Mahatma Gandhi: మహాత్ముడు మళ్లీ వచ్చే.. ఐరాసలో జాతిపిత ప్రసంగం

 ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఓ చర్చావేదికలో భారత జాతిపిత మహాత్మా గాంధీ హోలోగ్రామ్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యపై ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Published : 02 Oct 2022 01:36 IST

యునైటెడ్ నేషన్స్‌: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గాంధీజీ ప్రత్యేక అతిథిగా కన్పించారు. కన్పించడమే కాదు.. విద్యపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. అదేంటీ.. ఐరాసకు జాతిపిత రావడం ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? అదంతా టెక్నాలజీ మాయ మరి..!

యునెస్కో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ (ఎంజీఐఈపీ) 10వ వార్షికోత్సవాలను శుక్రవారం ఐరాసలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహింసా లెక్చర్‌ సిరీస్‌ సందర్భంగా ఐరాసకు భారత ప్రతినిధి బృందం.. గాంధీజీ హోలోగ్రామ్‌ను ప్రదర్శించింది.

ఆ హోలోగ్రామ్‌ను చూడగానే అచ్చం జాతిపితే సమావేశాలకు వచ్చారా అన్న భావన కలిగింది. ఈ హోలోగ్రామ్‌కు ఉన్న వాయిస్‌ ఓవర్‌.. విద్యపై మహాత్ముడి అంచనాలను పంచుకుంది. దీంతో గాంధీజీ స్వయంగా మాట్లాడుతున్నట్లు కన్పించింది. ‘‘అక్షరాస్యత అనేది విద్యకు ముగింపు లేదా ప్రారంభం కాదు. విద్యావిధానం ద్వారానే ఓ పిల్లాడు/వ్యక్తిలోని ఉత్తమమైన లక్షణాలు బయటకు తీసుకురావొచ్చు. ఆధ్యాత్మిక శిక్షణ కూడా విద్యా విధానానికి కేంద్ర బిందువుగా ఉంటుంది’’ అంటూ గాంధీ మాట్లాడారు.

ఈ ప్యానెల్‌ చర్చలో ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌, ది కింగ్‌ సెంటర్‌ సీఈవో అట్లాంటా బెర్నిస్‌ కింగ్‌, డిజిటల్ విద్యపై యువ ప్రతినిధి, ఇండోనేషియా రాకుమారి హయు పాల్గొన్నారు. అంతకుముందు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ప్రసంగించారు. శాంతియుత, సహనంతో కూడిన సమాజానికి గాంధీజీ జీవితం ఓ మార్గం చూపిస్తుందని ఆయన కొనియాడారు. ఈ మార్గాన్ని మనమంతా కలిసి అనుసరించాలని, వసుధైక కుటుంబంలా ముందుకు సాగాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

ఈ హోలోగ్రమ్‌ను హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ డిజిటల్‌ మ్యూజియం రూపొందించింది. ఇది గాంధీజీ హోలోగ్రామ్‌లో రెండో ఎడిషన్‌ అని ఈ మ్యూజియం డైరెక్టర్‌ బిరాడ్‌ యాజ్నిక్‌ తెలిపారు. డిజిటల్‌ గ్రాఫిక్‌ ఫైల్స్‌ను సంగ్రహించి వాటిని మోషన్‌ గ్రాఫిక్స్‌తో కలిపామని, దీంతో హోలోగ్రామ్‌ స్క్రిప్ట్‌ను చదివేలా చేశామన్నారు. భవిష్యత్తులో హోలోగ్రామ్‌లకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను జోడించి.. అప్పుడు నేరుగా వ్యక్తులతో మాట్లాడేలా రూపొందించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని