అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?

నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది. నాలుగేళ్ల పాప కూడా ఉంది. ఈ మధ్య నా భర్త చేష్టలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన ఐటీ సెక్టర్‌లో పని చేస్తుంటారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే నా ఫోన్‌ హ్యాక్‌ చేశాడేమో అనిపిస్తోంది. ఆయన్ని టెస్ట్‌ చేద్దామని నేను ఓ రోజు నా ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడాను. మేము ఏదైతే ఫోన్లో మాట్లాడుకున్నామో ఆయన అవే విషయాలను నా దగ్గర ప్రస్తావిస్తున్నాడు....

Published : 29 Mar 2024 13:14 IST

నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది. నాలుగేళ్ల పాప కూడా ఉంది. ఈ మధ్య నా భర్త చేష్టలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన ఐటీ సెక్టర్‌లో పని చేస్తుంటారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే నా ఫోన్‌ హ్యాక్‌ చేశాడేమో అనిపిస్తోంది. ఆయన్ని టెస్ట్‌ చేద్దామని నేను ఓ రోజు నా ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడాను. మేము ఏదైతే ఫోన్లో మాట్లాడుకున్నామో ఆయన అవే విషయాలను నా దగ్గర ప్రస్తావిస్తున్నాడు. అడిగితే కొలీగ్‌తో జరిగిన డిస్కషన్‌ అని చెబుతున్నాడు. నేను ఒకవేళ ఫోన్‌ వాడకుండా పక్కన పెట్టేస్తే ఆ రోజంతా బాగానే ఉంటున్నాడు. ఇలా ఆయన వింత ప్రవర్తన వల్ల నాకు ఒత్తిడి, ఆందోళన మొదలయ్యాయి. నేనంటే తనకు ఇష్టమే.. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి నేనెలా బయటపడాలి?- ఓ సోదరి

జ: గత 8 ఏళ్ల నుంచి మీ దాంపత్య జీవితం సాఫీగా సాగుతోందన్న విషయం మీ ఉత్తరం ద్వారా స్పష్టమవుతోంది. కానీ ఇటీవలి కాలంలో మీ భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. వృత్తిరీత్యా అతనిది ఐటీ సెక్టర్‌ కావడం వల్ల.. టెక్నాలజీ మీద అతనికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి అతను మీ ఫోన్‌ మీద నిఘా పెడుతున్నాడని మీరనుకుంటున్నారు. తద్వారా మీరు మాట్లాడినవన్నీ అతనూ వింటున్నాడని మీరు సంశయిస్తున్నారు. ఇది నిజమో, కాదో తేల్చుకునే క్రమంలోనే మీరు పెట్టిన ఓ చిన్న పరీక్ష మీ సంశయాన్ని మరింత బలపరిచింది. అయితే ఎనిమిదేళ్ల నుంచి కలిసి జీవిస్తోన్న మీకు మనసు విప్పి మాట్లాడుకునే చనువు విషయంలో తేడా ఎందుకొచ్చిందో ముందుగా అర్థం చేసుకోండి. మీకు తెలియకుండా అతను మీ మీద నిఘా పెట్టాలనుకోవడం, అతను నిఘా పెట్టాడన్న అనుమానంతో మీరు అతన్ని పరీక్షించాలనుకోవడం.. ఈ రెండూ కూడా మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయేమో ఓసారి పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైతే స్వేచ్ఛాపూరిత సంభాషణ ఉంటుందో అప్పుడే ఇద్దరూ ఒకరి పట్ల ఒకరికి ఉన్న సంశయాలు, సందేహాలు స్పష్టంగా పంచుకోగలుగుతారు.

శ్రద్ధ తగ్గిందా?
మీ బిడ్డ పుట్టక ముందు వరకు బహుశా మీ ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఉండి ఉండచ్చు.. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డ వల్ల కానీ; మీ పనులు, వ్యక్తిగత కారణాల వల్ల గానీ, అతని ఉద్యోగం వల్ల కానీ.. ఒకరిపై ఒకరికి శ్రద్ధ తగ్గి ఉండచ్చు. ఈ క్రమంలో మీ మధ్య దూరం ఏర్పడిందా అనేది కూడా ఆలోచించుకోండి. ఇప్పుడు మీ పాప మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత పటిష్టపరిచేదే కావాలి తప్ప.. దూరాన్ని తీసుకొచ్చేదిలా తనను మీరు భావించకుండా మీ అనుబంధాన్ని మరింత దృఢపరచుకునే ప్రయత్నం చేయండి.
అలాగే- యథాలాపంగానో, యాదృచ్ఛికంగానో జరిగిన విషయాలను ఇద్దరూ భూతద్దంలో నుంచి చూస్తున్నారా? అనేది కూడా ఒకసారి ఆలోచించండి.

అన్యోన్యత పెంచుకోండి!
పరస్పరం ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం అనేవి దాంపత్య బంధానికి పునాదుల్లాంటివి. మీ ఇద్దరూ ఒకరినొకరు పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే మీ పిల్లల్ని కూడా మంచి విలువలతో పెంచగలుగుతారు. కాబట్టి మీ ఇద్దరి మధ్య నమ్మకం దృఢపడేట్లుగా చూసుకోండి. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. అయితే మీ సందేహాలు తీర్చుకునే క్రమంలో ఒకరిపై ఒకరు నిందలేస్తూ, కించపరుస్తూ, చులకన చేస్తూ, నేరారోపణ చేస్తున్నట్లుగా మాట్లాడుకోవడం కాకుండా.. ఆ సంభాషణ మీ మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలి. ఇందులో మూడో మనిషి ప్రమేయం అక్కర్లేదు. అలాగే ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ మీ మీ వైపు నుంచి ఏయే మార్పులు చేసుకోవాలో కూడా ఆలోచించుకోండి. అవతలి వారు చేసుకోవాల్సిన మార్పుల కంటే కూడా స్వయంగా ఎవరికి వారు ఏం మార్పులు చేసుకోవాలన్నది మీకు మీరే నిర్ణయించుకోవాలి. తిరిగి అన్యోన్యత పెంచుకునే దిశగా అడుగులు వేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్