Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌ ఆనందం.. గంటల్లోనే ఆవిరి!

పాక్‌ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు (Imran Khan) తోషఖానా కేసులో పడిన జైలు శిక్షను నిలిపివేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఆ తరువాత కొద్ది గంటల్లోనే ఆయనపై మరో కేసు నమోదైంది.

Published : 29 Aug 2023 17:13 IST

ఇస్లామాబాద్‌ : పాక్‌ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు (Imran Khan) హైకోర్టులో ఊరట లభించిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. తోషఖానా కేసులో పడిన జైలు శిక్షను నిలిపివేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే మరో కేసు ఆయన మెడకు చుట్టుకుంది. తాజాగా ఇమ్రాన్‌ఖాన్‌పై పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద సైఫర్‌ కేసు నమోదు చేశారు. ఇమ్రాన్‌ రహస్యమైన దౌత్య అంశాలను దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు. ప్రధానిగా అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వాడుకున్నారని అందులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ప్రధానిని.. బుధవారం కోర్టు ముందు హాజరు పరచనున్నారు. 

ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. తోషాఖానా కేసులో శిక్ష నిలిపివేత

ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను ‘తోషాఖానా’ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్టైన ఖాన్‌కు ట్రయల్‌ కోర్టు ఆగస్టు 5న మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. ఆ తీర్పు వెలువడిన వెంటనే అరెస్టయిన ఇమ్రాన్‌ను పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలుకు తరలించారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. తమ అధినేత జైలు నుంచి బయటకు రావడం ఖాయమని పాక్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ కార్యకర్తలు భావిస్తున్న తరుణంలో మళ్లీ సైఫర్‌ కేసు ఉచ్చు బిగుసుకోవడం గమనార్హం. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని