పిల్లల ముందు బాధపడుతున్నారా?

పిల్లలకు అమ్మే సూపర్ హీరో. ఎలాంటి సమస్య వచ్చినా సరే అమ్మకు చెబితే అది పరిష్కారమవుతుందని పిల్లల నమ్మకం. అలాంటి అమ్మకు కూడా కష్టాలొస్తాయి, కన్నీళ్లుంటాయని చిన్న పిల్లలకు తెలియదు. అందుకే వాటిని పిల్లలకు కనబడనీయకుండా తల్లి జాగ్రత్తపడుతుంది. అయితే ప్రతిసారీ పరిస్థితి తన అధీనంలో ఉండాలని లేదు....

Updated : 18 Feb 2022 21:32 IST

పిల్లలకు అమ్మే సూపర్ హీరో. ఎలాంటి సమస్య వచ్చినా సరే అమ్మకు చెబితే అది పరిష్కారమవుతుందని పిల్లల నమ్మకం. అలాంటి అమ్మకు కూడా కష్టాలొస్తాయి, కన్నీళ్లుంటాయని చిన్న పిల్లలకు తెలియదు. అందుకే వాటిని పిల్లలకు కనబడనీయకుండా తల్లి జాగ్రత్తపడుతుంది. అయితే ప్రతిసారీ పరిస్థితి తన అధీనంలో ఉండాలని లేదు. ఒక్కోసారి పిల్లలున్నారనే విషయం కూడా మర్చిపోయి వాళ్ల ముందే తన కోపాన్ని, బాధను వ్యక్తపరుస్తుంటుంది... కన్నీళ్లు పెట్టుకుంటుంటుంది. కన్నతల్లి అలా ఏడుస్తుంటే ఏ బిడ్డ మనసైనా తల్లడిల్లుతుంది. ఏం చెప్పి అమ్మను ఓదార్చాలో పిల్లలకు అర్ధంకాదు. అందుకే అలాంటి పరిస్థితుల్లో తల్లి ఎలా ప్రవర్తిస్తే పిల్లల మనసు బాధపడదో చూద్దాం..!

కాగితంపై రాయండి..!

మీకు డైరీ రాసే అలవాటు ఉందా..? అయితే కోపం, బాధలో ఉన్నప్పుడు మీ మనసులో ఉన్న ఆలోచనలను డైరీలో రాయండి. ఒకవేళ మీకు డైరీ రాసే అలవాటు లేని పక్షంలో ఒక కాగితంపై రాయడానికి ప్రయత్నించండి. దీనివల్ల వేరే వ్యక్తితో కాకుండా మీతో మీరే మాట్లాడుకున్నట్లు అవుతుంది. తద్వారా మీకు పరిష్కార మార్గాలు కూడా సులభంగా లభిస్తాయి. అంతేకాకుండా మీరు రోజూ చేయాలనుకునే పనులను కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. బాధలో ఉన్నప్పుడు అన్ని విషయాలు జ్ఞాపకం ఉండవు. ఇలా రాసి ఉంచితే వాటిని మర్చిపోకుండా అనుకున్న సమయానికే పూర్తి చేయొచ్చు.

మీతో మీరు మాట్లాడండి..!

మిమ్మల్ని మించిన గొప్ప స్నేహితురాలు మీకు ఎక్కడా లభించదు. అందుకే మీ ఆవేశాన్ని, ఆలోచనలను, బాధను ముందు మీతో పంచుకోండి. మీ పరిస్థితి గురించి అందరికంటే మీకే బాగా తెలుసు కాబట్టి బాగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోండి. వీలైనంత త్వరగా తిరిగి మామూలు స్థితికి రావడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీ ఆత్మవిశ్వాసం కూడా క్రమంగా పెరుగుతుంది. ఇకపై సమస్యలు వచ్చినప్పుడు మీ అంతట మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది.

ఇతరులతో పంచుకోండి..!

మీకు విపరీతమైన కోపం, బాధ వచ్చినప్పుడు.. వాటిని పిల్లల ముందు ప్రదర్శించకుండా మీ సన్నిహితులతో పంచుకోండి. వాళ్లు మీ భర్త, అమ్మ, స్నేహితుడు, స్నేహితురాలు, పక్కింటి వాళ్లు.. ఇలా ఎవరైనా కావొచ్చు. వాళ్లతో మీ బాధను వ్యక్తపరచండి.. సలహాలు తీసుకోండి. ఎందుకంటే ఎంత పెద్ద బాధైనా సరే ఇతరులతో పంచుకుంటే తగ్గిపోతుంది. అలా మీరు మామూలు స్థితికి వచ్చాక యథాతథంగా మళ్లీ పిల్లలతో కలిసిపోండి.

మరీ చిన్న పిల్లలైతే..

మీకు విపరీతమైన ఆవేశం, బాధ వచ్చినప్పుడు.. వాటిని మీ పిల్లల ఎదుటే వ్యక్తపరచకుండా వారి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే మీరు వేరే గదికి వెళ్లడం.. లేదా వాళ్లనే వేరే గదికి పంపించడం లాంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీ బాధ గురించి వాళ్లకు తెలిసే అవకాశాలు తక్కువుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు తమ తల్లి ఏడుస్తూ, బాధపడుతూ కనిపిస్తే చూసి తట్టుకోలేరు. వాళ్ల మనసులో ఆ సంఘటన చాలా కాలం వరకు అలాగే గుర్తుండిపోతుంది.

కొంచెం పెద్ద పిల్లల విషయంలో..

కొన్ని విషయాలు పిల్లల ముందు దాయడం కన్నా.. వాటి గురించి వాళ్లకు వివరిస్తేనే మేలు. ఈ క్రమంలో మీరు మీ పిల్లల ముందు కన్నీళ్లు పెట్టుకున్నా, ఆవేశాన్ని ప్రదర్శించినా.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో పిల్లలకు వివరంగా తెలియజెప్పండి.  ప్రత్యేకించి కొంచెం పెద్ద పిల్లల విషయంలో.. నిజాలను దాచిపెట్టడం వల్ల.. ఆ విషయాన్ని తమకు తోచిన విధంగా అర్ధం చేసుకొని.. వాళ్లే ఓ అభిప్రాయానికొచ్చే అవకాశముంది. దానికంటే మీరే వాళ్లకు జరిగిన నిజాలను వివరించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల 'అమ్మ'కు కూడా కోపం, బాధ, కన్నీళ్లు, ఆవేశం.. మొదలైన భావాలుంటాయని వాళ్లు అర్థం చేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్