Congo Virus: ఫ్రాన్స్‌లో కాంగో వైరస్‌ కలవరం.. బ్రిటన్‌ అప్రమత్తం

ప్రాణాంతక కాంగో వైరస్‌ ఫ్రాన్స్‌కు విస్తరించింది. స్పెయిన్‌ సరిహద్దులో తొలి కేసు గుర్తించినట్లు ఫ్రాన్స్‌ వైద్య వర్గాలు వెల్లడించాయి.

Published : 28 Oct 2023 19:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాక్‌ను వణికించిన ప్రాణాంతక కాంగో ఫీవర్‌ వైరస్‌ (Crimean-Congo haemorrhagic fever) ఫ్రాన్స్‌కు వ్యాపించింది. స్పెయిన్‌ (Spain) సరిహద్దులో తొలి కేసు నమోదైనట్లు అక్కడి వైద్య వర్గాలు వెల్లడించాయి. నైరో వైరస్‌ అని పిలిచే క్రిమియన్‌-కాంగో హెమోరోజిక్‌ ఫీవర్‌ అనే వైరస్‌ ఎబోలా జాతికి చెందింది. ఈ వైరస్‌ సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పశ్చిమ యూరప్‌, స్పెయిన్‌లోనూ గుర్తించారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా జంతువుల్లో కనిపించే రక్తం పీల్చే పేలు (Tick Bite) ద్వారా విస్తరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తొమ్మిది ప్రాధాన్యతా వ్యాధుల్లో సీసీహెచ్‌ఎఫ్‌ కూడా ఉండటం గమనార్హం.

రక్తం పీల్చే పేలే వాహకాలు

నైరోవైరస్‌ అనేది పేలు (Tick Bite) ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో వైరస్‌ వాహకంగా ఈ పేలు పని చేస్తాయి. అలా వైరస్‌ బారినపడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు లేదా వైరస్‌ ఉన్న పేలు కుట్టినప్పుడు లేదా పశువధ కేంద్రాల్లోని స్త్రావాల ద్వారా మానవులకు సోకుతుంది. వైరస్‌ సోకిన వ్యక్తుల రక్తం, మలం, చెమట కణాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులకు శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వ్యాధి మరణాల రేటు 10 నుంచి 40 శాతం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌లు లేవు. వేగంగా వ్యాపించే ఈ వైరస్‌ వల్ల మానవ శరీరంలో అంతర్గతంగా, బాహ్య అవయవాల నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదులో రెండో వంతు కేసుల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

బ్రిటన్‌ అప్రమత్తం

ఫ్రాన్స్‌లో కాంగో వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో పొరుగు దేశం బ్రిటన్‌ అప్రమత్తమైంది. ఫ్రాన్స్‌లో వైరస్‌ సోకే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని బ్రిటన్‌ పర్యాటకులను కోరింది. పేలు ద్వారా ఈ వైరస్‌ సంక్రమించే అవకాశం ఉన్నందున అవి కుట్టకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఫ్రాన్స్‌కు పొరుగున ఉన్న స్పెయిన్‌లో 2013 నుంచి ఆగస్టు 2022 మధ్య కాలంలో 12 కేసులు నమోదుకాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇరాక్‌లో ఈ వ్యాధి బారిన పడి గత ఏడాది 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఇరాక్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి పశువులపై క్రిమిసంహారకాలు పిచికారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని