Imran Khan: మా పార్టీపై నిషేధం విధిస్తే.. నా ప్లాన్‌ అదే!

ఒకవేళ పాకిస్థాన్‌లో తన పార్టీ ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ (పీటీఐ)ను నిషేధిస్తే.. మరో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Published : 15 Jul 2023 22:00 IST

ఇస్లామాబాద్‌: వందకుపైగా కేసులతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. నిత్యం ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. అటు ప్రభుత్వంపైనా తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఆయన ఆధ్వర్యంలోని ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ (PTI) పార్టీపై నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. ఒకవేళ ఇదే జరిగితే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను మళ్లీ ఒక కొత్త పార్టీని స్థాపించి, విజయం సాధిస్తానని పేర్కొన్నారు.

ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు అనంతరం పాకిస్థాన్‌లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దేశంలోని ఘర్షణలకు ఇమ్రాన్‌ పార్టీ ‘పీటీఐ’నే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. లాహోర్‌లోని ఇమ్రాన్‌ ఇంటి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఇటీవల ప్రకటించారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో.. ‘పీటీఐ’ని నిషేధిత సంస్థగా ప్రకటించే అంశాన్ని శహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లాతోపాటు పలువురు మంత్రులు ఆయా సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

మహాత్మా గాంధీ, మండేలాలే నాకు స్ఫూర్తి : పాక్‌ మాజీ ప్రధాని

ఇదే విషయమై ఇటీవల ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ‘ఒకవేళ తమ పార్టీని తొలగిస్తే.. కొత్త పేరుతో మరో పార్టీని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో పోరాడి గెలుస్తాం. నాపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపించినా.. మా పార్టీ మాత్రం విజయం సాధిస్తుంది’ అని చెప్పారు. పాకిస్థాన్‌ రాజకీయాలు మారిపోయాయని.. తన అనుచరగణం మాత్రం చెక్కుచెదరలేదని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ ఇంటర్వ్యూలో తెలిపారని పాక్‌ వార్తాసంస్థ ‘డాన్‌’ వెల్లడించింది. ఇప్పటికీ బెదిరింపుల ద్వారా తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని