France: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం వేళ.. ఫ్రాన్స్‌ స్కూల్‌లో ‘ఉగ్ర’ దాడి..?

ఫ్రాన్స్‌ (France)లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్న వేళ.. అక్కడి ఓ స్కూల్‌లో దాడి జరిగింది. దీన్ని ఉగ్ర ఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Published : 13 Oct 2023 17:47 IST

పారిస్‌: హమాస్‌ (Hamas) ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని గాజాలో ఇజ్రాయెల్‌ (Israel) బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడులను వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు మద్దతుగా పలు దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఇతర దేశాల్లో యూదులపై దాడులు జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ (France)లోని ఓ స్కూల్‌లో దుండగుడు కత్తితో దాడి (Knife Attack) చేయడం కలకలం రేపింది. ఉగ్ర ఘటన అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉత్తర ఫ్రాన్స్‌లోని ఆరాస్‌ నగరంలోని ఓ స్కూల్‌లో శుక్రవారం ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. పాఠశాలలోకి చొరబడి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ టీచర్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దుండగుడిని అరెస్టు చేశారు.

హమాస్‌కు ‘ఆపరేషన్‌ థండర్‌బోల్ట్‌’ భయం..!

నిందితుడు ఆ స్కూల్లో చదివిన పాత విద్యార్థి అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి దాడిలో ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ బోధించే టీచర్‌ మృతిచెందగా.. మరో ఇద్దరు ఉపాధ్యాయులు గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి సోదరుడిని కూడా అరెస్టు చేశారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉగ్ర కుట్రలో భాగంగానే దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగానే ఈ దాడి జరిగిందా? అనేదానిపై స్పష్టత లేదు.

ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు జరిగాయి. దీంతో అప్రమత్తమైన మేక్రాన్‌ సర్కారు.. ఈ ర్యాలీలపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు నిరసనకారులు గురువారం ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. కాగా.. గతవారం ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మారణహోమంలో 13 మంది ఫ్రెంచ్‌ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన నాటి నుంచి మరో 17 మంది ఫ్రాన్స్‌ పౌరుల ఆచూకీ గల్లంతైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని