Hafiz Saeed: పాక్‌ ఎన్నికల్లో హఫీజ్‌ సయీద్‌ పార్టీ పోటీ.. భారత్‌ ఏమందంటే..?

Hafiz Saeed: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరగబోయే పాక్‌ ఎన్నికల్లో కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు చెందిన పార్టీ పోటీ చేయడంపై భారత్‌ స్పందించింది. అది భద్రతా పరంగా తీవ్ర పరిణామం అని పేర్కొంది.

Updated : 30 Dec 2023 18:12 IST

దిల్లీ: లష్కరే తోయిబా చీఫ్‌, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ (Hafiz Saeed)కు చెందిన పార్టీ వచ్చే ఏడాది జరగనున్న పాకిస్థాన్‌ (Pakistan) సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) తాజాగా స్పందించింది. ఇది ఆసియా ప్రాంత భద్రతపై పెను ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది.

‘‘పాకిస్థాన్‌లో ఉగ్రవాద శక్తులు అక్కడి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఆ దేశ అంతర్గత వ్యవహారం. అందువల్ల దీనిపై మేం స్పందించాలనుకోవడం లేదు. కానీ, ఇది కొత్తేం కాదు. పాక్‌లో సుదీర్ఘకాలంగా అతివాద శక్తులు.. అక్కడి పాలనా వ్యవహారాల్లో భాగంగా ఉన్నాయి. అయితే, ఇటువంటి పరిణామాలు మన ప్రాంతంలో భద్రతాపరంగా తీవ్రమైన చిక్కులను కలిగించే అవకాశముంది. అందువల్ల, మన దేశ భద్రతపై ప్రభావం చూపించే అంశాలపై మేం నిరంతరం దృష్టిపెడుతూనే ఉంటాం’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

‘హఫీజ్‌ సయీద్‌ అప్పగింత’కు భారత్‌ అభ్యర్థన.. పాక్‌ స్పందన ఇదే..!

‘ది పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌’ (పీఎంఎంఎల్‌) పేరిట హఫీజ్‌ సయీద్‌ ఓ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ వచ్చే ఏడాది పాక్‌లో జరగబోయే నేషనల్‌, ప్రావిన్షియల్‌ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇదే పార్టీ తరఫున హఫీజ్‌ తనయుడు తల్హా సయీద్‌ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు.

ఇక, హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగించేందుకు ఇటీవల న్యూదిల్లీ.. పాకిస్థాన్‌కు అధికారిక అభ్యర్థన చేసిన విషయం తెలిసిందే. దీనిపై పాక్‌ స్పందిస్తూ.. ఖైదీల అప్పగింతకు ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని