అనారోగ్యంతో ఆస్పత్రికి.. చూస్తే పొట్టనిండా వెంట్రుకలే!

ఆహారం తీసుకోలేని స్థితిలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలికను పరిశీలించిన వైద్యులు నిర్ఘాంతపోయారు. పొట్టనిండా వెంట్రకలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.

Published : 29 Nov 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆహారం తీసుకోలేని స్థితిలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది ఓ బాలిక. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నిర్ఘాంతపోయారు. పొట్టనిండా వెంట్రకలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. శస్త్ర చికిత్స అనంతరం పొట్ట నుంచి 3 కేజీల బరువైన వెంట్రుకలతో కూడిన బంతిని బయటకు తీశారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. షాన్‌క్సీ ప్రావిన్స్‌కు చెందిన ఓ బాలిక పికా అనే రుగ్మతతో బాధపడుతోంది. ఈ రుగ్మత ఉన్న వారు మట్టి, పేపర్లు వంటివి తింటుంటారు. ఈ బాలిక మాత్రం తన తలపై వెంట్రుకలను తానే తినడం అలవాటుగా మార్చుకుంది. పొట్టలో తినడానికి మరేమాత్రం చోటు లేనంతలా ఆమె తన వెంట్రుకలను తానే ఆరగించింది.

ఆస్పత్రిలో చేరే సమయానికి  బోడి గుండుతో ఉన్న ఆ బాలికను పరీక్షించిన వైద్యులు.. పొట్ట నిండా వెంట్రుకలు ఉండడాన్ని గుర్తించారు. సుమారు రెండున్నర గంటల పాటు శస్త్ర చికిత్సచేసి ఆమె పొట్టలోంచి వెంట్రుకలను వెలికితీశారు. బాలిక తల్లిదండ్రులు దూరంగా ఉండడంతో తాతయ్య, నానమ్మ దగ్గరే పెరుగుతోంది. పరిస్థితి విషమించేవరకు వారూ ఈ విషయాన్ని గుర్తించలేదని వైద్యులు తెలిపారు. కొన్నేళ్లుగా ఆ చిన్నారి ఈ రుగ్మతతో బాధపడుతోందని చెప్పారు. సాధారణంగా జుట్టు ఆరగించే అలవాటు ఉన్న వారు ప్రాణాలు సైతం కోల్పోయిన సందర్భాలున్నాయి. 2017లో ఓ బాలుడు జుట్టు కారణంగా పొట్టలో ఇన్‌ఫెక్షన్‌తో మరణించాడు. కాబట్టి ఇలాంటి రుగ్మతలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులే దగ్గరుండి చూసుకోవాలని బాలికకు ఆపరేషన్‌ చేసిన వైద్యుడు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు