Updated : 08/05/2022 19:17 IST

అమ్మ అండతోనే ఇలా ఉన్నాం..!

తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల అంటుంటారు. పిల్లల భవిష్యత్తుకు ఆమే బలమైన పునాది వేస్తుంది. వారిని ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది. అందుకే ‘అమ్మ అండతోనే మేమీ స్థాయికి చేరుకున్నాం..’ అంటుంటారు చాలామంది. ఆ జాబితాలో తామూ ఉన్నామంటున్నారు కొందరు సినీతారలు. తమ తల్లుల ప్రోత్సాహం, స్ఫూర్తితోనే పురుషాధిపత్యాన్ని జయిస్తూ సినీ రంగంలో రాణించగలుగుతున్నామని చెబుతున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా కొందరు టాలీవుడ్‌ తారలు వాళ్ల అమ్మలతో తమకున్న అనుబంధాన్ని, అనురాగాన్ని ఇలా పంచుకున్నారు.

కీర్తి సురేశ్‌ - మేనక సురేశ్

నేను సినిమాల్లోకి రాకముందు అమ్మ నాతో ఒక విషయం పదే పదే అంటుండేది. ‘ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకోలేకపోయాను.. ఆ లోటు ఎప్పటికీ నా మదిలో అలా ఉండిపోతుంది..’ అని! అమ్మ మలయాళంలో నటించిన తొలి చిత్రానికి బోలెడన్ని అవార్డులొచ్చాయి. ఈ క్రమంలోనే జాతీయ అవార్డు కూడా వస్తుందని ఆశించాం. కానీ ఆఖరి క్షణంలో మిస్సయింది. ‘ఒకవేళ భవిష్యత్తులో నేను ఈ అవార్డు అందుకున్నా.. అమ్మ కల నెరవేర్చినట్లవుతుంది..’ అనుకునేదాన్ని. ఆ కల మహానటి ద్వారా నిజమైంది. అందుకే ఈ అవార్డును అమ్మకే అంకితమిస్తున్నా.. ఓ కూతురిగా ఇది నాకు గర్వించదగ్గ క్షణం! అటు అమ్మ హ్యాపీ.. ఇటు నేను డబుల్‌ హ్యాపీ!

పూజా హెగ్డే - లతా హెగ్డే

మా అమ్మ చాలా స్ట్రాంగ్. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటుంది. అదే నాకు స్ఫూర్తినిచ్చింది. నా చిన్నతనం నుంచి అమ్మానాన్నలిద్దరూ ఏ విషయాన్నైనా ప్రయోగాత్మకంగా నాకు వివరించేవారు. వాళ్ల మాటలు, చేతల్లో నాకు ఒక నమ్మకం కనిపించేది. ఇక వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ విషయంలో అమ్మ నుంచి చాలా నేర్చుకోవాలి. ఓ వైపు నన్ను, అన్నయ్యను చూసుకుంటూనే.. మరోవైపు వ్యాపారంలో రాణించింది. రోజంతా తానెంత బిజీగా ఉన్నా సాయంత్రం మేం స్కూల్‌ నుంచి ఇంటికొచ్చాక ఎంతో ఓపిగ్గా మాతో హోంవర్క్‌ చేయించేది. అసలు అమ్మ ఈ పనులన్నీ ఎలా మేనేజ్‌ చేసుకుంటుందోనని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని. ఇలా అటు వృత్తిని, ఇటు ఇంటిని, మరోవైపు పిల్లల బాధ్యతల్ని బ్యాలన్స్‌ చేస్తోన్న సూపర్ విమెన్ అందరికీ హ్యాట్సాఫ్!

రష్మిక మందాన – సుమన్‌ మందాన

నాకు 18 ఏళ్ల వయసొచ్చినప్పట్నుంచి నా జీవితం ఓ మారథాన్‌లా ముందుకు సాగిపోతోంది. ఈ రేసు పూర్తయింది.. కాస్త విశ్రాంతి తీసుకుందాం.. అనుకోగానే మరో రేసు ప్రారంభించాల్సి వస్తోంది. ఓ నటిగా ఇలా బిజీగా ఉండాలనే నేనూ కోరుకుంటున్నా. మీతో ఒక్కమాట చెప్పనా.. ఇన్నేళ్ల నా జీవితంలో నేను ఇంట్లో గడిపిన క్షణాలు చాలా తక్కువ. ఎందుకంటే హైస్కూల్‌ చదువు పూర్తయ్యేదాకా హాస్టల్‌లోనే ఉన్నా. ఆ తర్వాత సినిమాల్లోకొచ్చాక షూటింగ్స్‌ హడావిడి. అయితే ఇంటిని మిస్సవుతున్నానన్న భావన నాలో నుంచి తొలగించడానికి అమ్మ ప్రతి క్షణం నా వెంటే ఉండేది. అర్ధరాత్రి షూటింగ్స్‌ ఉన్నా సెట్‌లోనే వేచి చూసేది. ఇక నాన్న కూడా రోజూ కాసేపు మాతో సమయం గడిపేవారు. ఇలా వాళ్లు నా వెంటే ఉంటూ నా బలాలుగా మారిపోయారు. నా నటనను ప్రశంసించడమే కాదు.. అందులోని లోపాల్ని పసిగట్టి నేను సరిదిద్దుకునేలా ప్రోత్సహించే గొప్ప స్ఫూర్తి మా అమ్మ. చాలామంది.. అమ్మ, నేను ఒకేలా ఉన్నామంటారు.. కానీ అన్నింటికంటే మా ఇద్దరి నవ్వు ఒకేలా ఉంటుంది. తను నాకు అందించిన గొప్ప గిఫ్ట్‌ అదే! లవ్యూ అమ్మా..!!

సమంత – నినెట్టే ప్రభు

నమ్మకాన్ని నమ్మే వ్యక్తిని నేను. ఆ నమ్మకానికి నిలువెత్తు రూపమే మా అమ్మ. ఆమె ప్రార్థనల్లో ఏదో మ్యాజిక్‌ దాగుంది. నా చిన్నతనంలో పదే పదే అమ్మతో ఒక మాట అంటుండేదాన్ని.. ‘అమ్మా.. నా కోరికలు నెరవేరేలా ప్రార్థన చెయ్యమని!’ ఎందుకంటే తను అలా మనస్ఫూర్తిగా కోరుకొని చేసిన ప్రార్థనలు ఫలించేవి.. కోరికలు నెరవేరేవి! ఇప్పటికీ నేను ఈ మాటను మర్చిపోలేదు. ఏ తల్లీ తన కోసం ఏమీ కోరుకోదు.. పిల్లల క్షేమమే తన సంతోషంగా భావించే త్యాగమూర్తి అమ్మ. ఆ దేవుడి ప్రతిరూపం! ఇలాంటి అమ్మకు కూతురినవడం కంటే అదృష్టం ఇంకేముంటుంది?! లవ్యూ అమ్మా..!!

మంచు లక్ష్మీప్రసన్న – విద్యా దేవి

వెయ్యి పదాల సారాంశం ఒక చిత్రంలో దాగున్నట్లు.. ఈ ఫొటోలో అనంతమైన అమ్మ ప్రేమ దాగుంది. నా గురువు, థెరపిస్ట్‌, నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. అన్నీ అమ్మే! ఆమె చేతుల్లో, కౌగిలింతల్లో ఏదో మహత్తు ఉంది.. ఆమె ప్రేమలో అమితమైన ప్రోత్సాహం, స్ఫూర్తి ఉన్నాయి.. నిష్కల్మషమైన నీ అనురాగానికి నేనెప్పుడూ రుణపడి ఉంటానమ్మా!

వీళ్లే కాదు.. నయనతార - ఒమనా కురియన్‌, కాజల్‌ - సుమన్‌, నిహారిక – పద్మజ.. వంటి ముద్దుగుమ్మలు కూడా తమ తల్లులతో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో పంచుకుంటూ మురిసిపోతుంటారు.

హ్యాపీ మదర్స్‌ డే!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని