Hema: సాస్‌లతో.. కోట్ల వ్యాపారం!

ఎంతో శ్రమ, ప్రణాళికలతో ప్రయత్నించినా వ్యాపారంలో నిలదొక్కుకుంటామా లేదా అన్న సందేహం చాలామందిది. వీళ్లు మాత్రం అలవోకగా రూ.కోటి మార్కు దాటేశారు. పైగా సరదా ప్రయత్నం ఇలా వ్యాపారమైంది అంటున్నారు.

Published : 26 May 2023 02:11 IST

ఎంతో శ్రమ, ప్రణాళికలతో ప్రయత్నించినా వ్యాపారంలో నిలదొక్కుకుంటామా లేదా అన్న సందేహం చాలామందిది. వీళ్లు మాత్రం అలవోకగా రూ.కోటి మార్కు దాటేశారు. పైగా సరదా ప్రయత్నం ఇలా వ్యాపారమైంది అంటున్నారు. అదెలా సాధ్యమైందంటే.. ఈ తల్లీకూతుళ్ల ప్రయాణం చూసేయాల్సిందే!

లాక్‌డౌన్‌ సమయంలో ఊసుపోక ఎక్కువమంది ప్రయత్నించిన వాటిల్లో వంట కూడా ఒకటి. దీక్షిత, ఒజస్వి కూడా అమ్మ హేమా శర్మ దగ్గర వంట నేర్చుకోవాలనుకున్నారు. ఈ వ్యాపకం వీళ్లకి తెగ నచ్చేసింది. ఇటాలియన్‌, ఆఫ్రికన్‌, చైనీస్‌, మెక్సికన్‌.. ఇలా విదేశీ వంటలన్నీ విజయవంతంగా చేసుకుంటూ వెళ్లారు. విదేశీ వంటకాల్లో సాస్‌, మసాలా దినుసులదే ప్రధాన పాత్ర. వాటిల్లో తేడాలొస్తే పూర్తిగా రుచే మారిపోతుంది. వాటి రహస్యాలను మాత్రం ఈ ముగ్గురూ పట్టేశారు. ఇంట్లోనే తయారుచేసి సఫలీకృతులయ్యారు కూడా! వీళ్లది ముంబయి.

‘మొదట స్నేహితులు, బంధువులకు సాస్‌లు సరఫరా చేశాం. అందరూ బాగున్నా యంటోంటే సరదాగా ఉండేది. తక్కువ వ్యవధిలోనే ఆర్జనా మొదలైంది. ఆ ఉత్సాహంతో 2021లో చిన్న స్థలం తీసుకొని ‘చిల్జో’ పేరుతో తయారీ ప్రారంభించాం. మేం దాచుకున్న మొత్తంతోపాటు కొంత లోన్‌ తీసుకున్నాం. జనవరి నుంచి ఆన్‌లైన్‌ అమ్మకాలు ఆరంభించాం. ఏడాదిలో మా వ్యాపారం రూ.1.2 కోట్లు’ అని ఆనందంగా చెబుతోందీ త్రయం. ముంబయితోపాటు దిల్లీ, కోల్‌కతాలకూ సరఫరా చేస్తున్నారు. అమెజాన్‌, జియో వంటి ఆన్‌లైన్‌ వేదికల్లోనూ అమ్ముతున్నారు.

దీక్షిత అమెరికా సంస్థలో మార్కెటింగ్‌ విభాగంలో చేసేది. ఒజస్వి మెకానికల్‌ ఇంజినీర్‌. వ్యాపారం విస్తరిస్తుండటంతో వీళ్లిద్దరూ ఉద్యోగాల్ని పక్కన పెట్టేశారు. మార్కెటింగ్‌, పీఆర్‌ పనులను దీక్షిత, మెషినరీ, ఆర్‌అండ్‌డీ విభాగం ఒజస్వి.. ఆపరేషన్స్‌ హేమ.. ఇలా పనులను పంచుకున్నారట. దాదాపు 50 మందికి ఉపాధి కల్పించారు. ‘రెస్టారెంట్లలో రుచి చూసేవారే ఎక్కువ. సొంతంగా ప్రయత్నించినా విఫలమవుతామనే భయం చాలామందిలో. అందుకే విదేశీ వంటకాల తయారీతోపాటు సాస్‌లను ఉపయోగించే విధానాన్నీ సోషల్‌ మీడియాలో పరిచయం చేశాం అలా మార్కెటింగ్‌ పెంచుకున్నాం. ఈ ఏడాది రూ.4కోట్లకు చేరుకుంటా’మంటున్నారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను పరిచయం చేయడం, సొంత స్టోర్‌ ఏర్పాటే లక్ష్యమట. బాగుంది కదూ.. వీళ్ల సాస్‌ వ్యాపారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్