Radhika Merchant: అంబానీ కోడలా.. మజాకా!

చిన్నదైనా, పెద్దదైనా.. సెలబ్రిటీ పెళ్లిళ్లలో ప్రతి వేడుకా ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈ క్రమంలో వాళ్లు ధరించే దుస్తులతో పాటు.. ఆయా సంప్రదాయాల్లో జరిగే వేడుకల గురించి తెలుసుకోవాలనీ చాలామంది ఆరాటపడుతుంటారు.

Published : 17 Feb 2024 13:28 IST

(Photos: Instagram)

చిన్నదైనా, పెద్దదైనా.. సెలబ్రిటీ పెళ్లిళ్లలో ప్రతి వేడుకా ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. ఈ క్రమంలో వాళ్లు ధరించే దుస్తులతో పాటు.. ఆయా సంప్రదాయాల్లో జరిగే వేడుకల గురించి తెలుసుకోవాలనీ చాలామంది ఆరాటపడుతుంటారు. అలాంటి ఓ వేడుకే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అదే ‘లగన్‌ లఖ్‌వనూ’. ఈ వేడుకతోనే అంబానీ వారింట పెళ్లి సందడి మొదలైంది. రాధిక-అనంత్‌ల వివాహానికి నాంది పలికిన ఈ ప్రి-వెడ్డింగ్‌ ఫెస్టివిటీ గురించి మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి!

అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల పెళ్లిపై గత కొంత కాలంగా అందరిలో ఒకింత ఆసక్తి నెలకొంది. అయితే ఇరు కుటుంబ సభ్యులు తాజాగా జరిపిన వేడుకతో అందరి ఎదురుచూపులకు తెరపడినట్లయింది. వీళ్ల పెళ్లిలో భాగంగా తొలి వేడుకను ఘనంగా నిర్వహించారు. ‘లగన్‌ లఖ్‌వనూ’ పేరుతో ఏర్పాటుచేసిన ఈ వేడుకలో కాబోయే వధువు రాధిక సంప్రదాయబద్ధంగా మెరిసిపోయింది.

లెహెంగాతో కట్టిపడేసింది!

సందర్భానికి తగినట్లుగా రడీ అవ్వడం రాధికకు వెన్నతో పెట్టిన విద్య. పండగలు, పూజలప్పుడు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ.. పార్టీలు, ఇతర అకేషన్లలో మోడ్రన్‌ లుక్‌లో దర్శనమిస్తుంటుంది. ఇక తన పెళ్లి వేడుకకు నాందిగా నిలిచిన ‘లగన్‌ లఖ్‌వనూ’ వేడుకలో భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయబద్ధంగా ముస్తాబైంది రాధిక. ఇందుకోసం ప్రముఖ డిజైనర్‌ అనామికా ఖన్నా డిజైన్‌ చేసిన భారీ ఎంబ్రాయిడరీ పేస్టల్‌ బ్లూ లెహెంగాను ఎంచుకుందీ కాబోయే పెళ్లికూతురు. ఫ్లోరల్‌ ఆప్లిక్‌ డిజైన్‌తో ఈ లెహెంగాను తీర్చిదిద్దారు. ఇలా తన అటైర్‌కు మ్యాచింగ్‌ బ్లౌజ్‌, దుపట్టాలను జతచేసిన ఆమె.. డైమండ్‌ జ్యుయలరీతో తళుక్కుమంది. వదులైన హెయిర్‌స్టైల్‌, సింపుల్‌ మేకప్‌తో ఆకట్టుకున్న రాధికను చూసి చాలామంది.. క్యూట్‌ బ్రైడ్‌, అంబానీ కోడలా మజాకా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా పెళ్లికి ముందే అంబానీ ఫ్యాన్స్‌ మనసు దోచుకుందీ చక్కనమ్మ.

ముహూర్తం కుదిరింది!

ప్రస్తుతం రాధిక ప్రి-వెడ్డింగ్‌ అటైర్‌ మాత్రమే కాదు.. ఈ క్రమంలో జరిగిన ‘లగన్‌ లఖ్‌వనూ’ పెళ్లి వేడుక కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ‘అసలేంటీ వేడుక?’ అంటూ చాలామంది దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. మన పెళ్లిళ్లలో లగ్న పత్రిక రాసుకోవడం ఎలాగో.. గుజరాతీ సంప్రదాయంలో ఈ వేడుక అలాగన్నమాట! గుజరాతీయులు ఈ వేడుకతోనే పెళ్లి పనులు మొదలుపెడతారు. ఇక ఇదే వేడుకను అక్కడి వారు ‘కంకోత్రి’ పేరుతోనూ పిలుస్తారు. వధూవరుల ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు పూజారి సమక్షంలో పెళ్లి తేదీ/ముహూర్తం నిశ్చయించుకొని.. లగ్న పత్రిక రాసుకొని.. దాన్ని దేవుడి సమక్షంలో ఉంచుతారు. తద్వారా కాబోయే జంటకు భగవంతుడి ఆశీస్సులు అందించమని కోరతారు. సాధారణంగా వివాహానికి నెల రోజుల ముందు ఈ వేడుకను నిర్వహిస్తారు.. కొంతమంది వారి సౌకర్యార్థం ఇంకా ముందుగానే పెళ్లి పత్రిక రాసుకుంటారు. ఇలా అంబానీ-మర్చంట్‌ కుటుంబ సభ్యులు తాజాగా నిర్వహించిన ‘లగన్‌ లఖ్‌వనూ’ వేడుకలో భాగంగా అనంత్‌-రాధికల పెళ్లి ముహూర్తం నిశ్చయించారు.

గోల్‌ ధానా.. అంతరార్థమిదే!

అయితే గతేడాది జనవరిలో అనంత్‌-రాధికల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే! ‘గోల్‌ ధానా’ పేరుతో అంబానీ నివాసమైన యాంటిలియాలో ఈ వేడుకల్ని నిర్వహించారు. నిశ్చితార్థంలోనూ కాబోయే వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. గోల్‌ ధానా వేడుకలో భాగంగా.. ధనియాలు, బెల్లంతో కలిపి తయారుచేసిన ఉండల్ని వధూవరుల కుటుంబాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాయి. కాబోయే జంటకు బహుమతులివ్వడం కూడా ఇందులో భాగమే! వరుడి ఇంట్లో జరిగే ఈ వేడుకల్లో కొత్త జంట దండలు, ఉంగరాలు మార్చుకొని తమ వివాహానికి తొలి అడుగు వేస్తుంది. ఇక ఆఖర్లో ఇరు కుటుంబాల నుంచి ఐదుగురు ముత్తైదువులు కాబోయే జంటను ఆశీర్వదిస్తారు. ఆపై విందు భోజనం చేసి ఈ వేడుకను పూర్తి చేస్తారు.

ఇక గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిర్వహించే ముందస్తు పెళ్లి వేడుకల్లో ఛన్లో మట్లీ అనే వేడుక జరుగుతుంది. ఇందులో భాగంగా వధువు తండ్రి వరుడి ఇంటికి చేరుకొని.. అతడికి తిలకం దిద్ది కానుకలు అందజేస్తారు. ఆపై హల్దీ, మెహెందీ, సంగీత్‌, పెళ్లి, అప్పగింతలు.. ఇలా ఇవన్నీ దాదాపు అన్ని పెళ్లిళ్లలో మనం చూస్తుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్