ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!

పెళ్లనేది శాశ్వతమైన అనుబంధం. అందుకే అది ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా అన్నీ కుదిరాకే అడుగు ముందుకేస్తారు ఇరు కుటుంబ సభ్యులు. అయితే ఇలా పెద్దలకే కాదు.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే జంటకూ.. ముందే కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

Published : 16 Apr 2024 13:30 IST

పెళ్లనేది శాశ్వతమైన అనుబంధం. అందుకే అది ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా అన్నీ కుదిరాకే అడుగు ముందుకేస్తారు ఇరు కుటుంబ సభ్యులు. అయితే ఇలా పెద్దలకే కాదు.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే జంటకూ.. ముందే కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. తద్వారా భవిష్యత్తులో తమ అన్యోన్య దాంపత్యంలో కలతలకు తావు లేకుండా సంసార జీవితాన్ని ఆస్వాదించచ్చంటున్నారు. ఇంతకీ, కాబోయే దంపతులు ఏయే విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!

ఎలా ఖర్చు చేస్తారు?

ఏ అనుబంధాన్నైనా ముడి పెట్టేది, విడదీసేది డబ్బే అంటుంటారు. ముఖ్యంగా చాలామంది భార్యాభర్తలు ఈ విషయంలో గొడవ పడడం చూస్తుంటాం. అయితే భాగస్వామి పొదుపు-మదుపులు, చేసే ఖర్చుల గురించి ఎదుటివారికి అవగాహన కొరవడడమే ఈ గొడవలకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఆర్థిక విషయాల్లో ఎవరెలా ఉంటారో పెళ్లికి ముందే ఓ స్పష్టతకు వస్తే ఈ సమస్యలేవీ ఉండవంటున్నారు. ఈ క్రమంలో దంపతుల్లో ఒకరు మరీ పొదుపుగా డబ్బు ఖర్చు పెట్టచ్చు.. ఇంకొకరు విచ్చలవిడిగా ఖర్చు చేయచ్చు.. దీంతో ఈ ఇద్దరికీ పొంతన కుదరదు. కాబట్టి పెళ్లికి ముందే దీని గురించి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం మంచిది. ఇరువురికీ వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చులు, పొదుపులతో ఓ ప్రణాళిక వేసుకుంటే.. జీవితం కూడా ఓ పద్ధతి ప్రకారం ముందుకెళ్తుంది. అలాగే ఎక్కడ ఖర్చు చేయాలి? ఎక్కడ పొదుపుగా వాడాలి? వంటి విషయాల్ని మీ భాగస్వామికి వివరిస్తే.. డబ్బు విషయంలో ఇద్దరూ ఒక తాటి మీదకు వస్తారు. దీంతో ఇక ఆ తర్వాత గొడవలకు తావే ఉండదు.

ఒప్పించారా? లేదా?

అది ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లైనా.. ఇరు కుటుంబాలు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడే.. కొత్త జంట అనుబంధం అన్యోన్యంగా, సంతోషకరంగా ముందుకు సాగుతుంది. అయితే కొంతమంది ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోవట్లేదని.. ఎవరి ప్రమేయం లేకుండా పెళ్లి చేసేసుకుంటారు. దీన్ని పరువు తక్కువగా భావించే కొందరు తల్లిదండ్రులు వారిని ఏ రకంగా విడదీయడానికైనా వెనకాడట్లేదు. కాబట్టి ఈ సమస్యలేవీ లేకుండా ఉండాలంటే జంటలు కాస్త ఓపిక పట్టైనా సరే.. పెద్దల్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అలాగే పెద్దలు కూడా తమ పిల్లల భవిష్యత్తును, వారి సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో వాళ్ల ప్రేమను అంగీకరించాలి. ఒకవేళ వాళ్లు కెరీర్‌లో స్థిరపడలేదు అనుకుంటే.. అప్పటిదాకా వాళ్లకో అవకాశం ఇవ్వడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ఇలా మొత్తానికి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే.. ప్రతి విషయంలో ఇద్దరికీ.. తమ వాళ్లున్నారన్న భరోసా ఉంటుంది.

వాటిని దాచద్దు!

ప్రేమించిన వ్యక్తే భాగస్వామిగా రావాలని లేదు.. అలాగని ఆ వ్యక్తి గురించి, దాని తాలూకు గత జ్ఞాపకాల గురించి మీరు చేసుకోబోయే భాగస్వామి వద్ద దాచడం కూడా కరక్ట్‌ కాదు. కాబట్టి జీవితం పంచుకోబోయే జంటలు వీటి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలి. ఒకవేళ అభద్రతా భావంతో ఇప్పుడు మీరు ఆయా విషయాల్ని దాచిపెట్టినా.. భవిష్యత్తులో మూడో వ్యక్తి ద్వారా తెలిస్తే.. అది కచ్చితంగా ఇద్దరి మధ్యా గొడవలకు, భేదాభిప్రాయాలకు దారితీస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ముందే.. తమ గత రిలేషన్‌షిప్స్‌, చేదు సంఘటనల గురించి పంచుకొని.. అవతలి వాళ్లకు అంగీకారమైతేనే ముందడుగు వేయడం మంచిది.

లక్ష్యాలకు అడ్డు పడకుండా..!

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం కామన్. అయితే పెళ్లయ్యాక ఉద్యోగం విషయంలో గొడవలు రాకుండా ఉండాలంటే.. పెళ్లికి ముందే దీనికి సంబంధించి స్పష్టత తెచ్చుకోవడం అవసరం. అలాగే మీ భవిష్యత్‌ లక్ష్యాల గురించి మీకున్న ఆలోచనల్ని కాబోయే భాగస్వామితో పంచుకోవాలి.. వాళ్ల ఆలోచనల్నీ తెలుసుకోవాలి. ఇలాంటప్పుడే పెళ్లి తర్వాత మీ కెరీర్‌ గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఈ పెళ్లికి ఒప్పుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవచ్చు.

ఇక వీటితో పాటు పెళ్లయ్యాక పిల్లల విషయంలో, కేటాయించుకునే వ్యక్తిగత సమయాలు, ఉమ్మడి కుటుంబమా? లేదంటే విడిగా ఉండాలా?.. వంటి అంశాల్లో కూడా ముందే ఓ స్పష్టత తెచ్చుకుంటే వైవాహిక బంధంలో గొడవలకు తావుండదు. తద్వారా జంటలు తమ అన్యోన్య దాంపత్యాన్ని పది కాలాల పాటు పదిలపరచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్