G20 summit: భారత్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్‌ డుమ్మా..?

జి20 సదస్సు(G20 summit)కు చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌(Xi Jinping) హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతలు, మ్యాప్‌ వివాదం నడుస్తోన్న సమయంలో ఈ వార్తలు వెలువడటం గమనార్హం. 

Updated : 31 Aug 2023 12:50 IST

బీజింగ్‌: జి 20(G20) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్(India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Chinese President Xi Jinping ) హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

సెప్టెంబర్ 9-10 తేదీల్లో దిల్లీలో జి20(G20 summit) దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత్‌, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ(PM Modi), జిన్‌పింగ్(Xi Jinping) మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడానికి అవకాశం ఉండొచ్చన్న విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే, ఇప్పుడు ఆయన హాజరుకారన్న వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) కూడా ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. తాను రాలేకపోతున్నానని పుతిన్‌ స్వయంగా మోదీతో చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సుకు హాజరవుతారని చెప్పినట్లు సమాచారం. 

నాడు సరేనని.. నేడు మాదేనని!

2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. వీటిని తగ్గించడంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక, దౌత్యస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు భారత్‌ ఒకవైపు జి20 సదస్సు(G20 summit)కు ఏర్పాట్లు చేస్తుంటే.. చైనా సరికొత్త మ్యాప్‌తో వివాదం మొదలుపెట్టింది. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా అందులో పేర్కొంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇక ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ (BRICS) సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వాస్తవానికి వీరి మధ్య ద్వైపాక్షిక భేటీ ఉంటుందని వార్తలు వచ్చినా అది జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని