Israel-Hamas: హమాస్‌ చెరలోని మరో 13 మంది బందీలకు విముక్తి

Israel-Hamas: కాస్త జాప్యం జరిగినా.. హమాస్‌ ఎట్టకేలకు రెండో విడత బందీలకు విముక్తి కల్పించింది. మరోవైపు ఇజ్రాయెల్‌ సైతం పాలస్తీనా పౌరులను జైలు నుంచి విడుదల చేసింది.

Updated : 26 Nov 2023 10:08 IST

గాజా: ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య రెండో విడత బందీల విడుదల సజావుగా సాగింది. తొలుత హమాస్‌ 13 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్‌లాండ్‌ వాసులను శనివారం- ఆదివారం మధ్యరాత్రి విడుదల చేసింది. వారంతా ఇజ్రాయెల్‌కు చేరుకున్నట్లు ఆ దేశ మిలిటరీ ధ్రువీకరించింది. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి తర్వాత కుటుంబాలకు అప్పజెబుతామని తెలిపింది.

తమ వద్ద ఉన్న బందీలను హమాస్‌ పంపిన కొంత సేపటికే ఇజ్రాయెల్‌ సైతం 39 మంది పాలస్తీనా వాసులను జైలు నుంచి విడుదల చేసింది. వీరంతా జెరూసలెం సహా వెస్ట్‌బ్యాంక్‌లోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లనున్నారు. వీరిని తీసుకొని వెళ్లిన రెడ్‌ క్రాస్‌ ఇంటర్నేషనల్‌ బస్సు ఆదివారం ఉదయానికి వెస్ట్‌బ్యాంక్‌కు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.

హమాస్‌ విడుదల చేసిన బందీల్లో ఏడుగురు చిన్న పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా నాలుగు రోజుల్లో 50 మంది బందీలను హమాస్‌.. 150 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్‌ విడుదల చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయాయి.

తొలి దశలో భాగంగా థాయ్‌లాండ్‌కు చెందిన 10 మందిని, ఓ ఫిలిప్పీన్స్‌ జాతీయుడికి హమాస్‌ స్వేచ్ఛ కల్పించిన విషయం తెలిసిందే. రెండో దశలో కాస్త జాప్యం జరిగింది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యమైందని.. దీంతో బందీల విడుదల అనుకున్న సమయానికి కావడం లేదని హమాస్‌ తెలిపింది. తొలిరోజైన శుక్రవారం 24 మందికి హమాస్‌ విముక్తి కల్పించగా.. ఇజ్రాయెల్‌ 39 మంది పాలస్తీనా పౌరుల్ని విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని