Kate Middleton: కేట్‌ మిడిల్టన్‌పై పోస్టు.. వెంటనే తొలగించిన ఆర్మీ

ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ కేట్‌ మిడిల్టన్‌(Kate Middleton) గురించి బ్రిటిష్‌ ఆర్మీ చేసిన పోస్టు ప్రజల్లో గందరగోళానికి కారణమైంది. 

Published : 06 Mar 2024 10:49 IST

లండన్‌: బ్రిటన్ యువరాజు సతీమణి కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) ఆరోగ్యం గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బ్రిటన్ ఆర్మీ తొలగించిన పోస్టు గందరగోళానికి దారితీసింది. ఆమె జూన్ నెలలో ‘ట్రూపింగ్‌ ది కలర్‌’ పేరిట జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారని ఆర్మీ వెల్లడించింది. కానీ రాజకుటుంబం ధ్రువీకరించకపోవడం చర్చనీయాంశమైంది.

ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్న కేట్‌.. అప్పటి నుంచి బయట కనిపించడం లేదు. అయితే కొద్దిగంటల క్రితం ఆమె కారులో ఉన్న చిత్రం బయటకు వచ్చింది. ఆ తర్వాత ట్రూపింగ్‌ ది కలర్‌ కార్యక్రమం నిమిత్తం జూన్‌ 8న ఆమె బలగాలను సమీక్షిస్తారని ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రకటనకు ముందు రాజకుటుంబం అనుమతి తీసుకోలేదు. అలాగే జూన్‌ 15న ఫైనల్‌ పరేడ్‌లో కింగ్ ఛార్లెస్‌ 3 కూడా బలగాలను సమీక్షిస్తారని తెలిపింది. దీనికి కూడా రాజ కుటుంబం నుంచి ధ్రువీకరణ లేదు. అయితే కేట్‌ గురించి చేసిన పోస్టును మాత్రమే ఆర్మీ వెనక్కి తీసుకుంది.

కేట్‌ మిడిల్టన్‌కు సర్జరీ అయిన విషయాన్ని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరి 17న వెల్లడించింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది. అయితే అప్పటినుంచి యువరాణి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం అనేక వదంతులకు దారితీసింది. సర్జరీ సమయంలో యువరాణికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమె కోలుకోవడానికి తొమ్మిది నెలల సమయం పట్టొచ్చని బ్రిటన్ మీడియా చెప్తోంది. మరోపక్క, బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3 (King Charles-III )కి క్యాన్సర్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. బ్రిటన్ రాజు/రాణి అధికారిక జన్మదినాన్ని జూన్‌లో నిర్వహిస్తుంటారు. దానికి గుర్తుగానే  ‘ట్రూపింగ్‌ ది కలర్’ వేడుక చేస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని