Updated : 03/02/2023 07:21 IST

ప్రధాని ఇచ్చిన బ్యాటన్‌తో..ఆ కష్టం మరిచిపోయా!

దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షలమంది ఎన్‌సీసీ క్యాడెట్‌లు పోటీపడితే మొదటి స్థానంలో నిలిచి ప్రధానితో ప్రశంసలు అందుకుంది. దిల్లీలోని గడ్డకట్టే చలిలో పట్టుదలగా ఆమె చేసిన సాధనే తెలుగమ్మాయి గురుగుబెల్లి ప్రేమ్‌కృతికకి గోల్డ్‌ అవార్డు దక్కేలా చేసింది...

ణతంత్ర దినోత్సవ వేడుకలంటే యావత్‌ దేశం దిల్లీలోని కర్తవ్య్‌పథ్‌ వైపు చూసి గర్విస్తుంది. ఆ రోజు సాయుధ దళాలే కాదు, ఎన్‌సీసీ క్యాడెట్స్‌ కూడా అక్కడ జరిగే పరేడ్‌లో పాల్గొని ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసి తమ జాతీయతని చాటుకుంటారు. దేశభక్తి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఎన్‌సీసీలో ప్రతి క్యాడెట్‌ కలలు కనే అపురూపమైన అవకాశమది. ఆ కలని నిజం చేసుకుంది సికింద్రాబాద్‌ గ్రూప్‌నకు చెందిన సార్జంట్‌ జి.ప్రేమ్‌కృతిక. దేశంలోనే ఆర్మీ సీనియర్‌ వింగ్‌ విభాగంలో ఉత్తమ క్యాడెట్‌గా గోల్డ్‌ అవార్డునీ, బ్యాటన్‌నీ ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకుందీమె. అలాగే 14 లక్షల మంది క్యాడెట్‌లలో 9 మందికి మాత్రమే ప్రధాని చేతుల మీదుగా బ్యాటన్‌ అందుకునే అవకాశం వస్తుంది. అందులో కృతిక ఒకరు. ‘నాన్న ఈసీఐఎల్‌లో ఉద్యోగి. అమ్మ గృహిణి. చెల్లి ఆరో తరగతి చదువుతోంది. నాచారంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ప్లస్‌ 2 చదువుతున్నా. ఎనిమిదో తరగతిలో ఎన్‌సీసీలో చేరా. అంతకంటే ముందు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో ఉన్నా. యువతను దేశభక్తి, క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దే విధానం నచ్చి ఇందులో చేరాను. ఏపీ, తెలంగాణల నుంచి సెప్టెంబరులో రిపబ్లిక్‌డే క్యాంప్‌నకు ఎంపిక మొదలైంది. రాతపరీక్ష, డ్రిల్‌, ఫైరింగ్‌, సాంస్కృతికం తదితర అంశాల్లో ప్రతిభ కనబర్చిన క్యాడెట్స్‌ను ఎంపిక చేసి డిసెంబరులో శిక్షణ అందించారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షకు పైగా క్యాడెట్ల నుంచి దిల్లీలో జరిగే పరేడ్‌కి 121 మంది ఎంపికయ్యాం. ఇలా 28 రాష్ట్రాల నుంచి 2155 మంది హాజరై, దిల్లీలో జనవరి నెలంతా క్యాంప్‌లో పాల్గొన్నాం. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ విభాగాలకు సంబంధించి ఒక్కొక్కరిని.. 17 యూనిట్ల నుంచి ఎంపిక చేశారు. వారిలో నేను ఆర్మీ విభాగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వంగా అన్పించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మా లక్ష్యం గురి తప్పకూడదు. దిల్లీలో గడ్డకట్టే చలి. అలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా తెల్లవారుజామున లేచి సాధన చేసేవాళ్లం. అలసిపోయినా సరే మరుసటి రోజు తిరిగి ఉత్సాహాన్ని నింపుకొని క్యాంపులో హాజరయ్యేవాళ్లం. ఆ కష్టమంతా ప్రధాని చేతుల మీదుగా బ్యాటన్‌ అందుకోవడంతో తీరిపోయింది. ఈ పరేడ్‌లో పాల్గొనడం నాకిది రెండోసారి. మొదటిసారి జూనియర్‌గా ఉండగా పాల్గొన్నా. కానీ ఇది మరిచిపోలేని అనుభూతి. దిల్లీ నుంచి వచ్చాక స్కూల్‌కు వెళితే అక్కడ టీచర్లు, స్నేహితులు అభినందించడం చాలా సంతోషంగా అన్పించింది. అన్నట్టు మా స్కూల్‌ వాళ్లు రూ.50వేల బహుమతినీ అందించారు. ఇక చదువు విషయానికి వస్తే ఇన్ని సెలవులతో పాఠాలు వినడం సాధ్యంకాదు కాబట్టి ఆతర్వాత టీచర్లతో ప్రత్యేకంగా అడిగి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నా. భవిష్యత్తులో ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. దేశ సేవలో పాలుపంచుకుని నా వంతు కృషి చేస్తా’ అంటోంది కృతిక.

 రమేష్‌రెడ్డి, హైదరాబాద్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి