Rishi Sunak: రిషి సునాక్‌ ఇంటిపై నల్లటి వస్త్రం.. పర్యావరణ ఆందోళనకారుల నిరసన

బ్రిటన్‌ ప్రధాని నిర్ణయాలపై పర్యావరణ వేత్తలు గుర్రుగా ఉన్నారు. ఉత్తర ఇంగ్లాండ్‌లోని ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. 

Updated : 03 Aug 2023 16:21 IST

(source: Greenpeace UK)

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషిసునాక్‌ ప్రైవేటు గృహం వద్ద పర్యావరణకారులు ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటిపై ఓ నల్లటి వస్త్రాన్ని కప్పి నిరసన వ్యక్తం చేశారు. చమురు బావుల తవ్వకాలపై ఆయన ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. ఈ మేరకు గ్రీన్‌పీస్‌ యూకే సంఘం ఆందోళన చిత్రాలను ట్విటర్లో (ఎక్స్‌)లో పోస్టు చేసింది. ఈ చిత్రంలో ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లోని రిషి సునాక్‌ ఇంటిపైకి కొందరు ఎక్కి నల్లటి వస్త్రాన్ని కప్పేసినట్లుంది. మరో ఇద్దరు ఆందోళనకారులు ‘‘రిషి సునాక్‌- చమురు లాభాలా.. మా భవిష్యత్తా..?’’ అన్ని నినాదాలు రాసిన బ్యానర్‌ను పట్టుకొన్నారు. ‘‘మా ప్రధాని పర్యావరణ పరిరక్షణలో ముందుండాల్సిన అవసరం ఉంది.. పర్యావరణ విధ్వంసంలో కాదు’’ అని గ్రీన్‌పీస్‌ యూకే పేర్కొంది. 

ఈ ఘటనపై ప్రధాని రిషి సునాక్‌ కార్యాలయం స్పందించింది. పోలీసులు అక్కడే ఉన్నారని తెలిపింది. ‘‘దేశ ఇంధన భద్రత, వనరుల సద్వినియోగం కోసం తీసుకొన్న సరైన నిర్ణయంపై ఎటువంటి పశ్చాత్తాపం లేదు. మనం పుతిన్‌ వంటి ఆక్రమణదారులపై ఇంధనం కోసం ఆధారపడలేము’’ అని పేర్కొంది. బుధవారం తాను సెలవులో ఉన్నట్లు సునాక్‌ వెల్లడించారు. 

USA: అమెరికా క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లో కలకలం.. అగంతకుడి కోసం పోలీసులు తీవ్ర గాలింపు

2019లో థెరిస్సామే ప్రధానిగా ఉన్న సమయంలో బ్రిటన్‌ 2050 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించే విధానాన్ని చేపట్టింది. అదే సమయంలో వేగంగా పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకొంటామని పేర్కొంది. కానీ, ఈ విధానానికి భిన్నంగా సునాక్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉత్తర సముద్రంలో చమురు, గ్యాస్‌ వెలికితీతకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులిచ్చారని చెబుతున్నారు. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారి డిసెంబర్‌లో ఓ భారీ బొగ్గుగనికి సునాక్‌ ప్రభుత్వం అనుమతించిందనే విమర్శలున్నాయి. 

మరో వైపు సునాక్‌ మాత్రం ప్రభుత్వ వైఖరిని సమర్థించుకొన్నారు. తమ ప్రభుత్వం ఇతర దేశాలతో పోలిస్తే పర్యావరణ పరిరక్షణకు మెరుగ్గా పనిచేసిందని చెప్పుకొన్నారు. బుధవారం వెలువడిన ఓ సర్వేలో సునాక్‌ ప్రభుత్వం పర్యావరణ అంశాల్లో అధ్వానంగా ఉందని 67శాతం మంది పేర్కొన్నారు. 2019 తర్వాత ప్రభుత్వానికి వచ్చిన అత్యంత చెత్తరేటింగ్‌ ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని