ఇలాంటి భాగస్వామి ఉంటే.. గొడవలే రావట!

దంపతుల మధ్య వయోభేదం ఎక్కువగా ఉంటే.. ఇద్దరి మధ్య తరచూ గొడవలొస్తాయనుకుంటారు చాలామంది. అలాగే భార్య కంటే భర్త చిన్నవాడైనా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయనుకుంటారు.

Published : 12 Feb 2024 12:44 IST

దంపతుల మధ్య వయోభేదం ఎక్కువగా ఉంటే.. ఇద్దరి మధ్య తరచూ గొడవలొస్తాయనుకుంటారు చాలామంది. అలాగే భార్య కంటే భర్త చిన్నవాడైనా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయనుకుంటారు. నిజానికి ఈ రెండూ అవాస్తవమని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. వివాహంలో వయసు కంటే మానసిక పరిపక్వత ముఖ్యమంటున్నారు. ఎదుటివారి భావోద్వేగాల్ని అర్థం చేసుకొని, పరిణతితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికితే ఆ సంసారంలో అసలు గొడవలకు ఆస్కారమే ఉండదంటున్నారు. మరి, మానసికంగా పరిణతి చెందిన వ్యక్తిని వివాహమాడితే దాంపత్య బంధంలో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి..

నిందలేయరు!

తప్పొప్పులు మానవ సహజం అంటుంటారు. తెలిసో, తెలియకో భాగస్వామి విషయంలోనూ కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. వాటిని గ్రహించి తాము చేసిన తప్పుకి అవతలి వారిని క్షమాపణ కోరడం, వివరణ ఇచ్చుకోవడం.. వంటివి చేస్తే గొడవ అక్కడితో సద్దుమణుగుతుంది. కానీ కొంతమంది తాము తప్పు చేసినా.. దాన్ని ఒప్పుకోరు.. పైగా అవతలి వారిపై నిందలేస్తుంటారు. మానసికంగా పరిణతి చెందని వారే ఎక్కువగా ఇలా చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. అయితే మానసిక పరిపక్వత ఉన్న వారు.. అవతలి వారిపై నిందలు మోపకుండా తమ తప్పును గ్రహించి.. ఎదుటివారికి క్షమాపణ చెప్పడం, మరోసారి ఇలాంటి పొరపాటు పునరావృతం కాదని వారికి మాటివ్వడం.. వంటి పరిణతితో కూడిన మాటలతో భాగస్వామిని కూల్‌ చేసే ప్రయత్నం చేస్తారట! ఇలా గొడవ తర్వాత జరిగే సానుకూల పరిణామాల వల్ల ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢంగా మారుతుందంటున్నారు నిపుణులు.

తోడూ-నీడగా!

సంతోషాన్ని, బాధను సమంగా పంచుకున్నప్పుడే ఆ దాంపత్య బంధం దృఢమవుతుంది. అయితే కొంతమంది తమ భాగస్వామి సంతోషాన్ని పంచుకున్నంత శ్రద్ధగా, వారి బాధలో పాలుపంచుకోరు. వారి విచారానికి కారణమేంటో కనుక్కునే ప్రయత్నం చేయరు. అయినా వారు తమ మనసులోని బాధను చెప్పే ప్రయత్నం చేసినా వినీ విననట్లుగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా మానసికంగా పరిణతి చెందని భాగస్వామిలో ఇలాంటి ప్రవర్తనను గుర్తించచ్చని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల వారు మీపై నమ్మకం కోల్పోయే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. అదే మానసిక పరిపక్వత చెందిన భాగస్వామి దొరికితే.. మీ సుఖాల కంటే కష్టాల్లోనే ఎక్కువగా తోడుంటారంటున్నారు. అనునిత్యం మీ జీవితంలోని ప్రతికూలతల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూ.. మీతో సంతోషంగా గడపాలని వారు కోరుకుంటారట! ఇదే జరిగితే ఇద్దరి మధ్య సంతోషం తప్ప గొడవలెందుకొస్తాయి చెప్పండి!

విలువిస్తారు!

దాంపత్య బంధంలో తలెత్తే గొడవలకు.. దంపతులిద్దరూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువివ్వకపోవడం కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అది కూడా మానసిక పరిణతి లేని వారి విషయంలోనే ఇలాంటి భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నట్లు ఓ అధ్యయనంలోనూ తేలిందట! అదే.. పరిణతితో కూడిన ఆలోచనలు చేసే భాగస్వామి దొరికితే.. మీ మనసును, మనసులోని ఆలోచనల్ని, మీ అభిరుచుల్ని అర్థం చేసుకొని.. దాన్ని బట్టి మసలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో.. మీరు ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా తెలుసుకొని మరీ వాళ్లు అలా మారడానికి ఇష్టపడతారట! నిజానికి ఇలా ఒకరినొకరు అర్థం చేసుకొని, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే ఇక గొడవలకు తావెక్కడుంటుంది?!

వాళ్లకూ సమప్రాధాన్యం!

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు కాదు.. ఇరు కుటుంబాలు కలవడం అంటారు. ఈ వాస్తవం తెలిసినా.. మానసికంగా పరిణతి చెందని భాగస్వామి ఈ విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు. నేను, నా భర్త/భార్య.. మేమిద్దరం కలిసుంటే చాలు అన్న భావనలో ఉండిపోతారు. దీనివల్ల దాంపత్య బంధంలోనే కాదు.. ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి. అదే.. మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తులు ఇలా ఆలోచించరు. తమ భాగస్వామికి ఎంతటి ప్రాధాన్యమిస్తారో, వారికెలా ప్రేమను పంచుతారో.. వాళ్ల కుటుంబ సభ్యులనూ అంతే బాధ్యతతో చూసుకుంటారు. దీనివల్ల అవతలి వారు కూడా మీ కుటుంబ సభ్యుల్ని అంతే ప్రేమతో ఆదరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ దంపతుల మధ్య తెగని గొడవలొచ్చినా పెద్దవాళ్లు కలుగజేసుకొని మరీ ఇద్దరినీ తిరిగి కలిపే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. ఏదేమైనా పరిపక్వతతో ఆలోచించే భాగస్వామి దొరికితే.. ఇక ఆ దంపతుల మధ్య అన్యోన్యత మరింత రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్