AI Chest X-Ray: ఏఐ చెస్ట్‌ ఎక్స్‌రేతో వయసు తెలుసుకోవచ్చు!

జపాన్‌లోని ఒసాకా మెట్రోపాలిటన్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఏఐ ఆధారిత ఛాతీ ఎక్స్‌రే (AI Chest X-Ray) ద్వారా మనిషి వయసు తెలుసుకునే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. 

Updated : 18 Aug 2023 16:14 IST

దిల్లీ: కృత్రిమ మేధ (AI) కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటిదాకా గ్యాడ్జెట్స్‌, యాప్‌లకే పరిమితమైన ఏఐ సేవలు.. మెల్లగా ఆరోగ్యరంగానికి విస్తరిస్తున్నాయి. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ల సాయంతో.. ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే వారికి సేవలను అందిస్తున్నాయి. తాజాగా ఏఐ ఆధారిత ఛాతీ ఎక్స్‌రే (AI Chest X-Ray) ద్వారా మనిషి వయసు తెలుసుకునే కొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ ఎక్స్‌రే సాయంతో దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చని జపాన్‌లోని ఒసాకా మెట్రోపాలిటన్‌ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులతోపాటు వయసురీత్యా వచ్చే వ్యాధులకు సంబంధించి జరుగుతున్న పరిశోధనలకు ఇది తోడ్పాటు అందిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైద్యరంగంలో వయసు పెరుగుదల కీలకమైన అంశం. మేం అభివృద్ధి చేసిన ఛాతీ రేడియోగ్రఫీ (ఎక్స్‌రే).. మనిషి వయసుతోపాటు, వృద్ధాప్యంలో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో నిరూపితమైంది’’ అని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన యసుహితో మిత్సుయమా తెలిపారు. ఈయన ఒసాకా మెట్రోపాలిటన్‌ యూనివర్శిటీ డయాగ్నస్టిక్స్‌ అండ్ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. 

కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి.. అప్రమత్తమైన WHO, సీడీసీ!

మనిషి వయసును అంచనా వేసేందుకు 2008 నుంచి 2021 మధ్య ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న 34 వేల మందికి సంబంధించిన 67 వేల ఛాతీ ఎక్స్‌రేలతో కొత్త ఏఐ మోడల్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు యసుహితో తెలిపారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కచ్చితత్వంతో ఫలితాలను వెల్లడించిందన్నారు. అలా, మొత్తంగా జపాన్‌లోని ఐదు సంస్థల్లో 70 వేల మందికి సంబంధించిన లక్షకు పైగా ఎక్స్‌రేలపై శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఏఐ ద్వారా తీసిన ఛాతీ ఎక్స్‌రే కేవలం వయస్సు, దీర్ఘ కాలిక వ్యాధులను గుర్తించేందుకు మాత్రమే కాకుండా శరీరంలోని ఎముకలు, ఇతర అవయవాల గురించి తెలుసుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో శస్త్రచికిత్సల్లో కూడా దీన్ని ఉపయోగించేలా మార్పులు చేస్తామని యసుహితో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని