Ukraine Crisis: ఉక్రెయిన్ యుద్ధం వేళ.. అది మోదీకి మాత్రమే సాధ్యం..!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఎనిమిది నెలలు కావొస్తోంది.

Updated : 23 Sep 2022 14:55 IST

న్యూయార్క్‌: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఎనిమిది నెలలు కావొస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ సమాజం తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ఈ రెండింటి మధ్య శాంతి నెలకొల్పడం భారత ప్రధాని మోదీకి మాత్రమే సాధ్యమంటూ మెక్సికో వ్యాఖ్యానించడం గమనార్హం. 

‘రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం తనవంతు ప్రయత్నించాలి. ఈ ఉద్దేశంతో మెక్సికో అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను. ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం కోసం ఇతర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దానిలో వీలైతే భారత ప్రధాని మోదీ, పోప్ ఫ్రాన్సిస్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ను చేర్చాలని ప్రతిపాదించారు’ అని ఉక్రెయిన్‌పై ఐరాసలో జరిగిన చర్చలో భాగంగా మెక్సికో విదేశాంగ మంత్రి వెల్లడించారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రక్రియలో మోదీ కీలకం కానున్నారనే అర్థంలో ఆయన స్పందించారు. అలాగే గుటెర్రస్‌ చెప్పినట్లుగా ఇది శాంతికి కట్టుబడాల్సిన సమయమని, చర్చలు, దౌత్యం ద్వారా ఘర్షణలు తగ్గించగలమన్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో మోదీ పుతిన్‌తో మాట్లాడుతూ... ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని అన్నారు. ఆయన ఇచ్చిన సూచనను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. ‘ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో భారత వైఖరిని గౌరవిస్తున్న పుతిన్‌, శాంతిని స్థాపించాలన్న స్వరాలను కూడా వింటారని భావిస్తున్నా’ అని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవరీ ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ స్పందించిన తీరుపై అమెరికా రక్షణ కార్యాలయం కూడా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని