Biden: అధ్యక్ష పోటీకి బైడెన్, ట్రంప్‌ అభ్యర్థిత్వాల ఖరారు

Biden: అమెరికా అధ్యక్ష పీఠం కోసం మరోసారి బైడెన్‌, ట్రంప్‌ పోటీ పడనున్నారు. ఇప్పటికే దీనిపై దాదాపు స్పష్టత వచ్చినప్పటికీ.. తాజాగా అధికారికంగానూ ఖాయమైంది.

Updated : 13 Mar 2024 11:55 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున జో బైడెన్‌ (Joe Biden) నామినేషన్‌ ఖరారైంది! కేవలం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో ఆయన గెలుపొందారు. దీంతో పార్టీ నుంచి నామినేట్‌ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. వాషింగ్టన్‌, మిస్సిసిపీ, నార్తర్న్‌ మరియానా ఐలాండ్స్‌లోనూ ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

‘‘ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల ముందు ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన స్వేచ్ఛను, భ్రదతను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని లాక్కునేవారికి అవకాశమిస్తారా?’’ అని జార్జియాలో విజయం తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్‌ (Joe Biden) అన్నారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. తాజాగా వాషింగ్టన్‌ ప్రైమరీలోనూ ఆయన విజయం సాధించారు. దీంతో నామినేషన్‌కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు లభించింది. ఈరోజు వెలువడనున్న మరికొన్ని ప్రైమరీల్లోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. చివరి వరకు పోటీగా నిలిచిన నిక్కీ హేలీ సైతం రేసు నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్‌, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని