నలుగురు కన్నబిడ్డల మృతి కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలిన తల్లి

Australia: కన్నబిడ్డలు మృతి చెందిన కేసులో దోషిగా తేలి, 20 ఏళ్లు శిక్ష అనుభవించిన ఓ తల్లి.. తాజాగా నిర్దోషిగా బయటపడింది. 

Updated : 14 Dec 2023 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నలుగురు కన్నబిడ్డలు మృతిచెందిన కేసులో ఓ తల్లి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. వారిని ఆమే చంపేసిందంటూ వచ్చిన ఆరోపణలను భరించింది. వరస్ట్ సీరియల్ కిల్లర్ అనే నిందను మోసింది. ఇన్నేళ్ల అవమానాల తర్వాత గురువారం ఆమెపై మోపిన అభియోగాలను కొట్టివేశారు.

కాథ్లీన్‌ ఫాల్బిగ్‌.. నలుగురు పిల్లలు 1989 నుంచి 1999 మధ్య కాలంలో అనూహ్యంగా మృతి చెందారు. మొదటి ముగ్గురు పిల్లలు ఏడాదిలోపు చనిపోవడంతో.. సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్‌(SIDS)అని భావించారు. ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండా ఏడాదిలోపు చిన్నారులు మరణిస్తే ఈ పదాన్ని వాడతారు. అయితే ఆమె నాలుగో చిన్నారి పుట్టిన 18 నెలల తర్వాత మరణించింది. నాలుగో బిడ్డ మరణానికి ఎలాంటి కారణం లేదని అప్పుడు వైద్యులు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ ఆధారాలు స్పష్టంగా లేనప్పటికీ.. ఆ పసిబిడ్డలకు శ్వాస ఆడకుండా చేసి చంపేసిందని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి.  వార్తా పత్రికలు ఆమెను ఆస్ట్రేలియాలో వరస్ట్ ఫిమేల్‌ సీరియల్ కిల్లర్(Australia's worst female serial killer) అని అభివర్ణించాయి. తన పిల్లలది సహజ మరణమని ఆమె మొత్తుకున్నా ఎవరూ వినలేదు. ఆ తర్వాత 2003లో కోర్టు కాథ్లీన్‌ను దోషిగా తేల్చడంతో 20 ఏళ్లు జైలు గోడలే ఆమె జీవితమయ్యాయి.  

అంతటితో ఆమె ఆగలేదు. తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకునేందుకు పోరాటం సాగించింది. ఆ పిల్లలంతా సహజ కారణాలతో మృతి చెందారని తేలడంతో ఈ జూన్‌ నెలలో క్షమాభిక్ష పొందారు. శాస్త్రీయంగా సాధించిన పురోగతి ఆమె నిర్దోషిగా తేలడానికి ఉపకరించింది. ఆధునిక సాంకేతికత.. అరుదైన జన్యు పరివర్తనలు, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కలిగే ఆకస్మిక మరణాలను గురించి అర్థం చేసుకునేందుకు దోహదం చేసింది. ‘నా పిల్లల మృతికి గల ప్రశ్నలపై నాకు సమాధానాలు ఇచ్చిన సరికొత్త సాంకేతికతకు నేను రుణపడి ఉంటాను’ అని ఆమె ఉద్వేగభరితురాలయ్యారు. ‘1999లో కూడా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను ఇంతకాలం అక్రమంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చినందుకు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని