Google: భార్యభర్తలిద్దరికీ ఒకేసారి లేఆఫ్‌..!

పలు సంస్థలు ఉద్యోగాల్లో విధిస్తున్న కోతలు ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయి. దిగ్గజ సంస్థ గూగుల్(Google) ఒకేసారి దంపతులిద్దరినీ తొలగించింది. 

Published : 26 Jan 2023 17:55 IST

వాషింగ్టన్‌: ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఎప్పుడు లేఆఫ్ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ టెక్ సంస్థలన్నీ భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఒక మెయిల్ చేసి, ఉద్యోగం నుంచి తీసేసినట్లు సమాచారం ఇస్తున్నాయి. తాజాగా గూగుల్‌(Google) కూడా ఒకేసారి ఒక జంటను తీసేసింది. ఈ మేరకు ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. 

గూగుల్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఈ జంటకు నాలుగు నెలల చిన్నారి ఉంది. తమ నెలల బిడ్డ కోసం మరికొంత కాలం సెలవులు పెడదామనుకుంటున్న వారికి ఈ ఊహించని షాక్‌ తగిలింది. వారిలో ఒకరు ఆరు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తుండగా, మరొకరు నాలుగేళ్ల క్రితం అక్కడ చేరారు. అయితే వారిద్దరికి సంస్థ నుంచి ఒకేసారి లేఆఫ్ సందేశం వచ్చింది. 

అంతర్జాతీయంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల గూగుల్‌ (Google) వెల్లడించింది. కొవిడ్‌-19 పరిణామాల సమయంలో, అప్పటి అవసరాలకు తగ్గట్లుగా అధిక నియామకాలు చేపట్టామని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. 

ఈ లేఆఫ్స్‌పై  సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) స్పందించారు.  కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో ‘‘స్పష్టమైన, కచ్చితమైన, ముందస్తుగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే సమస్య మరింత పెద్దదై పరిస్థితి చాలా దారుణంగా మారి ఉండేది’’ అని ఆయన అన్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని