదివేందుకు 300 పుస్తకాలను సిద్ధం చేసి పెట్టారు తాతగారు. ప్రతి ఒక్కదాన్నీ చదివి ఏ పరిస్థితుల్లో ఉపయోగపడుతుందో, ఏ సందర్భంలో ఏది వర్తించదో చెబుతూ వాటికి స్టార్‌ రేటింగ్‌ కూడా ఇచ్చారట. ఆయన సూచించిన పుస్తకాల్లో ‘హౌటూ విన్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ పీపుల్‌’ అనే డేల్‌ కార్నెగీ రచన ఒకటి. నిజానికి తాతగారు ఇంత త్వరగా దూరమవుతారని అస్సలు అనుకోలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆయనకి ఫోన్‌ చేశా. ఎంతో సంతోషంగా ఉన్నారు. ‘పోతూ పోతూ ఐదు కోట్ల మందికి ఉపయోగపడగలిగా చాలు’ అన్నారు. ఆయన వెళ్లిపోయినా కన్నీటి బొట్టు కార్చకూడదని, ఎంత కష్టంలోనూ ఏడవకూడదని చెప్పారు. తాతగారు మాకిచ్చిన లక్ష్యాలను, బాధ్యతలను నెరవేర్చడంతో పాటు సొంతంగా నేను కొన్ని వెంచర్స్‌ ప్రారంభించాలన్న ఆయన కోరికను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తా. 


తాతయ్య వల్లే... 2 వేల పుస్తకాలు చదివా

దివిజ

తాతయ్యగారు నన్ను ప్రేమగా దివిజమ్మ, నాన్నలూ అని పిలిచేవారు. నా జీవితంపై ఆయన ప్రభావం ఎక్కువ. నా చదువు విషయంలో ఎక్కువశాతం ఆయనే మార్గనిర్దేశం చేసేవారు. చిన్న విషయంలోనైనా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. నా ప్రతి పుట్టినరోజుకూ ఆయన ఎక్కువగా పుస్తకాలూ, నవలలే బహుమతులుగా ఇచ్చేవారు. తొమ్మిదేళ్లకే అమర్‌ చిత్ర కథ, పంచతంత్రం... లాంటి పుస్తకాలు నాకు పరిచయం చేశారు. కొంచెం పెద్దయ్యాక సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు ఇచ్చేవారు. నా పదహారో పుట్టినరోజుకు కానుకగా బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్‌ పుస్తకాలు ఇచ్చారు. ఒక్కోసారి ఆయన రూమ్‌లోకి నేరుగా వెళ్లిపోయి, కబోర్డులో ఉన్న పుస్తకాలు తీసుకుని చదివేసేదాన్ని. సందేహాలు వస్తే అడిగేదాన్ని. చాలా ఓపిగ్గా వివరించేవారు. అలా ఇప్పటివరకూ 2వేల పుస్తకాల దాకా చదివాను. వాటిలో ఎక్కువ తాతయ్య ఇచ్చినవే. పనిలోనే విశ్రాంతి అనే ఆయన... కుటుంబానికీ చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా, ఆయన క్యాబిన్‌లోకి వెళ్తే, అన్నీ పక్కనపెట్టి నాతో సమయం గడిపేవారు. అదే ఆయన నాపై ప్రేమను వ్యక్తపరిచే తీరు. అదేకాదు, నాకు ఏ చిన్న సమస్య వచ్చినా తాతగారి దగ్గరికే వెళ్లేదాన్ని. చాలా సున్నితంగా వ్యవహరించేవారు. నా సమస్యలే ఆయన సమస్యలన్నట్లు భావించి పరిష్కరించేవారు. ఈ 17ఏళ్లలో నన్ను ఒక్కసారి కూడా కోప్పడిన సందర్భం లేదు. ఏదైనా తప్పు చేస్తే... అది ఎందుకు తప్పో, సరైన మార్గం ఏంటో నొప్పించకుండా, ప్రేమతో చెప్పేవారు. ఇంట్లో చిన్నదాన్ని కదా! గారాబమూ ఎక్కువే! చిన్నప్పుడు నేను ఆయన్ను ఒక ప్రశ్న అడిగా. ఎప్పుడూ ఈ తెల్లబట్టలే ఎందుకు వేసుకుంటారు? మీకు బోర్‌ కొట్టదా తాతయ్యా అని...అప్పుడు ఆయన ‘నాన్నా తెలుపంటే స్వచ్ఛతకు ప్రతిరూపం. చేసేపని పట్ల కూడా మనం అంతే స్వచ్ఛంగా ఉండాలనేదానికి చిహ్నంగా ఇవి వేసుకుంటా’ అని చెప్పారు. ఖరీదైన బట్టలు, చెప్పులు లాంటివి వేసుకోరు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన వాడే పెన్‌ కూడా 30 రూపాయలే. చదువుల గురించే కాదు... మా ఆరోగ్యం గురించీ అనేక జాగ్రత్తలు చెప్పేవారు. యోగా, ధ్యానం చేయమనేవారు. రోజూ ‘ఈనాడు’ నుంచి ఆహారానికి సంబంధించిన క్లిప్పింగ్స్‌ మాకు పంపించి ఏ ఆహారం మంచిదీ, ఏ సీజన్‌లో ఏం తినాలి? అనేది చదవమనేవారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే... వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎంత స్థితప్రజ్ఞతతో మెలగాలో నేర్పేవారు. త్వరలో అమెరికాలో రైటింగ్, బిజినెస్‌ చదవబోతున్నా. కోర్సు అయ్యాక ఫిలింమేకింగ్, ఓటీటీ రంగాల్లో పనిచేయాలనుకుంటున్నా. నా ఆసక్తిని గమనించిన తాతయ్య దానికి సంబంధించిన అనేక విషయాలు నాతో పంచుకునేవారు. ‘నువ్వు అచ్చం తాతగారి పోలికే’ అని అమ్మ ఎప్పుడూ అంటుంటారు. నా నడక, మాటతీరు... అన్నీ ఆయన గుణాలే వచ్చాయంటారందరూ. నాకు పేరు పెట్టిందీ తాతగారే... నన్ను ఎప్పుడూ విజయీభవ అని దీవించేవారు కాదు. ‘దివిజయ్‌భవా...దిగ్విజయీ భవా..’ అని దీవించేవారు. ఆయన ఒక్కరే అలా దీవించేవారు. ఇక ఆ దీవెనని మళ్లీ జీవితంలో ఎప్పుడూ వినలేను. ప్రతిదశలోనూ నాచేయి పట్టుకుని నడిపించిన తాతయ్య ఇక లేరు..రారు.. అనే ఆలోచనే చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక తాతయ్యను అడిగాను....ఏదిఏమైనా ధర్మమే గెలుస్తుంది కదా తాతయ్యా! అని. అప్పుడు ఆయన ‘ధర్మం ఊరికే గెలవదు. దాన్ని రక్షించడానికి చాలామంది పోరాడాలి. ఎంతోమంది త్యాగాలు చేయాలి’ అని చెప్పారు. అవే ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు. కడవరకూ నిజాయతీగా, ప్రజల మంచికోసం పోరాడిన ఆయన తత్వం, క్రమశిక్షణలే నాకు స్ఫూర్తి. ఆయన చేసిన మంచిలో నేను పదిశాతం చేయగలిగినా చాలు. అదే నాకు సంతృప్తి!  

మహిళా శక్తికి పట్టం కట్టిన.. ఉషా కిరణాలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్