Trump: అమెరికాలో మళ్లీ తెల్లపొడి కలకలం.. ట్రంప్‌ కుమారుడికి పంపిన దుండగులు

Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కుమారుడికి బెదిరింపు లేఖ వచ్చింది. అందులో తెల్లపొడి ఉండటంతో భద్రతా సిబ్బంది అలర్ట్‌ అయ్యారు.

Published : 27 Feb 2024 13:11 IST

మయామి: అగ్రరాజ్యం అమెరికా (USA)లో మరోసారి తెల్లపొడి (White Powder) కలకలం సృష్టించింది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి పోటీ పడుతున్న వేళ..  పెద్ద కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ (Donald Trump Jr)కు వైట్‌ పౌడర్‌తో ఉన్న ఓ లేఖ వచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ఫ్లోరిడాలోని ట్రంప్‌ జూనియర్‌ హోం ఆఫీసుకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు. దాన్ని తెరవగా తెల్లపొడి అంటుకుంది. దీంతో అత్యవసర సిబ్బందికి సమాచారమివ్వగా వారు ఆ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పొడి ఏంటన్నది తెలియరానప్పటికీ.. అంత ప్రమాదకరం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సీక్రెట్‌ సర్వీస్‌ విభాగంతో కలిసి పామ్‌ బీచ్‌ షెరీఫ్‌ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిస్తే ఉపాధ్యక్షుడెవరు?

కాగా.. ట్రంప్‌ జూనియర్‌కు ఇలా దుండగులు తెల్లపొడి పంపించడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఓ సారి వైట్‌పౌడర్‌తో ఉన్న లేఖ రాగా.. దాన్ని ఆయన భార్య తెరవడంతో అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులు ఆసుపత్రితో చికిత్స తీసుకున్నారు. అంతకుముందు 2016లో ట్రంప్‌ మరో కుమారుడు ఎరిక్‌కు కూడా ఇలాంటి లేఖనే పంపారు. ట్రంప్‌ టవర్‌కు రెండుసార్లు తెల్లపొడి కవర్స్‌ వచ్చాయి.

అమెరికాలో 2001లో తొలిసారి ఈ వైట్‌పౌడర్‌ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పలు మీడియా సంస్థలు, ఇద్దరు సెనెటర్ల కార్యాలయాలకు ప్రమాదకర ఆంత్రాక్స్‌తో కూడిన లెటర్లను దుండగులు పంపించారు. వాటి కారణంగా అప్పట్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని