Srilanka Crisis: గో.. గొటబాయ.. గో..గో.. 1000 కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె

వ్యాపారాలు మూతపడ్డాయ్‌.. టీచర్లు స్కూళ్లకు హాజరు కాలేదు.. ప్రజా రవాణా కుంటుపడింది.. కొలంబో రోడ్లు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి.. శ్రీలంకలో కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో......

Updated : 10 Sep 2022 15:13 IST

కొలంబో: వ్యాపారాలు మూతపడ్డాయ్‌.. టీచర్లు స్కూళ్లకు హాజరు కాలేదు.. ప్రజా రవాణా కుంటుపడింది.. కొలంబో రోడ్లు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి.. శ్రీలంకలో కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో గురువారం నెలకొన్న పరిస్థితి ఇది..! తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకీ మరింతగా క్షీణిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఘోరంగా విఫలమయ్యారంటూ అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దాదాపు 1000కి పైగా కార్మిక సంఘాలు గురువారం ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో వైద్య రంగంతో పాటు పోర్టులు, విద్యుత్‌, విద్య, పోస్టల్‌ తదితర రంగాలకు చెందిన కార్మికులు భారీగా పాల్గొని రాజపక్స సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంక్షోభానికి బాధ్యులైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజక్సతో పాటు శ్రీలంక ప్రభుత్వం తక్షణమే అధికారం నుంచి దిగిపోవాలంటూ నినదించారు.

వారం రోజులే గడువు.. లేకపోతే!

విదేశీ మారకద్రవ్య లోటు కారణంగా శ్రీలంకలో ఆహార పదార్థాలు, ఇంధనం దిగుమతి చేసుకోలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అన్ని వస్తువుల ధరలు భారీగా పెరగడంతో కొనుక్కోలేక గత కొన్నాళ్లుగా ప్రజల ఆకలి మంటలతో, ఆర్తనాదాలతో శ్రీలంక రగులుతోంది. ద్రవ్యోల్బణం పెరగడం, ఆహార పదార్థాలను కొనుక్కోనే పరిస్థితి లేకపోవడంతో జనం రోడ్డెక్కి ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ‘ప్రజలకు తలవంచి.. ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోవాలి’ అంటూ సమ్మెకు దిగి నినదిస్తున్నారు. దేశ ప్రజలు రోడ్లెక్కి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నా వినకుండా రాజపక్స ప్రభుత్వం అధికారం పట్టుకొని వేలాడుతోందని ఉపాధ్యాయ సంఘాల అధికార ప్రతినిధి జోసెఫ్‌ స్టాలిన్‌ మండిపడ్డారు. తాము గురువారం సమ్మె తర్వాత ప్రభుత్వానికి ఒక వారం రోజులు గడువు ఇస్తామనీ.. ఒకవేళ అప్పటికే రాజీనామా చేయకపోతే ఆ తర్వాత గొటబాయ సర్కార్‌ దిగేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆరోగ్యరంగ కార్మిక సంఘం ప్రతినిధి రవి కుముదేశ్‌ హెచ్చరించారు. ఈరోజు జరిగిన సమ్మెలో దాదాపు 1000కి పైగా కార్మిక సంఘాలు పాల్గొన్నాయని చెప్పారు.

బోసిపోయిన వీధులు.. మార్కెట్లు!

మరోవైపు, శ్రీలంకలోని అన్ని బ్యాంకులూ మూతబడిపోయాయయనీ.. ప్రభుత్వ యాజమాన్యంలోని కొన్ని బస్సులు మాత్రమే నడవడంతో ప్రజారవాణా వ్యవస్థ కుంటుపడిందని బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ సమ్మెలో ప్లాంటేషన్‌ కార్మికులు వేలాదిగా పాల్గొన్నట్టు ప్రతిపక్ష నేత మనో గణేషణ్‌ తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా భోజన విరామ సమయంలో నిరసన తెలుపుతున్నట్టు వైద్యులు, నర్సులు తెలిపారు. గురువారం కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో వీధులు, వాణిజ్య మార్కెట్లు బోసిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని