British Nurse: ‘అప్పుడే వినుంటే.. ఆ చిన్నారులు బతికేవారేమో’: రాకాసి నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు

ఇంగ్లాండ్‌లోని ఓ ఆసుపత్రిలో నవజాత శిశువులను కంటికి రెప్పలా సంరక్షించాల్సిన నర్సు (Nurse) దారుణానికి పాల్పడింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. భారత సంతతి వైద్యుడు రవి జయరాం ఈ నర్సును పట్టించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Updated : 19 Aug 2023 15:28 IST

లండన్‌: వైద్య వృత్తికి, మానవత్వానికి మచ్చ తెచ్చేలా పసికందుల ఉసురు తీసిన యూకే (UK) నర్సు ఉదంతం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నర్సును పట్టించిన భారత సంతతి వైద్యుడు.. ఈ ఘటన గురించి కీలక విషయాలను వెల్లడించారు. నర్సు గురించి తాను ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే కొంతమంది చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగేవాళ్లమని విచారం వ్యక్తం చేశారు.

ఇంగ్లాండ్‌ (England)లోని చెస్టర్‌లో కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ ఆసుపత్రిలో 2015-16లో ఈ దారుణం చోటుచేసుకుంది. నవజాత శిశువుల వార్డులో పనిచేస్తున్న లూసీ లెబ్టీ(33) ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు తేలడంతో ఆమెను దోషిగా నిర్ధారించారు.  భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం (Indian-origin Doctor Ravi Jayaram) పిల్లల వైద్యుడిగా సేవలందిస్తున్నారు.

ఆ నర్సు.. ఏడుగురు పసికందులను చంపిన ఓ నరరూప రాక్షసి

కోర్టు తీర్పు అనంతరం రవి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2015 జూన్‌లో ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరోజు రాత్రి నేను నవజాత శిశువుల వార్డు ముందు నుంచి వెళ్తుండగా లూసీ ఇంక్యుబేటర్‌ పక్కన నిల్చుని కన్పించింది. ఎందుకో అక్కడి పరిస్థితులు సాధారణంగా లేవని నాకు అనిపించింది. అప్పుడే మాకు లూసీపై తొలిసారి అనుమానం వచ్చింది. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్స్‌కు ఆమె గురించి చెప్పాం. అయితే, వారు మమ్మల్ని నమ్మలేదు సరికదా.. సహోద్యోగిపై అనవసర ఆరోపణలు చేయొద్దని అన్నారు. అంతేగాక, లూసీకి క్షమాపణ చెప్పాలని మాకు సూచించారు. ఉన్నతాధికారుల బలవంతంలో మేం ఆమెకు క్షమాపణ చెబుతూ నోట్‌ రాయాల్సి వచ్చింది. అప్పుడే మా ఆందోళనను సీరియస్‌గా తీసుకుని ఉంటే.. కనీసం నలుగురైదుగురు చిన్నారులు.. ఇప్పుడు స్కూళ్లకు వెళ్లి ఉండేవారని నేను నమ్మకంగా చెప్పగలను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

2017 ఏప్రిల్‌ నాటికి గానీ లూసీ గురించి ఫిర్యాదు చేసేందుకు తమను నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ అనుమతించలేదని రవి జయరాం తెలిపారు. ‘‘అప్పుడు మేం పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన ఉదంతాన్ని వివరించాం. 10 నిమిషాల్లోనే వారికి పరిస్థితి అర్థమైంది. ఆ వెంటనే వారు దర్యాప్తు ప్రారంభించి లూసీని అరెస్టు చేశారు’’ అని రవి కేసు గురించి వివరించారు.

నవజాత శిశువుల వార్డులో విధులు నిర్వహించిన లూసీ..  ఇంజెక్షన్‌ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్‌ గొట్టాల ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం వంటివి చేసింది. తద్వారా శ్వాసనాళాలకు అంతరాయం కలిగించడంతో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు చిన్నారులపై కూడా లూసీ ఇలాంటి దారుణాలకే పాల్పడగా.. వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 2018 జులైలో లూసీని పోలీసులు అరెస్టు చేశారు. నవంబరు 2020న అభియోగాలు మోపగా.. తాజాగా ఆమెను దోషిగా తేల్చారు. సోమవారం ఆమెకు శిక్ష ఖరారు కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని