Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్‌ స్పందన ఇదే!

రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ సైనికులను పంపే ప్రణాళికలు లేవని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పష్టం చేశారు.

Published : 02 Oct 2023 02:04 IST

మాంచెస్టర్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో కీవ్‌కు మద్దతుగా తమ సైనిక శిక్షకులను పంపించే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ఉక్రెయిన్‌ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు తమ దేశం నుంచి శిక్షకులను పంపిస్తామన్న ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇవాళ్టి వరకు రష్యాతో ప్రత్యక్ష సంఘర్షణ ప్రమాదాన్ని తగ్గించేందుకే బ్రిటన్‌, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌లో తమ సైన్యాన్ని మోహరించలేదని ఆయన అన్నారు.

గత నెలలో బ్రిటన్‌ రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గ్రాంట్‌ షప్స్‌ టెలిగ్రాఫ్‌ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ నుంచి శిక్షకులను పంపాలని ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ సైనికులకు బ్రిటన్‌, పశ్చిమదేశాల్లో శిక్షణ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైన గంటల వ్యవధిలోనే  ప్రధాని సునాక్‌ స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేశారు. మాంచెస్టర్‌లో జరిగిన పాలక కన్జర్వేటివ్‌ పార్టీ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో శిక్షణ ఇవ్వడం భవిష్యత్‌లో ఏదో ఒక రోజు సాధ్యమవుతుందని రక్షణ శాఖ మంత్రి చెబుతున్నారు. కానీ, అది దీర్ఘకాలానికి సంబంధించిన అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి బ్రిటన్‌ సైనికులనుగానీ, శిక్షకులను గానీ పంపబోము’’ అని రిషి సునాక్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని