Lucy Letby - British Nurse: ఆ నర్సు ఓ నరరూప రాక్షసి

నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ నర్సు ఉన్మాదిగా మారింది. ఆసుపత్రిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది.

Updated : 19 Aug 2023 10:50 IST

ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన లూసీ

లండన్‌: నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ నర్సు ఉన్మాదిగా మారింది. ఆసుపత్రిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. పసిగుడ్డుల ప్రాణం తీయడానికి ఆమె ఎంచుకున్న మార్గాలు మానవత్వానికి మచ్చలా నిలిచాయి. ఇంజెక్షన్‌ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్‌ గొట్టాల ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం, శ్వాసనాళాలకు అంతరాయం కలిగించడం చేసినట్లు తేలింది. మరో ఆరుగురు శిశువులనూ చంపడానికి యత్నించినట్లు వెల్లడైంది. ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న లూసీ లెబ్టీ(33) ఈ దారుణాలకు ఒడిగట్టింది. మాంచెస్టర్‌ క్రౌన్‌ కోర్టు శుక్రవారం ఆమెను దోషిగా తేలింది. సోమవారం ఆమెకు శిక్ష ఖరారు చేయనుంది. లూసీ 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి ఏడుగురు శిశువులు మృతి చెందారు.

ఈ అన్ని సందర్భాల్లోనూ ఆస్పత్రి నవజాత శిశువుల వార్డులో లూసీ విధుల్లో ఉన్నట్లు తేలింది. భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శిశుమరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో.. ‘నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను. ఎందుకంటే నేను వారిని చూసుకునేంత మంచిదాన్ని కాదు’ అని రాసి ఉన్న కాగితాలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో కోర్టు విచారణ మొదలైంది. అయితే, లెట్బీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్‌ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరఫు లాయర్‌ వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని