Canary Islands : నేనో జలకన్యని.. మృత్యుమడుగులో దిగి స్పానిష్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ పోజులు!

కేనరీ ఐలాండ్స్‌లోని (Canary Islands) ఓ గుహలో స్పానిష్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ (Influencer) మెరీనా రివెరా సల్డానా (Marina Rivera Saldana) ఈత కొట్టింది. ఫొటోషూట్‌ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఆమె అడుగుపెట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. 

Updated : 06 Sep 2023 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్ : మృత్యుమడుగుగా పేరొందిన ప్రదేశంలో ఈతకొడుతూ స్పానిష్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ (Influencer) ఒకరు ఫొటోలకు పోజులివ్వడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. పలువురు ప్రాణాలు కోల్పోయిన చోట ఇలాంటి ఫొటోషూట్‌లు మంచిది కాదని వారు ఆమెకు హితవు పలికారు. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌కు చెందిన మెరీనా రివెరా సల్డానా (Marina Rivera Saldana) సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, టిక్‌టాక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో కలిపి ఆమెకు 90 లక్షల మంది ఫాలోవర్లున్నారు. అందులో తరచూ తాను సందర్శించిన అందమైన ప్రదేశాల చిత్రాలను పోస్టు చేస్తుంటుంది. తాజాగా ఆమె కేనరీ ఐలాండ్స్‌లోని (Canary Islands) టెనెరిఫ్‌ ద్వీపానికి వెళ్లింది. అక్కడి ఈఎల్ టాంకోన్‌ గుహలోని నీలి జలాల్లో దిగి ఈతకొట్టింది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘నేనో చిన్న జలకన్యగా మారిపోయా’ అంటూ పోస్టులు పెట్టింది. 

‘ఆఫీసు పనులకు యాపిల్‌ ఫోన్లు వాడొద్దు’.. ప్రభుత్వ ఉద్యోగులకు డ్రాగన్‌ హుకుం!

కేనరీ దీవుల్లోని ఈ సహజసిద్ధమైన గుహలోకి పర్యాటకులకు అనుమతి లేదు. ఇరుకైన ఈ గుహలోని మడుగులో నీరు అత్యద్భుతంగా కనిపిస్తుంటుంది. కానీ, ఆ చోటుకు సహాయక బృందాలు వెళ్లడం కష్టతరమైన పని. 2021 దాకా అక్కడ ఆరుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈత కొట్టడంపై అధికారులు నిషేధం విధించారు. అటువంటి ప్రదేశానికి వెళ్లి ఇన్‌ఫ్లుయెన్సర్‌ మెరీనా ఈతకొట్టడం, ఫొటోలకు పోజులివ్వడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ చర్య చనిపోయిన వారిని అగౌరవపరచడమే కాదు.. ప్రచార యావ కోసం ప్రాణాలను పణంగా పెట్టడమేనని పలువురు ఆమెను తిట్టిపోశారు. 

‘అక్కడ స్నానం చేయడం నిషిద్ధం. మా నేలను గౌరవించని పర్యాటకుల చేష్టలతో మేము విసిగిపోయాం’ అని ఓ వ్యక్తి స్పానిష్‌లో కామెంట్‌ చేశాడు. ‘నిషిద్ధ ప్రాంతంలో మీరు స్నానం చేయడం నచ్చలేదు. అక్కడ కంచె వేసి మరీ స్నానాలు నిషిద్ధమని బోర్డులు పెట్టారు. ఫొటోల కోసం ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ చాలా మంది చనిపోయారు. అది స్విమ్మింగ్‌ చేసేందుకు అనుకూలమైంది కాదని’ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్థానంలో ఉన్న మీరు ఇలాంటి పోస్టులు పెట్టడం మంచిది కాదు. వాటిని తొలగించడం గురించి ఆలోచించండి. మీరు ప్రమాదాల గురించి ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ, ఆ ప్రదేశం మీ ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉందని’ మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు