‘నా డబ్బు.. నా ఇష్టం’ అంటున్నాడు!

మాది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లై మూడేళ్లైంది. నా భర్త విపరీతంగా ఖర్చు చేస్తాడు. పెళ్లైన కొత్తలో ఖర్చులు అధికంగా ఉండడంతో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పెళ్లై మూడేళ్లవుతున్నా నా భర్తకు డబ్బు పొదుపు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు.

Published : 10 Feb 2024 18:25 IST

మాది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లై మూడేళ్లైంది. నా భర్త విపరీతంగా ఖర్చు చేస్తాడు. పెళ్లైన కొత్తలో ఖర్చులు అధికంగా ఉండడంతో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పెళ్లై మూడేళ్లవుతున్నా నా భర్తకు డబ్బు పొదుపు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. జీతం పెరిగినా అతని ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. భవిష్యత్తు కోసం కొంతైనా వెనకేసుకోవాలని చెప్పినా పట్టించుకోవడం లేదు. పైగా ‘నా డబ్బు నా ఇష్టం.. నేనేమైనా చేసుకుంటా నీకెందుకు?’ అంటున్నాడు. అతడి ప్రవర్తన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. నేను గృహిణిని. నా భర్త ఇలా చేస్తుంటే భవిష్యత్తుపై పూర్తిగా నమ్మకం కోల్పోతున్నా.. ఈ పరిస్థితిని నేనెలా ఎదుర్కోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ భర్త తనకు వచ్చే ఆదాయంలో పొదుపు చేయకుండా ఖర్చు చేస్తున్నారని  చెబుతున్నారు. అయితే అతనితో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేకపోగా, అతడినే గుడ్డిగా అనుసరిస్తున్నాననీ అంటున్నారు. నిజానికి ఇది కేవలం ఆర్థిక పరమైన సమస్య మాత్రమే కాదు.. దీని ప్రభావం మీ దాంపత్య బంధంపైనా పడుతుంది. కాబట్టి ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం, పొదుపు చేయడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశం. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇందులో మూడో వ్యక్తి జోక్యం లేకుండా మీరు మీ భర్తతోనే మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది వరకే మీరు అతనితో మాట్లాడానని చెబుతున్నారు. కానీ, దానివల్ల ఆశించిన ఫలితం రాకపోగా.. పైనుంచి కోప్పడుతున్నారని అంటున్నారు. అయినా విసుక్కోకుండా మరోసారి సానుకూల వాతావరణంలో మీ భర్తతో ఈ విషయాలు చర్చించే ప్రయత్నం చేయండి. అతడి ప్రవర్తన, అతి ఖర్చులు, ఆర్థిక పరమైన నిర్లక్ష్యం కారణంగా మీరు భవిష్యత్తు గురించి పడుతోన్న ఆందోళనను సునిశితంగా వివరించండి. అలాగే అతని అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. చర్చలో గొడవలకు తావివ్వకుండా ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవిస్తూనే సమస్యను ఓ కొలిక్కి తీసుకురండి. ఇలా ఇద్దరూ కలిసి సానుకూలంగా మాట్లాడుకోవడం వల్ల ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు.

అయితే మీ జీవిత భాగస్వామితో మాట్లాడే ముందు మీరు వాస్తవ పరిస్థితిని మరోసారి స్వీయ పరిశీలన చేసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో నిజంగానే మీ భర్త అతిగా ఖర్చు చేస్తున్నాడా? లేదంటే మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారా? అనే విషయాల్ని మరోసారి పరిశీలించుకోవాలి. ఇది ఇద్దరి మధ్య సానుకూలంగా చర్చ జరగడానికి దోహదం చేస్తుంది. ఒకవేళ మీ చర్చల వల్ల సానుకూల ఫలితం లభించకపోతే ఆర్థిక నిపుణులను సంప్రదించండి. వారు తగిన సలహా ఇస్తారు.

మరో విషయం ఏంటంటే.. మీరు గృహిణిగా ఇప్పటిదాకా ఇంటి బాధ్యతలు నిర్వర్తించి ఉండచ్చు. అయితే మీకూ ఆర్థిక స్వాతంత్రం అవసరం. కాబట్టి, మీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోండి. లేదంటే మీలో ఉన్న నైపుణ్యాలను బట్టి ఆదాయ మార్గాలను అన్వేషించండి. దీనివల్ల కేవలం మీరు సొంత కాళ్లపై నిలబడడమే కాదు.. ఈ బిజీలో పడిపోయి ఇతర ఆలోచనలపైకి మనసు మళ్లకుండా ఉంటుంది.. అలాగే భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్