Russia: ప్రచ్ఛన్న యుద్ధం నాటి కీలక ఒప్పందం.. రష్యా అధికారికంగా బయటకు!

‘ఐరోపాలో సంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం’ నుంచి రష్యా అధికారికంగా వైదొలిగింది.

Published : 07 Nov 2023 18:39 IST

మాస్కో: ప్రచ్ఛన్న యుద్ధ కాలం (Cold War) నాటి ఓ కీలక భద్రతా ఒప్పందం నుంచి రష్యా (Russia) అధికారికంగా వైదొలిగింది. ఈ ప్రక్రియ తాజాగా పూర్తయినట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘ఐరోపాలో సంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం (CFE Treaty)’ నుంచి వైదొలుగుతామంటూ ఎనిమిదేళ్ల క్రితమే మాస్కో ఓ ప్రకటన చేయగా.. తాజాగా అది కార్యరూపం దాల్చింది. ఈ ఒప్పందాన్ని ఖండిస్తూ అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించిన బిల్లును రష్యా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. రష్యా చర్యకు ప్రతిస్పందనగా నాటో (NATO) సైతం.. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా ఆధ్వర్యంలోని ‘నాటో’, అప్పటి సోవియట్‌ యూనియన్‌ నేతృత్వంలోని ‘వార్సా ఒప్పందం’లోని దేశాల మధ్య ‘ఐరోపాలో సంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం’ కుదిరింది. 1990 నవంబరు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో 22 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. ఇందులో నాటోకు చెందిన 16 దేశాలు, అప్పటి వార్సాకూటమికి చెందిన ఆరు దేశాలు ఉన్నాయి. ప్రత్యర్థి దేశాలు తమ పరస్పర సరిహద్దుల వద్ద, సమీపంలో ఆయుధ సంపత్తి మోహరింపును నియంత్రించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది. రెండేళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. అయితే.. కొన్నేళ్లుగా ఇది నిలిచిపోయింది.

ఇజ్రాయెల్‌ కాస్త తగ్గుతోందా..?పరిశీలనలో యుద్ధానికి స్వల్ప విరామాలు..!

రష్యా 2007లోనే ఈ ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. 2015లో ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తాజాగా అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. అమెరికా, దాని మిత్రదేశాల వైఖరే దీనికి కారణమయ్యిందని మాస్కో ఆరోపించింది. ఉక్రెయిన్‌లోని పరిణామాలు, నాటో విస్తరణను ఉటంకిస్తూ.. రష్యా ప్రాథమిక భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ వ్యవహారంపై చర్చల కోసం తలుపులు తెరచి ఉంచినా.. ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదని విమర్శించింది. మరోవైపు.. 1990లో ఈ ఒప్పందంపై సంతకం చేసిన సభ్యదేశాలు కూడా తమ భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు ‘నాటో’ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని