మహిళా శక్తికి పట్టం కట్టిన.. ఉషా కిరణాలు!

ఒక ‘నాట్య మయూరి’.. ఒక ‘ప్రతిఘటన’.. ఒక ‘మౌనపోరాటం’.. సాధారణంగా సినిమాలంటే హీరోల గురించే మాట్లాడుకుంటారంతా! కానీ తన చిత్రాల ద్వారా హీరోయిన్‌ గురించి మాట్లాడుకునేలా చేశారు అక్షర తపస్వి రామోజీరావు. అదీ నాలుగు దశాబ్దాల క్రితమే! సినిమాల్లో కథానాయికలకు ఆయనిచ్చిన సముచిత స్థానం అలాంటిది మరి!

Updated : 11 Jun 2024 20:16 IST

ఒక ‘నాట్య మయూరి’.. ఒక ‘ప్రతిఘటన’.. ఒక ‘మౌనపోరాటం’..

సాధారణంగా సినిమాలంటే హీరోల గురించే మాట్లాడుకుంటారంతా! కానీ తన చిత్రాల ద్వారా హీరోయిన్‌ గురించి మాట్లాడుకునేలా చేశారు అక్షర తపస్వి రామోజీరావు. అదీ నాలుగు దశాబ్దాల క్రితమే! సినిమాల్లో కథానాయికలకు ఆయనిచ్చిన సముచిత స్థానం అలాంటిది మరి! అలుపెరగని కృషితో.. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ శిఖరాగ్రాన నిలిచిన ఈ కృషీవలుడు సినీ నిర్మాతగా వెండితెర, బుల్లితెరల పైనా సెన్సేషన్‌ సృష్టించారు.. కాల్పనిక కథకు శక్తిమంతమైన మహిళా పాత్రలతో ప్రాణం పోయడం, నిజ జీవిత కథలతో స్ఫూర్తి రగిలించడంలో ఆయనకు ఆయనే సాటి! వెండితెరపై ఆయన సృష్టించిన మహిళా పాత్రలు స్త్రీ శక్తికి, అభ్యుదయానికి, పోరాట పటిమకు ప్రతీకలుగా నిలిచాయి. పురుషాధిపత్య సమాజంలో మహిళల ఔన్నత్యాన్ని,  శక్తి సామర్థ్యాలను చాటాయి. మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచిన అలాంటి పాత్రల్ని మరొక్కసారి నెమరువేసుకొని ఆ మహనీయునికి నివాళులర్పిద్దాం!

కలంతో సమాజంలో ఉన్న కళంకాల్ని కడిగేయడంతో పాటు.. అదే కలంతో మహిళలకు తమ గళాన్ని వినిపించే వేదికను సృష్టించారు రామోజీరావు. అదే.. మహిళా  చైతన్యం.. అభ్యున్నతే లక్ష్యంగా.. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈనాడు ‘వసుంధర’ ప్రత్యేక ఎడిషన్‌. ఒక తండ్రి తన కన్న కూతురిని ఎంత ఆప్యాయంగా పెంచి పెద్ద చేస్తాడో అంతే బాధ్యతాయుతంగా తన ఈ మానస పుత్రికను నిరంతరం అభివృద్ధి చేశారాయన! అందుకే పత్రికా ప్రపంచంలో మహిళా ఎడిషన్‌ అంటే ఇప్పటికీ తొలుత గుర్తొచ్చేది వసుంధరే!

ప్రతిభను పరిచయం చేసి..!

ఇలా అక్షర రూపంలోనే కాదు.. తన చిత్రాల రూపంలోనూ మహిళాభ్యుదయానికి పాటు పడిన అపర కృషీవలుడు రామోజీరావు. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో 1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’కు అంకురార్పణ చేసిన ఆయన.. నిర్మాతగా సరికొత్త అవతారమెత్తారు. ఈ వేదికగా ఎన్నో హిట్‌ చిత్రాల్ని నిర్మించిన రామోజీ.. చిత్ర పరిశ్రమలో పురుషాధిపత్యం రాజ్యమేలుతోన్న ఆ రోజుల్లోనే పలు మహిళా ప్రాధాన్య చిత్రాలకు ప్రాణం పోశారు. ఆయన రూపొందించిన సినిమాల్లో మహిళల శక్తిసామర్థ్యాలు, కార్య దక్షత, సంకల్పబలం, పోరాటపటిమ.. వంటివెన్నో ప్రస్ఫుటమవుతాయి. అలాంటి పవర్‌ఫుల్‌ క్యారక్టర్స్‌ని తమ కోసమే సృష్టించారేమో అన్నట్లుగా.. ఈ చిత్రాలలో నటించి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు కొందరు నాయికలు. అందుకే ప్రస్తుతం తామీ స్థాయిలో ఉన్నామంటే.. ఆ మహనీయుని చలవేనంటూ సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటుంటారు.


స్త్రీ శక్తికి నిదర్శనం.. ‘మయూరి’!

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం.. సినిమాలంటే కాల్పనిక కథలే అనుకునే వారంతా! అలాంటి సమయంలో ‘నాట్య మయూరి’ పేరుతో నిజజీవిత కథను తెరపై ఆవిష్కరించారు రామోజీ. కథ ఒకరిది.. పాత్ర మరొకరిది అయితే ప్రేక్షకుల మనసుకు హత్తుకోదు అన్న ఉద్దేశంతో.. సుధాచంద్రన్‌ కథలో ఆమెనే కథానాయికగా పెట్టి అప్పట్లోనే బయోపిక్‌ల ఒరవడిని తెలుగువారికి పరిచయం చేశారాయన! ప్రమాదవశాత్తూ ఓ కాలుని పోగొట్టుకున్నా.. నాట్యంపై ఆమెకున్న మక్కువ, పట్టుదలతో జైపూర్‌ నుంచి తెప్పించుకున్న కృత్రిమ కాలుని అమర్చుకోవడం.. నిరంతర సాధనతో ‘నాట్య మయూరి’గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవడం.. వంటివన్నీ మహిళల కృషి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తాయి. అందుకే తనను అసలు పేరు కంటే ‘మయూరి’గానే అందరూ గుర్తు పెట్టుకుంటారని చెబుతారు సుధ.

‘మయూరి నా మొదటి సినిమా. ఇది విడుదలై నలభయ్యేళ్లు దాటినా అంతా నన్ను మయూరిగానే గుర్తు పెట్టుకున్నారు. ఇదంతా రామోజీ సర్‌ వల్లే సాధ్యమైంది. బయోపిక్‌ అనే ఆలోచనకు ప్రాణం పోసిందే ఆయన. సినిమా పూర్తయ్యాక ఆయన్ని కలిసినప్పుడు రెమ్యునరేషన్‌గా బ్లాంక్‌ చెక్‌ చేతిలో పెట్టి నన్ను ఆశీర్వదించారు. ఆ రోజు ఆయనిచ్చిన డబ్బే నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అప్పట్నుంచి నా బ్యాంక్‌ బ్యాలన్స్‌ పెరిగిందే తప్ప తగ్గింది లేదు. ఆయనే నా మెంటార్‌, గైడ్‌, ఫిలాసఫర్‌. ఆయన లేకపోతే నేను లేను. ఆయన లేని లోటు తీరనిది..’ అంటారామె.

ఇలా నాలుగు దశాబ్దాల క్రితమే బయోపిక్‌తో స్త్రీశక్తికి ఊపిరులూదిన ఈ చిత్రం ఏకంగా 14 ‘నంది’ పురస్కారాల్ని గెలుచుకుంది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోకీ ఈ సినిమా డబ్‌ అయింది.


ధైర్యం, తెగువల.. ‘ప్రతిఘటన’!

కుటుంబంలోనే కాదు.. సమాజంలో అవినీతి జరిగినా, అన్యాయం ఎదురైనా మహిళ చూస్తూ ఊరుకోదు. ఎవరి అండ, సహాయం లేకపోయినా ఒంటి చేత్తోనైనా పోరాడగలదు. అన్యాయం చేసిన వారిని, అవినీతిపరుల్ని చట్టానికి పట్టించేదాకా నిద్రపోదు.. ఇలా మహిళల ధైర్యాన్ని, తెగువను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘ప్రతిఘటన’. సంఘ విద్రోహ శక్తులతో పోరాడే తెగువ ఉన్న ఓ వనిత గాథను ఇలా బలంగా, శక్తిమంతంగా చూపించడం రామోజీరావుకే చెల్లిందనడం అతిశయోక్తి కాదు. సమాజంలో మహిళల స్థితిగతులు, వారి ఉనికికి ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అనే పాట నిదర్శనంగా నిలుస్తుంది. ఇందుకూ రామోజీ సంకల్ప బలమే కారణమైంది. మహిళల మనోధైర్యానికి, పోరాట పటిమకు ప్రతిరూపంగా రూపొందించిన ఈ చిత్రం ద్వారా విజయశాంతి రూపంలో మరో శక్తిమంతమైన నాయికను తెరపై చూపించారాయన. తద్వారా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎనలేని ధైర్యం, తెగువ చూపాలంటూ మహిళలకు సందేశమిచ్చారు. ఆరు నందులు గెలుచుకున్న ఈ చిత్రం ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకుంది. అంతేకాదు.. ఇతర భాషల్లోనూ డబ్‌/రీమేక్‌ అయింది.


ఆమె.. ‘మౌనపోరాటం’!

‘ఆడది అబల కాదు.. సబల’ అనే నానుడిని నాలుగు దశాబ్దాల క్రితమే వెండితెరపై చిత్ర రూపంలో ఆవిష్కరించారు రామోజీరావు. స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉన్నా.. అన్యాయాన్ని మాత్రం సహించబోదని ‘మౌనపోరాటం’ చిత్రం ద్వారా నిరూపించారాయన. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి చెంపపెట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ కథకే కాదు.. ఇందులో దుర్గ పాత్ర పోషించిన నటి యమునకూ ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓ ప్రభుత్వ అధికారి చేతిలో మోసపోయిన మహిళ పోరాటాన్ని ఎంతో ప్రభావవంతంగా తెరపై ఆవిష్కరించారు. అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్న మంచి సందేశాన్ని సమాజానికి అందించిన ఈ చిత్రం ఎంతోమంది మహిళల్ని ఆలోచింపజేసింది.

‘ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం రామోజీరావు గారే. ఆయన దగ్గర క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకున్నా. కష్టాన్ని నమ్ముకున్న వారు ఎప్పుడూ బావుంటారమ్మా.. అనేవారాయన. పనిలోనే తనకు విశ్రాంతి దొరుకుతుందని పదే పదే చెబుతుండేవారు. చిన్న స్థాయిలో ఉన్నా సరే.. కష్టపడి పనిచేసే వాళ్లు, ప్రతిభ ఉన్న వాళ్లను ప్రోత్సహించడంలో ఆయన ముందుండేవారు. మమ్మల్ని తమ కుటుంబంలో వారిగా చూసుకునేవారు. ఏం జరిగినా పని మాత్రం ఆగకూడదు అనే వారు. నేటికీ ఆయన మాటలే నాకు స్ఫూర్తి!’ అంటూ ఆయన మాటల్ని గుర్తు చేసుకున్నారు యమున. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రస్తుతం ఇదే పేరుతో ఈటీవీలో సీరియల్‌ ప్రసారమవుతోంది.


‘అశ్వని’ సంకల్పం!

స్త్రీలో ఉన్న పోరాట స్ఫూర్తినే కాదు.. క్రీడా స్ఫూర్తినీ సమాజంలోకి తీసుకెళ్లాలని పరితపించారు రామోజీరావు. ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘అశ్వని’ కథ. జాతీయ స్థాయిలో రాణించిన అథ్లెట్ ‘అశ్వనీ నాచప్ప’ బయోపిక్ ఇది! ఇందులో అశ్వని పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే.. ఆమే నటించాలని కోరుకున్నారు రామోజీ. నిజానికి నటన అంటే ఆసక్తి లేకపోయినా.. కథ నచ్చడంతో పాటు ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌ విశిష్టతను తెలుసుకున్న ఆమె.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. అలా ఓ క్రీడాకారిణిగా, నటిగా ఎంతోమందికి చేరువయ్యాయి అశ్వని, ఆమె కథ. రంగమేదైనా సంకల్ప బలం ఉంటే లింగభేదం లేకుండా రాణించచ్చని.. తన చిత్రంతో మరోమారు చాటారీ సినీ శిఖరం. ఈ సినిమా 15వ ‘అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని చిత్రాల్లోనూ అశ్వనికి నటించే అవకాశం దక్కిందంటే.. ‘అదీ రామోజీ సర్‌ తనకు తొలి అవకాశం ఇవ్వడం వల్లే’నంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు అశ్వని.

ఇలా మహిళా సాధికారతను చాటే చిత్రాలే కాదు.. సామాజిక స్థితిగతులకు దర్పణం పట్టే చిత్రాలు, ఆధునిక యువత మెచ్చే ప్రేమకథా చిత్రాలు.. ఇలా వివిధ భాషల్లో సుమారు 87కు పైగా సినిమాలు రామోజీ సృజనాత్మక మస్తిష్కం నుంచి రూపుదిద్దుకున్నవే! వెండితెర పైనే కాదు.. బుల్లితెర పైనా ఎన్నో అద్భుతాలు సృష్టించారాయన! మహిళా సాధికారతకు, స్ఫూర్తికి అద్దం పట్టేలా ‘అంతరంగాలు’, ‘భార్యామణి’.. వంటి ఎన్నో సీరియళ్లకు ప్రాణం పోశారు ఈ కృషీవలుడు.

అనుభవంతో సంబంధం లేకుండా ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఈ అజరామరుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన నిర్మించిన మహిళా ప్రాధాన్య చిత్రాలు, అందులోని స్త్రీ పాత్రలు అనునిత్యం మనకు ఆదర్శంగా నిలుస్తుంటాయి.. అడుగడుగునా మనలో స్ఫూర్తిని రగిలిస్తుంటాయనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్