CWG 2022 : ఎన్నెన్నో ఆటలు.. మన అమ్మాయిలు అదరగొట్టేశారు!

‘ఆటేదైనా ఒక్కటే కల.. ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక్క పతకమైనా నెగ్గాలని! దేశానికి గర్వకారణంగా నిలవాలని!’ ఇలా ఎంతోమంది క్రీడాకారిణుల పతక కలను నిజం చేశాయి ఈ ఏటి కామన్వెల్త్‌

Published : 09 Aug 2022 18:24 IST

‘ఆటేదైనా ఒక్కటే కల.. ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక్క పతకమైనా నెగ్గాలని! దేశానికి గర్వకారణంగా నిలవాలని!’ ఇలా ఎంతోమంది క్రీడాకారిణుల పతక కలను నిజం చేశాయి ఈ ఏటి కామన్వెల్త్‌ గేమ్స్‌. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ క్రీడల్లో ఈసారి పురుషులకు దీటుగా మహిళల హవా కొనసాగిందని చెప్పచ్చు. బ్యాడ్మింటన్‌ దగ్గర్నుంచి బాక్సింగ్‌ దాకా.. క్రికెట్‌ దగ్గర్నుంచి హాకీ దాకా.. దాదాపు అన్ని క్రీడల్లో అమ్మాయిలు పతకాల పంట పండించారు. ఈసారి కొత్తగా చేరిన క్రీడాంశాల్లోనూ సత్తా చాటారు.. మరి ఈ ఏడాది మన అమ్మాయిలు ఏయే క్రీడల్లో సత్తా చాటారో ఓసారి చూద్దాం రండి..

పట్టంటే.. మన సింధుదే!

‘ఓపికతో ఒక్కో మెట్టూ ఎక్కితేనే శిఖరాగ్రానికి చేరుకోగలం’.. హైదరాబాదీ షట్లర్‌ పీవీ సింధుకు ఈ మాటలు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకం నెగ్గాలని ఎప్పట్నుంచో కలలు కంటోందామె. అయితే 2014లో కాంస్యం, 2018లో రజతంతో ఆ కోరిక నెరవేరలేదు. అయినా క్రమంగా తన ఆటను మెరుగుపరచుకుంటూ వచ్చింది. ఇక ఈసారి పసిడే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె.. ఫైనల్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా రెండు సెట్లలో పైచేయి సాధించి.. బంగారు పతకాన్ని మెడలో అలంకరించుకుంది. ‘ఇది ఎన్నో ఏళ్ల కల.. ఇప్పుడు సాకారమైంది. ప్రస్తుతం నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను..’ అంటూ విజయదరహాసం చేసిందీ స్టార్‌ షట్లర్‌.

నాన్నకు ‘స్వర్ణా’భిషేకం!

కుమార్తెను ప్రపంచ ఛాంపియన్‌ను చేయాలన్న కోరిక ఆ తండ్రిదైతే.. కామన్వెల్త్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో పసిడి నెగ్గి.. దాంతో తన తండ్రికి పట్టాభిషేకం చేయాలన్న దృఢ సంకల్పం ఆ కూతురిది! అనుకున్నట్లుగానే ఆ తండ్రీకూతుళ్ల కల తాజా కామన్వెల్త్‌ గేమ్స్‌ ద్వారా నెరవేరింది. హరియణా బాక్సింగ్‌ క్వీన్‌ నీతూ ఘంఘాస్‌ 48 కిలోల విభాగంలో పోటీ పడి పసిడి పతకాన్ని ఒడిసిపట్టింది. తండ్రి జై భగ్‌వాన్‌ శిక్షణలో ఈ క్రీడలో ఓనమాలు నేర్చుకున్న ఆమె.. ‘గబ్బర్‌ షేర్నీ ఆఫ్‌ ది రింగ్‌ (బాక్సింగ్‌ రింగ్‌లో పులిలా విరుచుకుపడుతుందని)’గా పేరు గడించింది. గతంలో రెండుసార్లు ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌ నెగ్గిన ఆమె.. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లోనే విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. అయితే అప్పుడు జ్వరం కారణంగా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేక పోరాడి ఓడింది నీతూ.

‘మెడల్‌ టేబుల్‌పై నిల్చొని విజయదరహాసం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని చూడడం గొప్ప అనుభూతి. కామన్వెల్త్‌లో బంగారు పతకం.. నా చిరకాల కోరికల్లో ఇదొకటి. నేడు ఇది నెరవేరింది. ఈ పతకం భారతీయులకు, మా నాన్నకు, నా కోచ్‌లకు అంకితం చేస్తున్నా. నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో కష్టాలకోర్చారు.. అన్నివేళలా నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన లేకపోతే నేను ఇక్కడ లేను..’ అంటూ ఎమోషనల్‌ అయిందీ యువ బాక్సర్‌.

ఇదే బాక్సింగ్‌ క్రీడలో 50 కిలోల విభాగంలో హైదరాబాదీ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పసిడి పతకం గెలిచిన విషయం తెలిసిందే! ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొన్న తొలిసారే నిఖత్‌ బంగారు పతకం సాధించడం విశేషం.

శెభాష్‌.. వినేశ్‌!

‘సమయం మనది కానప్పుడు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు.. అదే మనదైన రోజున ఎంత కఠినమైన ప్రత్యర్థినైనా ఓడించగలుగుతాం..’ ఈ మాటల్ని తాజా కామన్వెల్త్‌ గేమ్స్‌ ద్వారా నిరూపించింది హరియణా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌. ఈ క్రీడల్లో 53 కిలోల ఫ్రీస్టైల్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గిన ఆమెకు.. ఈ క్రీడల్లో ఇది మూడో పసిడి కావడం విశేషం. ఇక గతేడాది ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ రెజ్లర్‌.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఆమె సమస్యేంటో తెలుసుకోకుండా అందరూ విమర్శించడం మొదలుపెట్టారు. కానీ తాజా గెలుపుతో ఆ విమర్శలకు సున్నితంగా చెక్‌ పెట్టిందీ మల్లయోధురాలు.

‘ఈ పతకం గెలవడానికి నేనెలా సన్నద్ధమయ్యానో నాకు మాత్రమే తెలుసు.. గతేడాది కాలంగా ఎన్నో సవాళ్లను అధిగమించి సాధించిన ఈ విజయం నాకెంతో ప్రత్యేకమైంది..’ అంటూ ముచ్చటగా మూడోసారి బంగారు పతకాన్ని ముద్దాడుతూ ఎమోషనల్‌ అయిందీ రెజ్లింగ్‌ క్వీన్‌.

పతకాల పంట పండించారు!

* సీనియర్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌ 62 కిలోల ఫ్రీస్టైల్‌ ఈవెంట్‌లో పాల్గొని బంగారు పతకం సాధించింది. 2014, 2018 టోర్నీల్లో 58 కిలోల విభాగంలో పోటీ పడిన ఆమె వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ‘ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది..’ అంటూ పోడియం పైనే ఒకింత భావోద్వేగానికి లోనైందామె.

*మణిపూర్‌ వెయిట్‌లిఫ్టర్‌ వింద్యారాణి దేవి 55 కిలోల విభాగంలో పోటీ పడి రజత పతకం సాధించింది. గతేడాది ‘ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో పసిడి నెగ్గిన ఆమె.. 2019, 2021 ‘కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో వరుసగా బంగారు, వెండి పతకాలు సొంతం చేసుకుంది.

*ఎప్పటిలాగే మీరాబాయి చాను ఈ క్రీడల్లోనూ సత్తా చాటింది. 49 కిలోల విభాగంలో పోటీ పడి స్వర్ణ పతకం సాధించిందీ వెయిట్‌లిఫ్టర్‌.

*పారా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవీనా పటేల్‌ బంగారు పతకంతో మురిసింది. తద్వారా ఈ క్రీడలో స్వర్ణం నెగ్గిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించింది.

‘గ్రూప్‌’లో అమ్మాయిల హవా!

* వ్యక్తిగత విభాగాల్లోనే కాదు.. గ్రూప్‌ విభాగాల్లోనూ మన అమ్మాయిలు సత్తా చాటారు. ఈసారి కామన్వెల్త్‌లోకి తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత మహిళల బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన ఈ జట్టు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా.. విజయం ఆసీస్‌నే వరించింది. దీంతో టీమిండియాకు రజత పతకం దక్కింది.

*16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది భారత మహిళల హాకీ బృందం. న్యూజిలాండ్‌ని ఓడించి కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఆఖరి 30 సెకన్లలో షూటౌట్‌ చేసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకొని చరిత్ర సృష్టించారు మన అమ్మాయిలు.

* లాన్‌ బౌల్స్‌ అనే ఆట ఒకటుందని బహుశా చాలామందికి ఈ కామన్వెల్త్‌ క్రీడల ద్వారానే తెలిసుంటుంది. ఎందుకంటే ఈ క్రీడలో నలుగురు అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేసి బంగారు పతకాన్ని ముద్దాడారు కాబట్టి! వాళ్లే లవ్లీ ఛౌబే, రూపా రాణి తిర్కే, పింకీ, నయన్మోని సైకియా. వేర్వేరు వృత్తుల్లో స్థిరపడిన వీరు.. ఆటపై మక్కువతో కలిశారు.. 92 ఏళ్ల కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్