అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిస్తే ఉపాధ్యక్షుడెవరు?

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం డొనాల్డ్‌ ట్రంప్‌ (77)ను వరించడం ఖాయమని తేలిపోయింది.

Published : 27 Feb 2024 04:27 IST

 వివేక్‌ రామస్వామికి గట్టి పోటీ ఇస్తున్న క్రిస్టీ నోయెమ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం డొనాల్డ్‌ ట్రంప్‌ (77)ను వరించడం ఖాయమని తేలిపోయింది. నవంబరు ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా ట్రంప్‌ విజయం సాధిస్తే... ఉపాధ్యక్ష పదవి (రన్నింగ్‌ మేట్‌) ఎవరిని వరించవచ్చనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కన్సర్వేటివ్‌ రాజకీయ కార్యాచరణ సంస్థ (సీపీఏసి) అనధికార సర్వే నిర్వహించింది. దాని ప్రకారం... భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి (38), సౌత్‌ డకోటా మహిళా గవర్నర్‌ క్రిస్టీ నోయెమ్‌లకు మితవాద ఓటర్ల నుంచి చెరి 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ అనధికార సర్వే వివరాలను శనివారం వెల్లడించారు. భారత సంతతి నాయకురాలు తులసీ గబ్బర్డ్‌కు 9 శాతం మంది, న్యూయార్క్‌ ఎం.పి. ఎలిసి స్టెపానిక్‌, సౌత్‌ కరోలినా సెనెటర్‌ టిమ్‌ స్కాట్‌లకు చెరి 8 శాతం మంది మద్దతు లభించింది. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామికి గట్టి పోటీ ఎదురవుతోందని సర్వే ద్వారా స్పష్టమవుతోంది. వివేక్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న క్రిస్టి నోయెమ్‌ 2018లో ట్రంప్‌ మద్దతుతో సౌత్‌ డకోటాకు మొదటి మహిళా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతి సమయంలో టీకాలు వేయించుకోవడం, ముఖానికి మాస్క్‌లు ధరించేలా రాష్ట్రవ్యాప్త ఆదేశాలను జారీ చేయడానికి ఆమె నిరాకరించడం వల్ల వార్తల్లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని