పండగ పాఠం నేర్పిద్దామా?

మన చిన్నతనంలో సంక్రాంతి ఎలా ఉండేది? ఇంటి ముందు పెద్ద రంగవల్లికలు.. పక్కవాళ్లతో పోల్చుకొని ఎవరిది బాగుందో చూడటం.

Updated : 13 Jan 2023 14:22 IST

మన చిన్నతనంలో సంక్రాంతి ఎలా ఉండేది? ఇంటి ముందు పెద్ద రంగవల్లికలు.. పక్కవాళ్లతో పోల్చుకొని ఎవరిది బాగుందో చూడటం. బంధువులు ఇంటికి రావడం.. లేదూ మనమే వెళ్లడం. అమ్మకి పిండి వంటల్లో సాయం చేయడం.. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల చిన్ననాటి కబుర్లు చెబుతోంటే ఆసక్తిగా వినడం. ఆ ఆనందంలో అంతర్భాగంగా రైతు కష్టం, ఇతరులకి సాయం చేయడం, కలిసి పనిచేయడం వంటివెన్నో నేర్చుకున్నాం. మరి ఈ తరం సంగతేంటి? యాప్‌తో నిమిషాల్లో కావాల్సినవి కళ్ల ముందుకొచ్చే వాళ్లకి వీటి విలువ తెలియజేయాలిగా మరి!

* వంటగదిలో అమ్మ కష్టపడితేనే పళ్లెంలోకి తిండి వస్తుందని పిల్లలకు చెబితే సరిపోదు. అది మన వంటగది వరకూ రావడానికి ఎందరు కష్ట పడుతున్నారో కూడా చెప్పాలి. పండక్కి పల్లెటూరికి వెళితే సరే! ఆ అవకాశం లేకపోయినా దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లండి. ఎంతమంది ఎలా కష్టపడితే ఆహారం అందరికీ చేరుతోందో చెప్పండి. వాళ్లకి మన మూలాలు తెలుస్తాయి. సహానుభూతి చూపడం, కష్టపడే తత్వం, ఆహారాన్ని వృథా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం వంటివి అలవడతాయి.

* దుక్కి దున్నడం నుంచి పంటను ఇంటికి చేర్చడం వరకు రైతే కాదు.. అతని పూర్తి కుటుంబ కష్టం దాగుంటుంది. పట్టణాల్లో పిల్లలు కొద్దిగా మారాం చేస్తే చాలు.. ఏదైనా చేతికి అందుతుందన్న ధోరణిలో పెరుగుతారు. చేతులు, కాళ్లకు దుమ్ము అంటినా సహించలేరు. మనం అరచేతిలో పెట్టుకొని పెంచడమూ దీనికి కారణమే! అయితే ‘ఛీ బురద’ అని వాళ్లు అసహ్యించుకునే దానిలో రైతు ఎంత కష్టపడితే మన నోటికి ముద్ద అందుతోందో చెప్పండి. కష్టాన్ని గౌరవించడం నేర్చుకుంటారు.

* పండగలంటే బంధువులంతా ఒకచోటే చేరేవారు. ఆటలు, పాటలు ఇవే కాలక్షేపాలు. మరి ఇప్పుడో? చేతిలో సెల్‌ఫోన్‌, ఎదురుగా కంప్యూటర్‌ ఉంటే చాలు. ఈ సంక్రాంతికి గ్యాడ్జెట్లకు సెలవు ఇచ్చేయండి. బంధువులతో సరదాగా గడపడం, ఇంటిల్లపాదీ కలిసి గాలిపటాలు ఎగరేయడం, పిండివంటలు చేయడం.. కథలు చెప్పుకోవడం వంటివి చేయండి. మొత్తంగా ‘పాత పద్ధతి’లో పండగను నిర్వహించుకోండి. అంతర్లీనంగా ఎన్నో పాఠాలు చెప్పినవారవుతారు. పిల్లలకీ ఈ పండగ మధురానుభూతిగా నిలుస్తుంది. మరి.. నేర్పడానికి మీరు సిద్ధమా?

సంక్రాంతి పండగ జరుపుకోవడంలో మీ చిన్నప్పటికీ ఇప్పటికీ ఏవైనా మార్పులు చోటుచేసుకున్నాయా? ఈసారి మీ వేడుకల గురించి పంచుకోండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్