సహాయక చర్యల్లో మర ఎలుక సాయం!

భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో బాధితుల కోసం అన్వేషించడంలో దోహదపడగల సరికొత్త రోబోటిక్‌ ఎలుకలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి...

Updated : 02 May 2022 11:19 IST

బీజింగ్‌: భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో బాధితుల కోసం అన్వేషించడంలో దోహదపడగల సరికొత్త రోబోటిక్‌ ఎలుకలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాలోని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్‌ ఖింగ్‌ షి నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ దిశగా కృషిచేస్తోంది. సాధారణంగా ఎలుకలు సన్నని మార్గాల్లోనూ దూసుకెళ్తుంటాయి. వాటి శరీర నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది. అందుకే వాటి తరహాలో ‘బుల్లి చతుష్పాద మర ఎలుక (స్క్యూరో)’ నమూనాను పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. సన్నని సొరంగ మార్గాల్లో, ఎత్తుపల్లాలున్న ప్రదేశాల్లోనూ అది సులువుగా ప్రయాణించగలుగుతోంది. కిందపడిపోయినప్పటికీ తిరిగి తనకు తాను పైకి లేవగల సామర్థ్యం దానికి ఉంది. నిజమైన ఎలుక తరహాలో ఎటువైపైనా చురుగ్గా తిరగగలుగుతోంది. స్క్యూరో బరువు 220 గ్రాములు. 200 గ్రాముల భారాన్ని మోయగలదు. తొలుత దానికి చక్రాలను బిగించామని, కదలికలను మరింత మెరుగుపర్చేందుకుగాను తర్వాత వాటి స్థానంలో కాళ్లను ఏర్పాటుచేశామని పరిశోధకులు తెలిపారు. సహాయక చర్యల సమయంలో అధికారులు ప్రవేశించలేని ప్రదేశాల్లో బాధితుల కోసం అన్వేషణ కొనసాగించేలా ఈ మర ఎలుకలను తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని