China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!

ఎల్లో సముద్రంలో ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో చైనా జలాంతర్గామి చిక్కి విలవిల్లాడింది. ఈ ఘటనలో 55 మంది చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు రహస్య నివేదికలు రూపొందించినట్లు డైలీ మెయిల్‌ పత్రిక పేర్కొంది.

Updated : 04 Oct 2023 14:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో భారీగా అణు ప్రమాదం చోటు చేసుకొంది. చైనాకు చెందిన ఓ అణు సబ్‌మెరైన్‌ ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో చిక్కుకుపోయింది. ఫలితంగా డజన్ల సంఖ్యలో సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయాన్ని బ్రిటీష్‌ మీడియా సవివరంగా కథనాలు ప్రచురించింది. చైనా నోరు మెదపకపోవడంతో అణులీకులు ఏమైనా జరిగాయా? అనే విషయం వెల్లడి కావడంలేదు.

చైనాకు చెందిన అణుశక్తి సబ్‌మెరైన్‌ ‘093-417’ ఆగస్టు 21న ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 55 మంది సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. చైనా ఇప్పటి వరకు నోరు మెదపలేదు. తాజాగా బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్‌’ బాంబులాంటి కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్‌, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. కానీ, తాజాగా బ్రిటన్‌ సబ్‌మెరైనర్లు కూడా ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు.

ఆరుగంటలపాటు గాలి అందక..!

చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎల్లో సముద్రంలో ఆగస్టు 21వ తేదీ ఉదయం 8.21 సమయంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీకి చెందిన అణుశక్తి సబ్‌మెరైన్‌ ‘093-417’ యాంకర్‌ చైన్‌ సముద్రంలో చిక్కుకుపోయింది. ఈ అత్యాధునిక సబ్‌మెరైన్‌ దాదాపు 350 అడుగులకు పైగా పొడవు ఉంటుంది. దీంతో ఆ జలాంతర్గామిలో బ్యాటరీల శక్తి అయిపోయింది. ఫలితంగా అందులో ఉన్న ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, ఎయిర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చని బ్రిటన్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చారు. కానీ, అదికూడా విఫలం కావడంతో గాలి కలుషితమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడింది. దీనికి మరమ్మతులు చేయడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టినట్లు బ్రిటన్‌ నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో 55 మంది ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. మృతుల్లో 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్‌ క్యాడెట్లు, తొమ్మిది మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది నావికులు ఉన్నారు. మృతుల్లో సబ్‌మెరైన్‌ కెప్టెన్‌ కర్నల్‌ షూ యోంగ్‌ పెంగ్‌ ఉన్నారు.

పశ్చిమ దేశాల నౌకల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకొని..

ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరం ఉంది. ఇక్కడకి అమెరికా, బ్రిటన్‌ల జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో డ్రాగన్‌ ఏర్పాటు చేసిన ‘చైన్‌, యాంకర్‌ ఉచ్చు’లో దాని సబ్‌మెరైనే చిక్కినట్లు డైలీ మెయిల్‌ కథనంలో పేర్కొంది. బీజింగ్‌ నౌకాదళం ఇలాంటి ఉచ్చులను వినియోగిస్తూ ఉంటుంది. ఈ ప్రమాదంపై స్పందించేందుకు బ్రిటన్‌కు చెందిన రాయల్‌ నేవీ తిరస్కరించింది. మరోవైపు ఈ ఘటన జరిగిందని నమ్మేందుకు బలమైన కారణాలున్నాయని ఓ బ్రిటన్‌ సబ్‌మెరైనర్‌ వివరించారు. చైనా సబ్‌మెరైన్లలో విపత్కర పరిస్థితుల్లో కార్బన్‌డై ఆక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే కిట్లు లేకపోవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు.

ఆగస్టులో తోసిపుచ్చిన చైనా..

ఈ ఘటన జరిగిన వెంటనే పశ్చిమ దేశాలకు చెందిన పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో చైనా, తైవాన్‌ అధికారులు ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని తోసిపుచ్చారు. అమెరికాకు చెందిన నౌకాదళ నిపుణుడు హెచ్‌ఐ సట్టన్‌ ఆగస్టు 22న చైనా నౌకాదళంలో అణుశక్తి సబ్‌మెరైన్‌ ప్రమాదానికి గురైనట్లు అనుమానం వ్యక్తం చేశాడు. చైనా నౌకాదళంలో శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ప్రమాదం జరిగిన సబ్‌మెరైన్‌ నుంచి ఎన్‌క్రిప్టెడ్‌ ఆటోమేటిక్‌ సిగ్నల్స్‌ కూడా పొరుగు దేశాలకు అందినట్లు తెలుస్తోంది.

అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన

అదే సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం నుంచి హఠాత్తుగా వైదొలిగారు. ఈ క్రమంలో చైనా వాణిజ్య మంత్రి వాంగ్‌ వాక్వింగ్‌ అధ్యక్షుడి ప్రసంగ పాఠాన్ని సదస్సుకు చదివి వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సబ్‌మెరైన్‌ ప్రమాద వివరాలు తెలియడంతోనే జిన్‌పింగ్‌ ప్రసంగం నుంచి వైదొలిగినట్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని