Russia: ‘అది అదృశ్య హస్తం కాదు.. అమెరికానే!’

ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నడిపిస్తోంది అదృశ్య హస్తం కాదని, అమెరికానేనని రష్యా ఆరోపించింది. యుద్ధం ముగియాలని వాషింగ్టన్‌ కోరుకోవడం లేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ వ్యాఖ్యానించారు.

Published : 07 Mar 2023 18:20 IST

మాస్కో: ఉక్రెయిన్‌ సంక్షోభం(Ukraine Crisis) మొదలై ఏడాది దాటింది. కానీ, ఇప్పటికీ.. యుద్ధం ముగింపు దిశగా సంకేతాలు కనిపించడం లేదు! ఈ క్రమంలోనే.. ఓ అదృశ్య హస్తం ఈ వివాదాన్ని నడిపిస్తోందని చైనా(China) ఆరోపించింది. అయితే, అది అదృశ్య హస్తం కాదని, అమెరికా హస్తమని రష్యా(Russia) తాజాగా పేర్కొంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి చమత్కారంగా చెప్పినట్లు క్రెమ్లిన్‌(Kremlin) అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌(Dimitry Peskov) తెలిపారు. ‘అదృశ్య హస్తం వ్యాఖ్యల విషయంలో చైనాతో విభేదించవచ్చు. వాస్తవానికి ఇదొక చమత్కారం! ఇది అదృశ్య హస్తం కాదు. ఇది అమెరికా(America) హస్తం’ అని పెస్కొవ్‌ మీడియాతో అన్నారు.

ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ముగియాలని అమెరికా కోరుకోవడం లేదని పెస్కొవ్‌ అన్నారు. ‘ఈ సంఘర్షణ నిత్యం కొనసాగేందుకుగానూ అవసరమైన ప్రతిదీ ఆ దేశం చేస్తోంది. ఇది కనిపించే హస్తమే’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. అమెరికా, దాని మిత్రదేశాలు తమపై యుద్ధం చేయడానికి ఉక్రెయిన్‌ను పావుగా ఉపయోగించుకుంటున్నట్లు మాస్కో ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్‌తోపాటు పశ్చిమ దేశాలు వాటిని కొట్టిపారేశాయి. రష్యా ఆక్రమణలకు వ్యతిరేకంగా కీవ్‌ పోరాడుతోందని తెలిపాయి.

చైనా ప్రతిపాదిస్తోన్న ‘కాల్పుల విరమణ’ అంశాన్ని పెస్కొవ్‌ ప్రస్తావిస్తూ.. ఈ విషయమై బీజింగ్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోన్నట్లు వెల్లడించారు. చైనా వంటి శక్తిమంతమైన దేశం.. ప్రపంచ సమస్యలపై తన గొంతుక వినిపించడం సహజమేనని అన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ సంక్షోభంపై చైనా విదేశాంగ మంత్రి కిన్ గ్యాంగ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ వివాదం మరింత కాలం కొనసాగేలా, అది తీవ్రంగా మారేలా ఒక అదృశ్య హస్తం నడిపిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని