Putin: ఉక్రెయిన్‌లో 6.17 లక్షల మంది రష్యన్‌ సైనికులు..!

ఉక్రెయిన్‌ విషయంలో తమ లక్ష్యాలేవీ మారలేదని, వాటిని సాధించే వరకు శాంతి స్థాపన ప్రస్తావనే ఉండదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు.

Published : 14 Dec 2023 21:24 IST

మాస్కో: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) సైనిక చర్య మొదలై 22 నెలలు కావొస్తోంది. సైన్యం విషయంలో ఇరువైపులా పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నడుమ రష్యా అధినేత పుతిన్‌ (Vladimir Putin) అరుదైన సమాచారం పంచుకున్నారు. రష్యాకు చెందిన దాదాపు 6.17 లక్షల మంది సైనికులు ప్రస్తుతం యుద్ధభూమిలో ఉన్నారని తెలిపారు. మాస్కో వేదికగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్‌ ఈ మేరకు మాట్లాడారు. ఉక్రెయిన్‌ విషయంలో తమ లక్ష్యాలేవీ మారలేదని, వాటిని సాధించే వరకు శాంతి స్థాపన ప్రస్తావనే ఉండదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ నిస్సైనికీకరణ, నాజీవాదం నిర్మూలన, తటస్థ వైఖరి అవలంబించాలనే లక్ష్యాలతో ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్య (Special Military Operation)ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

గాజాలో వేలల్లో మరణాలు.. ఆ ‘డంబ్‌ బాంబ్స్‌’ కారణమా..?

‘‘ప్రస్తుతం ఉక్రెయిన్‌లో దాదాపు 6.17 లక్షల మంది రష్యా సైనికులు ఉన్నారు. వారిలో దాదాపు 2.24 లక్షల మందిని సుశిక్షిత సైనిక బలగాలతో కలిసి పోరాడేందుకు సమీకరించాం. ప్రస్తుతానికి మరో సైనిక సమీకరణ అవసరం లేదు. దేశవ్యాప్తంగా రోజూ 1500 మంది కొత్తగా సైన్యంలో చేరుతున్నారు. బుధవారానికి 4.86 లక్షల మంది సైనికులు రష్యా సైన్యంతో సంతకాలు చేశారు’’ అని పుతిన్‌ వెల్లడించారు. మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాత్రికేయులతోపాటు సామాన్య పౌరుల నుంచీ ఫోన్‌ ద్వారా ప్రశ్నలను ఆహ్వానించారు. రెండు వారాల వ్యవధిలో దాదాపు 20 లక్షల ప్రశ్నలు వచ్చినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. గతేడాది పుతిన్‌ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించలేదు. రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న పుతిన్‌ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన వేళ.. ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు