EVMs: ఈవీఎంలకు బై బై చెప్పిన పాకిస్థాన్‌..!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల సంస్కరణలకు చరమగీతం పాడుతోన్న నూతన ప్రభుత్వం.. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను వినియోగించకూడదని నిర్ణయించింది.

Published : 27 May 2022 01:58 IST

ఇస్లామాబాద్‌: ఎన్నికల సంస్కరణల్లో భాగంగా పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులకు ప్రస్తుత ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను వినియోగించకూడదని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో ఉండేవారు ఐ-ఓటింగ్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలును కూడా రద్దుచేసింది.

నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సంస్కరణలపై రూపొందించిన బిల్లును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ముర్తాజా జావేద్‌ అబ్బాసీ దిగువ సభలో ప్రవేశపెట్టారు. దీనికి గ్రాండ్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌(GDA) మినహా మిగతా వారి మద్దతు లభించడంతో ఈ బిల్లుకు దిగువసభ ఆమోదం తెలిపింది. అనంతరం సమీక్షకోసం ఏ కమిటీకి పంపించే అవసరం లేకుండా నేరుగా బిల్లు ఆమోదం కోసం సెనేట్‌కు పంపించబడుతుందని అబ్బాసీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం 2017లో ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్‌ ఓటింగ్‌తో పాటు ఈవీఎంల వినియోగించాలని నిర్ణయించింది. అయితే, ఇటీవల పాకిస్థాన్‌ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడం.. అక్కడ ప్రభుత్వం మారడం వంటివి చకచకా జరిగిపోయాయి. దీంతో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తాము ఐ-ఓటింగ్‌, ఈవీఎం సహాయంతో వీటిని నిర్వహించలేమంటూ పాకిస్థాన్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నిస్సహాయత వ్యక్తం చేసింది. సాంకేతికతకు వ్యతిరేకం కానప్పటికీ కొన్ని సవాళ్ల దృష్ట్యా వాటికి దూరంగా ఉండడమే మంచిదని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని