Akshata Murty: రిషి సునాక్‌ భార్య అక్షతామూర్తికి అరుదైన గుర్తింపు

బ్రిటన్‌లో అత్యుత్తమ దుస్తులు ధరించిన వ్యక్తుల జాబితాలో అక్షతామూర్తి ప్రథమ స్థానం సాధించారు. ఈ మేరకు టాట్లర్‌ మేగజైన్‌ వెల్లడించింది.

Updated : 29 Jul 2023 17:43 IST

లండన్: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భార్య అక్షతామూర్తికి అరుదైన గుర్తింపు దక్కింది. 2023 సంవత్సరానికిగానూ బ్రిటన్‌లో అత్యుత్తమ దుస్తులు ధరించిన వ్యక్తుల జాబితాలో ఆమె ప్రథమ స్థానం సాధించారు. ఈ మేరకు టాట్లర్‌ మేగజైన్‌ వెల్లడించింది. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అక్షతామూర్తి.. ఫ్యాషన్‌ డిజైనర్‌ కూడా. అందుకే ఆమె సరికొత్తగా, హుందాతనంతో కూడిన దుస్తులు ఎంపిక చేసుకుంటారు. తాజాగా టాట్లర్‌ మేగజైన్‌ విడుదల చేసిన జాబితాలో ‘లవ్‌ యాక్చువల్లీ’ స్టార్‌  బిల్‌ నై, ప్రిన్సెస్‌ బీట్రైస్‌ భర్త ఎడ్వర్డ్‌ మపెల్లి మోజీ తదితర మోడల్స్‌ని వెనక్కినెట్టి అక్షతామూర్తి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు.

‘‘బ్రిటన్‌లో అత్యుత్తమ దుస్తులు ధరించిన వారి జాబితాలో అక్షతామూర్తి తొలిస్థానంలో నిలిచారు. చాలా మంది మోడల్స్‌ని, ప్రముఖులను వెనక్కి నెట్టి ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు’’ అని టాట్లర్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది. పాతకాలం నాటి పిల్‌బాక్స్‌ టోపీలు, వివిధ వరుసల్లో ముత్యాలు లేనప్పటికీ.. అక్షతామూర్తి వస్త్రధారణ ఆధునిక సమాజానికి ఓ ఉదాహరణ అని టాట్లర్‌ మేగజైన్‌ సంపాదకుడు క్యాండ్లర్‌ తెలిపారు. ఈ జాబితాలో కెనడాకి చెందిన యనాపీల్‌,  డొమినిక్‌ సెబేగ్‌ మాంటేఫియోర్‌, ఒపేరా గాయని డేనియల్లా డి నీసే తదితరులు కూడా ఉన్నారు.

ఉత్తర కొరియా రాకెట్లతో రష్యాపై ఎదురుదాడులు..!

 అక్షతామూర్తి అప్పుడప్పుడూ విలాసవంతమైన దుస్తుల్లోనూ కనిపిస్తుంటారు. పాఠశాలలో నిర్వహించే ఓ రన్‌ కోసం దాదాపు రూ.60,218 (570 పౌండ్లు) విలువైన చెప్పుల్ని వేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.47,012 విలువ చేసే బూట్లు, రూ.1,05,670 విలువ చేసే స్కర్ట్‌తో దిగిన ఫొటోలు కొన్నాళ్ల క్రితం వైరల్‌ అయ్యాయి. మరోవైపు గతేడాది జులైలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రుషి సునాక్‌ 3,500 పౌండ్లు (దాదాపు రూ.3,69,848) విలువైన సూట్‌, 490 పౌండ్లు (దాదాపు రూ.51,778) విలువైన పాడ్రాలు ధరించడంపై అప్పట్లో విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భార్యభర్తలు ఇద్దరూ వస్త్రధారణ విషయంలో విమర్శలు ఎదురుకాకుండా జాగ్రత్తపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని