Mali: బంగారు గని కూలి 70 మందికిపైగా మృతి

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో బంగారు గని కూలి ఘటనలో సుమారు 70 మంది మృతి చెందారు. 

Updated : 25 Jan 2024 15:24 IST

బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. అనధికారికంగా తవ్వకాలు చేపట్టే ఓ బంగారు గని కుప్ప కూలి 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అక్కడి అధికారులు పేర్కొన్నారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గత శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది.

‘‘బంగారు గని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. అనధికారిక మైనింగ్‌ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. మైనింగ్‌ సమయంలో ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. మృతుల్లో అనేక మంది మైనర్లు ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిసనల్ మైనింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఆ దేశ గనుల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా మాలి ఉంది. ఈ దేశంలో గనుల ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని