తను మళ్లీ మీ జీవితంలోకొస్తానంటున్నారా?

‘ప్రేమించడం ఎంత సులువో.. ఆ వ్యక్తిని మర్చిపోవడం అంత కంటే కష్టం’ అంటుంటారు. ‘సరే.. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకనైనా ఆ జ్ఞాపకాల్ని తుడిచేద్దాం..’ అంటూ భారంగా కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంటారు కొందరు. అయితే అదే సమయంలో మీ మాజీ మళ్లీ మీ జీవితంలోకొస్తే? తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటూ....

Published : 17 Nov 2022 14:31 IST

‘ప్రేమించడం ఎంత సులువో.. ఆ వ్యక్తిని మర్చిపోవడం అంత కంటే కష్టం’ అంటుంటారు. ‘సరే.. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకనైనా ఆ జ్ఞాపకాల్ని తుడిచేద్దాం..’ అంటూ భారంగా కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంటారు కొందరు. అయితే అదే సమయంలో మీ మాజీ మళ్లీ మీ జీవితంలోకొస్తే? తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటూ మీతో కలిసిపోవడానికి సిద్ధపడితే..? తిరిగి తనతో గతంలో మాదిరిగానే మెలగాలా? లేదంటే మళ్లీ మోసపోతానేమోనన్న భయంతో వారిని దూరం పెట్టాలా? అసలు ఇలాంటి సందర్భంలో ఎలా స్పందించాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ఇలా గుర్తించచ్చు!

ప్రేమికులైనా, దంపతులైనా.. నచ్చితే కలిసుండడం, అభిప్రాయభేదాలొస్తే విడిపోవడం ఈ కాలపు జంటలకు కామనైపోయింది. అయితే క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత రియలైజ్‌ అయి కలిసిపోవాలనుకుంటారు చాలామంది. అయితే ఇలా మాజీ మళ్లీ మన జీవితంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారన్న విషయాన్ని వారి ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.

☙ బ్రేకప్‌ తర్వాత మీరు ఫోన్‌ నంబర్‌ మార్చినా.. ఎలాగోలా తెలుసుకొని మిమ్మల్ని కాంటాక్ట్‌ అవడం.

☙ పదే పదే కాల్స్‌, సందేశాల ద్వారా మిమ్మల్ని పలకరించాలని అత్యుత్సాహం చూపడం.

☙ వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి మీతో పంచుకోవాలని ప్రయత్నించడం.

☙ బ్రేకప్‌ తర్వాత మీ జీవితంలో మరో వ్యక్తిని ప్రేమించారేమోనన్న సందేహం, అసూయతో ఆ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం.

☙ మళ్లీ మీతో స్నేహం చేయడానికి ఉత్సాహం చూపడం.. మధ్యమధ్యలో మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించడం.

☙ మీతో మాట్లాడడానికి, కలవడానికి సాకులు చెప్పడం.

☙ మీ పుట్టిన రోజులు, ఇతర ప్రత్యేకమైన సందర్భాలు గుర్తుపెట్టుకొని మరీ విష్‌ చేయడం.

☙ సోషల్‌ మీడియాలో మీరు పెట్టే పోస్టులు, ఫొటోలు.. పదే పదే చూడడం.

☙ ప్రత్యేకమైన బహుమతులతో మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేయడం.

☙ చిన్న చిన్న వాటికే సారీ చెబుతూ, అలాగే చిన్న చిన్న విషయాలకే మిమ్మల్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ.. మీ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయడం.

☙ మిమ్మల్ని ఎంతలా మిస్సవుతున్నారో తమ మాటలు, చేతల ద్వారా చెప్పడం.

ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే!

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం అంత సులభం కాదు. అలాగని వాళ్లు తిరిగి మన జీవితంలోకి రావడానికి ప్రయత్నించినా.. గత చేదు జ్ఞాపకాలు మళ్లీ ఎక్కడ రిపీట్ అవుతాయేమోనన్న భయంతో వారిని తిరిగి అంగీకరించడానికి మనసొప్పదు. అయితే కొంతమంది ఈ విషయంలో స్థిరంగా ఉండలేరు. ‘తిరిగి వారికి మరో అవకాశం ఇస్తే పోలా..’ అన్న కోణంలో ఆలోచించే వారూ లేకపోలేదు. కానీ జీవితంలో ఒకసారి మోసపోయాక.. మరోసారి అదే పొరపాటును పునరావృతం చేయడం మూర్ఖత్వమే అవుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి అవతలి వారి ప్రవర్తన, మాటల్ని గుడ్డిగా నమ్మేయకుండా.. ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో మీ స్నేహితులు/కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం, కొన్నాళ్ల పాటు వారి ప్రవర్తనను పరిశీలించడం, వారి మార్పులో ఎంత నిజాయతీ ఉందో గమనించడం.. ఇవన్నీ సునిశితంగా తెలుసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవడం వల్ల మరోసారి మీ మనసు గాయపడకుండా జాగ్రత్తపడచ్చు.

నిర్మొహమాటంగా అడిగేయండి!

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మిమ్మల్ని కాదని, మీతో అనుబంధాన్ని తెంచుకొని బయటికి వెళ్లిపోయిన వ్యక్తి.. తిరిగి జీవితంలోకి వస్తానంటే ఎవరూ అంత ఈజీగా ఒప్పుకోరు. పైగా ఈసారి మళ్లీ ఎలా మోసం చేస్తారోనన్న భయం ఉండడం సహజం. అలా జరగకుండా ఉండాలంటే అవతలి వ్యక్తి ప్రవర్తనను పరిశీలించడంతో పాటు వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ‘ఒకసారి కాదనుకొని వెళ్లిపోయాక.. మళ్లీ నేనే ఎందుకు కావాలనిపించింది?’, ‘తిరిగి నీతో బంధాన్ని కొనసాగిస్తే మోసం చేయవన్న గ్యారంటీ ఏంటి?’.. అన్న ప్రశ్నల్ని నేరుగా అడిగి.. వారి మనసులో ఉన్న ఆలోచనలేంటో తెలుసుకోవాలి. ఇలా వారి మాటల్లో నిజాయతీ కనిపించకపోయినా, తడబాటుగా అనిపించినా.. వారిని పూర్తిగా దూరం పెట్టడమే మంచిదంటున్నారు నిపుణులు. లేదు.. వారి తప్పు తెలుసుకొని మారారు అన్న నమ్మకం కలిగితే.. వెంటనే అంగీకరించడం కాకుండా కొన్నాళ్ల పాటు వారి ప్రవర్తనను దగ్గర్నుంచి గమనించి తగిన నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది.

వాటికి పరిష్కారముందా?

కొంతమంది దంపతులు/కొన్ని జంటలు అభిప్రాయభేదాల వల్ల విడిపోతే.. మరికొందరు కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల వల్ల విడిపోతుంటారు. అయితే క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత లోతుగా ఆలోచించి, వాటిని పరిష్కరించుకొని తిరిగి కలిసిపోవాలనుకుంటారు. మీరూ అదే ఆలోచనలో ఉన్నారా? అయితే ‘పాత సమస్య పరిష్కారమవుతుంది.. కానీ మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి విభేదాలు తలెత్తవన్న గ్యారంటీ ఏంటి?’ మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటోన్న మీ మాజీని ఈ ప్రశ్న అడిగి చూడండి. ఈ క్రమంలో వాళ్ల హామీ తీసుకోండి. అలాగే ఈ విషయంలో ఇరు కుటుంబ సభ్యులు, పెద్ద వాళ్లనూ భాగం చేయండి. తద్వారా మరోసారి సమస్యలొచ్చినా తెగే దాకా లాగకుండా సులువుగా పరిష్కరించుకోవచ్చు. పెద్దల అండ ఉందన్న భరోసా కూడా మీకు ఉంటుంది.

కౌన్సెలింగ్‌తో మేలు!

వద్దనుకున్న వ్యక్తి తిరిగి జీవితంలోకి వస్తానన్నప్పుడు మన మనసులో ఎన్నో సందేహాలు, మరెన్నో ఆలోచనలు. ఒకసారి మోసపోయాక తిరిగి వారిని ఎలా నమ్మాలన్న సందిగ్ధం. వీటన్నింటి మధ్య ఎటూ తేల్చుకోలేకపోతారు కొందరు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంది. ఇలాంటప్పుడు తీవ్రంగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా.. నిపుణుల సలహా తీసుకోవచ్చు. లేదంటే ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్‌కు వెళ్లి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మీ మనసులోని భయాలు, గత జ్ఞాపకాలు, మీ మాజీ భాగస్వామి ఆలోచనలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిపుణులే సరైన సలహా ఇవ్వగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్