Iran rial: డాలరుకు 6లక్షల రియాల్స్‌.. రికార్డు స్థాయిలో పతనం

ఇరాన్‌లో (Iran) హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతోన్న వేళ.. అక్కడి కరెన్సీ (Currency) కూడా రికార్డు స్థాయిలో పతనమవుతోంది. తాజాగా అమెరికా డాలరుకు (Dollar) 6లక్షల రియాళ్లకు పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.

Published : 27 Feb 2023 01:37 IST

దుబాయ్: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌ (Iran) ఐదారు నెలలుగా అట్టుడుకిపోతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌ స్థానిక కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. అమెరికా డాలరుతో (US Dollar) పోలిస్తే 6లక్షల ఇరానియన్‌ రియాల్స్‌కు (Iranian Rial) పడిపోయింది. మూడు రోజుల క్రితం అది 5లక్షల రియాల్‌లుగా ఉండగా.. తాజాగా అది మరింత క్షీణించడం గమనార్హం. అయితే, డాలరుకు 6లక్షలకు పడిపోవడం మాత్రం ఇదే తొలిసారి.

కొన్ని దశాబ్దాలుగా అమెరికా డాలరుతో పోలిస్తే ఇరాన్‌ కరెన్సీ భారీగానే పతనమవుతోంది. 1979లో ఇస్లామిక్‌ విప్లవం సమయంలో డాలరుకు 100 రియాల్స్‌ వద్ద ట్రేడ్‌ అయిన ఇరానియన్‌ కరెన్సీ.. క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2015లో జరిగిన న్యూక్లియర్‌ ఒప్పందం తర్వాత ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేశారు. ఆ సమయంలో ఇరాన్‌ కరెన్సీ విలువ అమెరికా డాలరుకు 32,000 రియాల్స్‌గా ఉంది. తాజాగా అక్కడ హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు ఎక్కువ కావడంతో పాశ్చాత్య దేశాల ఆంక్షలు మొదలయ్యాయి. ఇలా గత ఆరు నెలల కాలంలో ఇరాన్‌ కరెన్సీ విలువ 60శాతం పతనమైంది. గత ఆగస్టులో 3లక్షల రియాల్స్‌గా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి 5లక్షల రియాల్స్‌కు చేరువైంది. తాజాగా మరింత దిగజారి 6లక్షల రియాల్స్‌తో అత్యంత కనిష్ఠానికి చేరుకుంది.

మరోవైపు ఇరాన్‌లో 2021 జనవరిలో 41.4గా ఉన్న ద్రవ్యోల్బణం రేటు ప్రస్తుతం 53.4శాతానికి చేరినట్లు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇరాన్‌ ప్రభుత్వం తమ కరెన్సీని భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అయితే, మనీలాండరింగ్‌తో ఇరాన్‌, సిరియా దేశాలకు అక్రమంగా నగదు తరలివెళ్లడం వల్లే ఇరాన్‌కు డాలర్ల బదిలీపై అమెరికా ఆంక్షలు విధిస్తోందని అక్కడి బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. పరిస్థితులు మరికొంతకాలం ఇలాగే కొనసాగితే అక్కడి పౌరులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదనే భయాలు మొదలయ్యాయి. ఇలా భారీ స్థాయిలో కరెన్సీ విలువ పడిపోతోన్న నేపథ్యంలో అక్కడి పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై చర్చించినట్లు సమాచారం.

ఇదిలాఉంటే, ఇరాన్‌ అధికారిక కరెన్సీ రియాల్‌. కానీ, అక్కడి ప్రజలు స్థానిక అవసరాల కోసం తోమాన్‌ను వినియోగిస్తారు. ఒక తోమాన్‌కు పది రియాళ్లు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని