అతన్ని కలిశాక శారీరకంగా దూరం పెడుతున్నారు..!

మా పెళ్లై నాలుగేళ్లైంది. మాకు ఒక పాప ఉంది. నా భర్త ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నేను కూడా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాను. నా భర్తకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. సమయం లభిస్తే సామాజిక మాధ్యమాల్లో ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన వీడియోలను చూస్తుంటారు.

Published : 19 Feb 2024 12:39 IST

(Representational Image)

మా పెళ్లై నాలుగేళ్లైంది. మాకు ఒక పాప ఉంది. నా భర్త ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నేను కూడా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాను. నా భర్తకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. సమయం లభిస్తే సామాజిక మాధ్యమాల్లో ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన వీడియోలను చూస్తుంటారు. ఈ మధ్య ఆయన ఒక ఆధ్యాత్మిక గురువును కలిశారు. ఆ గురువు ‘ఆధ్యాత్మికతలో శారీరక సంబంధానికి చోటు లేదు’ అని చెప్పడంతో నన్ను శారీరకంగా దూరం పెడుతున్నారు. నేను ఎంత చెప్పినా ఆయన తన గురువు మాటల నుండి బయటకు రావడం లేదు. ఆయన తిరిగి నాతో సన్నిహితంగా ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. దాంపత్య బంధాన్ని కూడా పక్కనపెట్టి మీ భర్త ఆధ్యాత్మికత వైపు మళ్లడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం అతనితో స్నేహపూర్వక వాతావరణంలో చర్చించండి. ఈ క్రమంలో భర్తగా తన బాధ్యతలను గుర్తు చేస్తూనే మీ మానసిక, శారీరక అవసరాల గురించి వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అతను సానుకూలంగా స్పందించకపోతే ఇతర మార్గాలను పరిశీలించండి.

ఆధ్యాత్మిక గురువు ప్రవచనాల వల్లే మీ భర్త ఆలోచనలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో- ఒకసారి ఆ గురువుతోనే మాట్లాడి మీ సమస్యను వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆయన సహాయం చేయడానికి ముందుకు రాకపోతే మీ ఇద్దరి మంచినీ కోరే కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులను సంప్రదించండి. వారు మీ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. అయితే చర్చల్లో భాగంగా మీ భర్త అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి. ఒకవేళ అతని నిర్ణయాలతో మీరు ఏకీభవించకపోయినా మీరు సహకారం అందిస్తారన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అతనికి నమ్మకం కలిగితే మీ దాంపత్య బంధాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ దాంపత్య బంధాన్ని బ్యాలన్స్‌ చేసుకునే వ్యక్తులు మన సమాజంలో ఎంతోమంది ఉంటారు. కాబట్టి, మీ భర్తకు ఇలాంటివారి గురించి వివరించే ప్రయత్నం చేయండి. దాని ద్వారా అతని ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అందుకు సమయం పడుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామికి తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను మీకు ప్రాధాన్యం ఇవ్వడానికి అయిష్టత వ్యక్తం చేస్తే మీ బంధాన్ని విశ్లేషించుకోవడం అవసరం. అయితే చర్చల్లో భాగంగా మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. చివరి ప్రయత్నంగా రిలేషన్‌షిప్‌ నిపుణుల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వారు తగిన సలహా/సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్